నెల్లూరు(పొగతోట) : ఇంటింటికి వంట గ్యాస్‌ను డెలివరీ చేసే సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రవాణా చార్జీల పేరుతో డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి సిలిండర్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర రూ.847లు ఉంటే రూ.900లు చార్జీ చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారుగా రవాణా చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు సమాచారం. గ్యాస్ రవాణాకు సంబంధించి పైసా కూడా చెల్లించవద్దని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న అక్రమ సంపాదనలో అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమ వసూళ్లపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
కొన్ని ఘటనలు..
♦ జనార్ధన్‌రెడ్డికాలనీకి చెందిన మస్తాన్ వారం రోజుల కిందట గ్యాస్ బుక్ చేశాడు. ఈ నెల 18వ తేదీన గ్యాస్ డెలివరీ సిబ్బంది సిలిండర్ ఇచ్చాడు. స్లిప్‌పై రూ.847 నమోదు చేసి ఉంది. డెలివరీ బాయ్ మాత్రం రూ.900లు వసూలు చేశాడు. అదేమని మస్తాన్ ప్రశ్నిస్తే రవాణా చార్జీ అని సమాధానం చెప్పాడు.
♦ ములాపేటకు చెందిన వెంకటేశ్వర్లు గ్యాస్ బుక్ చేశాడు. ఈనెల 18వ తేదీన గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చారు. సిలిండర్‌కు రూ.900లు వసూలు చేశారు. అదేమని ప్రశ్నిస్తే రవాణా చార్జీలని సమాధానం ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకురావాలి, పనిచేస్తున్న వారికి భోజనం పెట్టి రోజుకు రూ.300లు ఇవ్వాలని, దాని వలనే సిలిండర్‌పై రూ.50 వసూలు చేస్తున్నామని సమాధానం చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 80కి పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 8.90 లక్షలకు పైగా గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 18 నుంచి 20 వేల సిలిండర్లు డెలివరీ జరుగుతోంది. నెలకు ఆరు లక్షలకు పైగా సిలిండర్లు వినియోగదారులకు అందజేస్తున్నారు. సిలిండర్‌కు రూ.50 చొప్పున రవాణా పేరుతో నెలకు రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. గా>్యస్ సిలిండర్లు అధికంగా మహిళలే తీసుకుంటారు. స్లిప్‌పై ఎంత ఉంటుందో పరిశీలించరు. స్లిప్‌పై సంతకం పెట్టి గ్యాస్ డెలివరీకి వచ్చిన వారు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు.
తనిఖీలు లేకపోవడంతోనే..
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేస్తే సిలిండర్లు సక్రమంగా ఇవ్వరని వినియోగదారులు భయపడుతున్నారు. 15 కిలోమీటర్ల లోపు వరకు సిలిండర్ డెలివరీ ఉచితంగా చేయాల్సి ఉంది. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ఏజెన్సీలు రవాణా పేరుతో వినియోగదారుల నుంచి అధికంగా వసూళ్లు చేస్తున్నారు.
రవాణా చార్జీలు చెల్లించనవసరం లేదు
ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించి అదనపు వసూళ్లు చేయకూడదు. వినియోగదారుల స్లిప్‌పై ఎంత ధర ఉంటే అంత వరకు మాత్రమే ఇవ్వాలి. సిలిండర్లను ఉచితంగా రవాణా చేయవలసి ఉంది. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.– బాలకృష్ణారావు, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment