మరో నెల గడువివ్వండి : సీఎం కిరణ్
సాక్షి, న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మరో నెలరోజుల గడువు ఇవ్వాల్సిందిగా సీఎం కిరణ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వాస్తవానికి ప్రణబ్ ఈ నెల 23 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న రాష్ట్రపతి నుంచి టీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. 13వ తేదీ సాయంత్రం అసెంబ్లీకి వచ్చింది. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీ అభిప్రాయం కోసం టీ బిల్లు వచ్చిందని 16న స్పీకర్ శాసనసభకు తెలియజేశారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అప్పటినుంచే బిల్లుపై చర్చ ప్రారంభమైందని మంత్రి, లేదని సీఎం పేర్కొనడంతో వివాదం నెలకొంది. ఈ నెల 9న బిల్లుపై వాస్తవ చర్చ ప్రారంభమైంది. తాజాగా గడువు పొడిగింపు కోరుతూ సీఎం లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్రపతి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
నా బ్యాటింగ్ ఇక ముందుంటుంది: సీఎం
తానింకా బ్యాటింగ్ ప్రారంభించలేదని, ఎలా బ్యాటింగ్ చేస్తానో, సభలో ఏం మాట్లాడతానో ముందు ముందు చూస్తారని సీఎం కిరణ్ వ్యాఖ్యానించారు.