పేలిన గ్యాస్ బాంబు
- తెరపైకి మళ్లీ నగదు బదిలీ
- సిలిండర్‌కు రూ.960 చెల్లించాల్సిందే..
- ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ
- 10 నుంచి విజయవాడలో అమలు!
- జనవరి నుంచి దేశవ్యాప్తంగా..
- వెల్లువెత్తుతున్న నిరసన
విజయవాడ : దీపావళి పండగకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ‘గ్యాస్ బాంబు’ పేల్చింది. దీంతో పేదల గుండెల్లో మంటలు చెలరేగాయి. గ్యాస్ సరఫరాకు మళ్లీ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా గత యూపీఏ సర్కారు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సంక్షేమ పథకాలకు ఆధార్‌తో లింకు పెట్టవదని సుప్రింకోర్టు కూడా సూచించింది.
ఈ క్రమంలో ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. గత సర్కారు అమలు చేసిన పథకంలోనే కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రారంభించనున్నట్లు తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారులు పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే ఆ తర్వాత సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని శనివారం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, జనవరి నుంచి దేశవాప్తంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి విజయవాడలో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
సిలిండర్‌కు రూ.960 చెల్లించాల్సిందే..!
జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. దాదాపు 11లక్షల మంది వినియోగదారులు సబ్సిడీపై రూ.440కి గ్యాస్ పొందుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల వినియోగదారులు ముందుగా సిలెండర్‌ను రూ.960 చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం రూ.520లను ఢిల్లీలోని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అయితే జిల్లాలోని 11 లక్షల మంది వినియోగదారుల్లో సగం మంది పేదలే కావడంతో ఒకేసారి గ్యాస కోసం రూ.960 వెచ్చించడం కష్టమని వాపోతున్నారు.
గతంలో నానా అవస్థలు
యూపీఏ సర్కారు హయాంలో ఆధార్ నంబరును బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసిన వారికి గ్యాస్ సబ్సిడీ విడుదల చేసేవారు. అయితే సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ కాకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిలిండర్ పొందిన వారం, పది రోజుల వరకు సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది కాదు.
ఆన్‌లైన్‌లో పొరపాట్ల వల్ల ఒక్కోసారి ఒకరి సొమ్ము మరొకరి ఖాతాలో జమయ్యేది. దీంతో వినియోగదారులు బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కొందరు ఆధార్ కార్డులు లేక, మరికొందరు ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం గాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే కష్టాలు తప్పవని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగదు బదిలీ వద్దు : సీపీఎం
నగదు బదిలీ పథకాన్ని అమలు చేయవద్దని సీపీఎం ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు బీసెంట్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. పేదలపై గ్యాస్ భారాన్ని మోపవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ నగదు బదిలీని అమలు చేసిన గత యూపీఏ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. సుప్రింకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సత్తిబాబు, కాజా సరోజ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.