మిర్యాలగూడ/హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: గ్యాస్ వినియోగదారులపై మళ్లీ పిడుగు పడింది. సబ్సిడీ వంట గ్యాస్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరగడంతో ‘బండ’ భారంగా మారింది. ఇటీవల కాలంలోనే మూడు పర్యాయాలు గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం మళ్లీ తాజాగా సిలిండర్‌పై రూ.25లు పెంచింది. ఈమేరకు 2013 డిసెంబర్ 31న అర్ధరాత్రి గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు వచ్చాయి.
దీంతో జిల్లా ప్రజలపై నెలకు రూ.50లక్షల భారం పడనుంది. పెంచిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీల్లో 6.54 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. ఒక్కొక్క సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.420 ఉండగా దీనిపై అదనంగా 25 రూపాయలు పెంచారు. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.445కు చేరింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలకు సుమారుగా 2లక్షల గ్యాస్ కనెక్షన్‌లను వినియోగదారులు రీఫిల్లింగ్ చేయించుకుంటారు. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌కు రూ.25 చొప్పున రెండు లక్షల గ్యాస్ సిలిండర్‌ల రీఫిల్లింగ్‌కు జిల్లా ప్రజలపై నెలకు రూ.50 లక్షల భారం పడనుంది.
పెరిగిన ధరలు ఇలా..
సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.420 ఉండగా ఇప్పుడు రూ.25 పెంచి 445 రూపాయలకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి గతంలో రూ.1111ఉండగా ఇప్పుడు 216 రూపాయలు పెరిగింది. దీంతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారి సిలిండర్ రీఫిల్లింగ్‌కు రూ.1327 చెల్లించాలి. వారికి బ్యాంకు ఖాతాలో రూ.839.50 వేయనున్నారు. దీంతో ఆధార్ అనుసంధానం చేసుకున్న వినియోగదారుడిపై మరో 42.50 రూపాయలు అదనపు భారం పడనుంది. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.1882 ఉండగా ఇప్పుడు రూ.386 పెరిగింది. దీంతో కమర్షియల్ గ్యాస్ రీఫిల్లింగ్‌కు రూ.2268 చెల్లించాల్సి వస్తుంది.
గ్యాస్ ధర పెంపుతో ఆర్థిక భారం
ప్రభుత్వం గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతుంది. ఇటీవలనే రూ.12 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.25 పెంచడం వల్ల ఆర్ధిక భారం పెరిగిపోతుంది. ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు అదనపు ధర చెల్లించాల్సి వస్తుంది.
- తుమ్మలపల్లి కవిత, మిర్యాలగూడ
బండడు కష్టాలు
Published Thu, Jan 2 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement