కుదురు చీమనపల్లెలో గ్యాస్ లీకై ధ్వంసమైన గృహాలు
రామసముద్రం : గ్యాస్ సిలిండర్ లీకై వచ్చిన పెను శబ్దానికి మూడు ఇళ్లు ధ్వంసమైన సంఘటన శుక్రవారం మండలంలోని కుదురు చీమనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామంలోని ఆర్.ఈశ్వర్‌రెడ్డి ఇంట ఉదయం వంట చేసి, సిలిండర్ రెగ్యులేటర్ ఆ ఫ్ చేయడం మరచారు. తలుపులు వేసుకుని పొలం పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకైంది. తలుపులన్నీ మూసి ఉండడంతో అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా వ్యాపిం చింది. బెలూన్‌ను అదే పనిగా ఊదుతూ ఉంటే ఒక స్థితికి వచ్చేసరికి అది ఢామ్మనడం విదితమే. అదే తరహాలో ఈ ఇంట గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ప్రమాదానికి దారితీసింది. గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ఒత్తిడి ఎక్కువై ఉన్న తరుణంలో కరెంటు వచ్చింది. దీంతో పేలుడు తరహాలో ఆ ఇంట పెద్దపెట్టున శబ్దం వచ్చింది. దీని ధాటికి ఇంటి గోడలు, పైకప్పులతో కూలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తుసామగ్రి మొత్తం ధ్వంసమైంది.
అలాగే పక్కనే ఉన్న ఈశ్వర్‌రెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి ఇంటి గోడలు, పొరుగునే ఉన్న ఎన్.శ్రీనివాసులురెడ్డి ఇంటి గోడలు సైతం కూలిపోయాయి. అతని ఇంటి ఆవరణలోని ద్విచక్రవాహనం సైతం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇక, పెద్దపెట్టున శబ్దం రావడంతో గ్రామస్తులు హడలిపోయారు. పరుగున అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. భూకంపం వస్తే నేలమట్టమైన తరహాలో ఉన్న తమ ఇంటిని చూసి భోరున విలపించారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని వాపోయారు. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్‌ఐ శివశంకర్, తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంపీడీఓ మస్తాన్‌వల్లి, పంచాయతీ కార్యదర్శి వసుంధర, వీఆర్‌ఓ రామ్మూర్తి తదితరులు అక్కడికి చేరుకుని ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే డిమాండ్
కుదురుచీమనపల్లెలో గ్యాస్ లీకై సంభవించిన ప్రమాదాన్ని తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి బాధితులను పరామర్శించారు. కూలిపోయిన గృహాలను పరిశీలించారు. బాధితులు, అధికారులతో ఆయన మాట్లాడారు. రూ.60 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుం బాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికక్కడే అగ్నిమాపక సిబ్బంది ఆస్తి నష్టంపై ఫోన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఆదుకోవాలని సూచించారు. ఇక, గ్రామస్తులు పుంగనూరు ఇండేన్ గ్యాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్‌గౌడు, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకట్ర మణ, నాయకులు కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ వాడకంపై అవగాహన
పుంగనూరు అగ్నిమాపకాధికారి బాలసుబ్రమణ్యం, సిబ్బంది సుబ్బరాజు, లక్ష్మీనారాయణ, ఆనంద్ గ్యాస్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్యాస్ వాడకంలో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలూ సంభవించవన్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ధారాళంగా వెలుతురూ, గాలి ప్రసరించేలా వెంటిలేటర్లు ఉండాలన్నారు. గ్యాస్ పొయ్యి మీద వంట పనులు పూర్తి అయ్యాక రెగ్యులెటర్ ఆఫ్ చేయాలన్నారు. ఆన్‌లో పెట్టి ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment