సాక్షి, కర్నూలు(సెంట్రల్) : నంద్యాలలోని ఓ గ్యాస్ ఏజెన్సీ బాయ్ సిలిండర్‌ను డెలివరీకి తెచ్చిన సమయంలో రూ.50 అదనంగా ఇవ్వాలని ఓ మహిళను అడిగాడు. ఎందుకివ్వాలని ఆమె ప్రశ్నించింది. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని బాయ్ దబాయించాడు. విధిలేని పరిస్థితుల్లో ఆమె రూ.30 ఇచ్చి గ్యాస్ సిలిండర్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని బాయ్ మనసులో పెట్టుకుని అక్టోబర్ ఒకటో తేదీన గ్యాస్ బుక్ చేసినా ఇప్పటి వరకు సిలిండర్ తీసుకురాలేదు. ఏజెన్సీ ఆఫీసుకు ఫోన్ చేస్తే ‘మీ గ్యాస్ నంబర్ మీద ఇంకా బిల్లింగ్ కాలేదు. రేపు వస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవపడ్డారు. అతను అడిగిన డబ్బు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?’ అంటూ ఫోన్ పెట్టేశారు.
కర్నూలులోని ఓ ఏజెన్సీలో బుధవారపేటకు చెందిన మహిళ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసి.. ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించింది. ఆ మరుసటి రోజు డెలివరీ బాయ్ సిలిండర్ తీసుకొచ్చాడు. ఆ మహిళ ముందుగానే బిల్లు చెల్లించి ఉండడంతో ఖాళీ సిలిండర్‌ను ఇంటి బయట పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయింది. బాయ్ ఆమెకు ఫోన్ చేశాడు. మీరు రెండో అంతస్తులో ఉన్నారు కాబట్టి రూ.50 డెలివరీ చార్జీ ఇవ్వాలని అడిగాడు. మొత్తం బిల్లులోనే చెల్లించాను కదా అని ఆమె ప్రశ్నించింది. రూ.50 ఇస్తేనే సిలిండర్‌ను ఇక్కడ పెట్టిపోతా.. లేదంటే ఏజెన్సీకే వచ్చి తెచ్చుకోండంటూ వెనక్కి తీసుకెళ్లాడు.
జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్‌ల వ్యవహారం వినియోగదారులకు తలనొప్పిగా మారింది. డబ్బు ఇస్తేనే సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఉచితంగా దింపాల్సిన సిలిండర్‌కు ముక్కుపిండి కనీసం రూ.30 డెలివరీ చార్జీని అనధికారికంగా వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తు పెరిగే కొద్దీ రేటు కూడా పెంచుతున్నారు. ఎవరైనా ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే..వారికి వచ్చే నెలలో సిలిండర్ డెలివరీ చేయకుండా వేధిస్తున్నారు. ఇలా దోపిడీ చేసిన మొత్తంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకూ వాటా వెళుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
వినియోగదారులపై రూ.3.5 కోట్ల భారం
జిల్లాలో 73 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడు లక్షలకు పైగానే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్‌పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సిలిండర్లను డెలివరీ చేసేందుకు ఏజెన్సీలే వాహనాలు, బాయ్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్‌కు వారే జీతాలివ్వాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఇక్కడే ట్రిక్కు ప్లే చేస్తున్నారు. సొంతంగా ఆటోలున్న వారికి సిలిండర్ల డోర్ డెలివరీ బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆటోకు బాడుగ గానీ, డెలివరీ బాయ్‌కు వేతనం గానీ చెల్లించరు. ఆటో యజమానే వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. ఇదే అదనుగా వారు దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి మరీ ఒప్పందం చేసుకుంటున్నారు. తర్వాత సిలిండర్‌పై రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేసుకుని గిట్టుబాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి నెలకు సగటున రూ.3.50 కోట్ల వరకు డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
చిల్లర దోపిడీ గురించి పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడైనా బాయ్స్ డెలివరీ కోసం డబ్బు వసూలు చేస్తే తమకు చెప్పాలని పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం తప్పా ఎక్కడా డెలివరీ తీరును పరిశీలించడం లేదు. వారు కార్యాలయాలను వదిలి సిలిండర్ల డెలివరీ సమయంలో మెరుపు దాడులు నిర్వహిస్తే దోపిడీ బాగోతం బయటకు వస్తుంది.
ఫిర్యాదులు వస్తే స్పందిస్తున్నాం
గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. అలా చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. 5 నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్‌పై రూ.20, ఆపైన దూరం ఉంటే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. వీటిని ఏజెన్సీలు విధిగా పాటించాలి.
– పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల అధికారి
నిబంధనలు ఇవీ..
గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్‌పై రూ.20లు, 15 కిలోమీటర్లు దాటితే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్లలోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా..ఒక్కో దానిపై కనీసం రూ.30 డెలివరీ చార్జీ వసూలు చేస్తున్నారు. అదే అపార్టుమెంట్లలో అయితే అంతస్తుకు రూ.15 చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఉదాహరణకు మొదటి అంతస్తులోకి సిలిండర్ డెలివరీ చేయాలంటే రూ.45, రెండో అంతస్తు అయితే రూ.60 అధికంగా వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment