సాక్షి, విజయవాడ సిటీ : ఇంటికొక ఉద్యోగం.. లేదంటే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను నిలువునా ముంచేసిన చంద్రబాబూ.. ఇక సీఎం పదవి నుంచి దిగిపో అంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం విజయవాడలోని యూత్ సర్వీసు కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే సలాం బాబు, జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ‘నిరుద్యోగ భృతిపై ఆశ కల్పించావు.. నిలువునా ముంచావు’, ‘ఇక చాలు.. దిగిపో బాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌కే సలాం బాబు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో యువతను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు.. కొత్తనాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులుంటే.. కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇస్తామని, అది కూడా రూ.వెయ్యి మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా యువతను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యూత్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నగర కార్యదర్శులు అశోక్, అర్జున్, నరసింహ, శ్యామ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment