మూడు దఫాలుగా గరం టీ | three phase discussion about telangana bill in assembly | Sakshi
Sakshi News home page

మూడు దఫాలుగా గరం టీ

Published Wed, Dec 18 2013 2:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

మూడు దఫాలుగా గరం టీ - Sakshi

మూడు దఫాలుగా గరం టీ

 సభలో విభజన బిల్లుపై జనవరి 23 వరకూ చర్చ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాపై శాసనసభలో చర్చ ప్రారంభమైనట్టా..? కానట్టా..? అనే వివాదాన్ని పక్కనపెట్టి ఇక చర్చను కొనసాగించాలని సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) నిర్ణయించింది. చర్చను కొనసాగించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో బుధవారం నుంచి విభజన బిల్లుపై సభలో చర్చను కొనసాగించాలని తీర్మానించారు. కానీ.. ఈ చర్చను ఎంత కాలం కొనసాగించాలి..? ఎప్పటిలోగా ముగించాలి..? అనే అంశంపై బీఏసీ స్పష్టతకురాలేదు. అయితే.. రాష్ట్రపతి జనవరి 23 వరకు అవకాశం ఇచ్చినందున అప్పటివరకూ చర్చను కొనసాగించాలని ప్రభుత్వ పక్షం నుంచి సూచన వచ్చింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో 20 నుంచి 22 పని దినాలు ఉండే విధంగా వచ్చే నెల 23వ తేదీ వరకూ చర్చను కొనసాగించాలని బీఏసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
 
  బిల్లుపై ప్రతి సభ్యుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలిపేందుకు అవసరమైనంత సమయం ఇవ్వాలని.. అందులో భాగంగా బుధవారం నుంచి వచ్చే జనవరి 23 వరకు మొత్తం మూడు దఫాలుగా చర్చలను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత సమావేశాల్లో బుధవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు చర్చను కొనసాగించాలని తీర్మానించారు. ఆ తర్వాత కొద్ది రోజులు సెలవులు ప్రకటించి ఈ నెల 26 నుంచి లేదా జనవరి 2 నుంచి మళ్లీ సమావేశాలను ప్రారంభించాలనే అభిప్రాయానికి వచ్చారు. మళ్లీ సంక్రాంతి పండుగ సెలవులకు నాలుగు రోజులు సభను వాయిదా వేసి.. పండుగ తర్వాతి నుంచి జనవరి 23 వరకు సభను కొనసాగించాలని నిర్ణయించారు. అయినప్పటికీ సమయం చాల్లేదని భావిస్తే మరో పక్షం రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనగా.. అంత సమయం అక్కర్లేదని, ఇచ్చిన గడువులోనే చర్చను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. మొత్తం మీద బీఏసీలో అధికార, విపక్ష సభ్యుల నుంచి వెల్లడైన అభిప్రాయాల మేరకు విభజన బిల్లుపై చర్చ మొత్తం 20 నుంచి 22 పనిదినాలుండేలా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రితో మరోసారి చర్చించి బుధవారం శాసనసభ సమావేశాల షెడ్యూల్‌తో కూడిన బులెటిన్‌ను విడుదల చేస్తారు.
 గంటన్నర పాటు బీఏసీ భేటీ...
 స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం దాదాపు గంటన్నర పాటు జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశంలో.. సీఎం, డిప్యూటీ సీఎం, ఉప సభాపతి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ, ఆర్ధిక శాఖ మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు ఈరవ త్రి అనిల్, ద్రోణంరాజు శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వై.ఎస్.విజయమ్మ, ఉప నేత, విప్‌లు శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీఎల్‌పీ ఉప నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, ఉపనేత టి.హరీశ్‌రావు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ,  బీజేఎల్‌పీ నేత యెండల లక్ష్మీనారాయణ, సీపీఐ పక్ష నేత గుండా మల్లేష్, సీపీఎం పక్షనేత జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా పక్ష నేత డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఎప్పటిలాగే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బీఏసీ సమావేశానికి గైర్హాజరయ్యారు. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన విభజన బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? అనే అంశంపై స్పీకర్ వివరణ ఇచ్చిన తరువాత విభజన బిల్లుపై చర్చను ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై చర్చించారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ వాకౌట్...
 విభజన బిల్లుపై చర్చకంటే ముందే.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభలో తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు బీఏసీ భేటీలో పట్టుపట్టారు. ఎన్‌డీఏ సర్కారు హయాంలో మూడు రాష్ట్రాల విభజన సమయంలోనూ ఆయా అసెంబ్లీలు తీర్మానం చేసిన తరువాతే కేంద్రం విభజన బిల్లును ఆయా రాష్ట్రాలకు పంపిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఇక్కడ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే విభజనకు అనుకూలమెవరో, వ్యతిరేకులెవరో తేలిపోతుందని చెప్పారు. అయితే.. విభజన బిల్లు రాకముందు సమైక్య తీర్మానం చేస్తే అర్థం ఉంటుందే తప్ప ఈ సమయంలో సాధ్యం కాదని పేర్కొంటూ ముఖ్యమంత్రి కిరణ్ వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్పీకర్ సైతం విభజన బిల్లుపై చర్చ సందర్భంగా వారి వాదనను చెప్పుకోవాలని సూచించారు. తమ డిమాండ్‌కు ఆమోదం తెలపనందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు బీఏసీ నుంచి వాకౌట్ చేశారు.
 
 టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం...
 తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని బీఏసీ భేటీలోనూ కొనసాగించింది. వెంటనే బిల్లును వెనక్కు పంపాలని టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కోరగా.. విభజన బిల్లుకు తాము అనుకూలమని, తక్షణమే చర్చను కొనసాగించాలని మోత్కుపల్లి నర్సింహులు పట్టుపట్టారు. టీడీపీ వైఖరిపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సహా పలువురు బీఏసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ముద్దుకృష్ణమనాయుడు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మోత్కుపల్లి మాత్రం సమావేశం ముగిసేదాకా ఉన్నారు. అంతకుముందు గాలి సీఎంను ఉద్దేశించి ‘‘విభజన జరగకుండా అడ్డుకుంటామని మీరు పదేపదే చెప్పటంతో సీమాంధ్రలోని ఐదున్నర కోట్ల ప్రజలు మీవైపే చూస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. వాళ్లను మోసం చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘నేను మర్చిపోయేదేముంది? రేపు సభలో నా స్టాండ్ ఏమిటనేది ఐదున్నర కోట్ల మందికి కచ్చితంగా తెలిసేలా మాట్లాడతాను’ అని పేర్కొన్నారు. ఆనం నవ్వుతూ.. ‘‘ఐదున్నర కోట్ల మంది మా సీఎం పట్ల విశ్వాసంతో ఉన్నారని చెప్పినందుకు ముద్దుకృష్ణమనాయుడుకు థ్యాంక్స్ చెప్తున్నా. నా ఉద్దేశంలో ఐదున్నర కాదు, ఎనిమిదిన్నర కోట్ల మంది ఆయనవైపు చూస్తున్నారు. కానీ మీ చంద్రబాబు పట్ల మాత్రం ప్రజలకు విశ్వాసం లేదని మీరే ఒప్పుకున్నారు. అది చాలు’’ అని వ్యాఖ్యానించారు. గాలి ప్రతిస్పందిస్తూ.. ‘‘విభజన బిల్లు రాదు, అడ్డుకుంటామని సీఎం చెప్పారు కదా! దానిపై మాట్లాడండి’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో గండ్ర జోక్యంచేసుకుని.. ‘‘మీరు విభజన లేఖ ఇచ్చి ఇప్పుడెందుకు అడ్డు తగులుతున్నారో చెప్పండి?’’ అని ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో గాలి తాను విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నానంటూ బయటకు వెళ్లిపోయారు.
 
 ఓటింగ్.. ఉంటుందా? ఉండదా?!
 బీఏసీ సమావేశంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లుపై విస్తృతంగా చర్చించాల్సిందేనని.. అందుకోసం ప్రతి ఒక్క సభ్యుడు స్వేచ్ఛగా తమ ప్రాంత అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. బిల్లులోని ప్రతి ఒక్క క్లాజుపై విపులంగా మాట్లాడతానన్నారు. ‘‘సవరణలు, ఓటింగ్ ఉంటుందా?’’ అని ఒకరిద్దరు సభ్యులు ప్రశ్నించగా.. టీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం ఓటింగ్ ఉండదని, అభిప్రాయాలు మాత్రమే చెప్పుకోవచ్చని స్పందించారు. అయితే సీఎం మాత్రం.. ‘‘ఓటింగ్ కూడా ఉంటుంది. సవరణలు ప్రతిపాదిస్తాం’’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని.. ‘‘మూడు రాష్ట్రాల విభజన సందర్భంగా జరిగిన చర్చల వివరాలతో పాటు క్లాజులపై సవరణలు, ఓటింగ్ జరిపారా? లేదా? అనే విషయంలో అన్ని వివరాలను, అనుసరించిన నిబంధనలను సభ్యులందరికీ బుధవారం అందజేస్తా’’ అని చెప్పారు. దీనిపై సభ్యులిచ్చే సలహాల మేరకు సభను నిర్వహించుకుందామని, తాను మాత్రం సభ సాఫీగా జరగాలని, సభ్యులు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడయ్యే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతకుముందు సీఎం బుధవారం ఒక్క రోజు చర్చ జరిపి.. కొద్దిరోజులపాటు సభను వాయిదా వేద్దామని, మరోసారి బీఏసీ సమావేశమై వచ్చే నెల 23 వరకు చర్చను కొనసాగిద్దామని ప్రతిపాదించారు. డిప్యూటీ సీఎం మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. గత బీఏసీలో నిర్ణయించిన మేరకు ఏడు పని దినాలు సభ జరగాల్సిందేనని చెప్పారు. మిగిలిన సభ్యులంతా మద్దతివ్వడంతో స్పీకర్ శుక్రవారం వరకు తొలివిడత సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 
 విస్తృత చర్చకు టీ-నేతల అంగీకారం...
 రాష్ట్రపతి ఇచ్చిన గడువు మేరకు జనవరి 23 వరకు విభజన బిల్లుపై చర్చించాలనే ప్రతిపాదనకు తెలంగాణ మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ సభ్యులు కూడా బీఏసీలో అంగీకరించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘సభలో విభజన బిల్లుపై అందరూ మాట్లాడాల్సిందే. మేం కోరేది కూడా అదే. ఇక్కడ ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా నిర్ణయాలు జరిగేది మాత్రం కేంద్రంలోనే కదా! అందుకు మేం పూర్తిగా సహకరిస్తాం’’ అని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సైతం చర్చను ఎన్ని రోజులైనా కొనసాగిద్దామని, సభ్యులంతా తమ అభిప్రాయాలు వెల్లడించుకోవచ్చని పేర్కొన్నారు. ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘విభజన బిల్లు సభకు రావటం చరిత్రాత్మకం. తెలంగాణ వాళ్లకు ఉపశమనం కలిగిస్తే సీమాంధ్రకు తీవ్ర నష్టం కలిగించే అంశం. నా దృష్టిలో తెలంగాణకు కూడా నష్టమే జరుగుతుంది. అదేమిటనేది సభలోనే వివరిస్తాం. అయితే సభలో సభ్యులు మాట్లాడేటప్పుడు ఎవరూ అడ్డుకోవద్దు. మేం మాత్రం మా అభిప్రాయాలను చెప్పి తీరుతాం. సమయం చాలదనుకుంటే వర్కింగ్ లంచ్ నిర్వహించి కొనసాగించుకుందాం’’ అని పేర్కొన్నారు.
 
 తుపాను, ట్రిబ్యునల్ తీర్పుపై ఒక రోజు చర్చ...
 ఇటీవల వచ్చిన తుఫానుతో సీమాంధ్రతో పాటు తెలంగాణలోని రైతులకూ తీవ్ర నష్టం జరిగిందని దీనిపై చర్చించేందుకు ఒక రోజు సమయం కేటాయించాలని, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా చర్చించాల్సిన అవసరం ఉందని మంత్రి ఆనం సూచించారు. అయితే.. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నందున దానికే పరిమితం కావాల్సిందేనని.. మధ్యలో ఇతరత్రా అంశాలపై చర్చిస్తామంటే ఒప్పుకునేది లేదని టీఆర్‌ఎస్ సభ్యులు పేర్కొన్నారు. సీపీఐ సభ్యుడు గుండా మల్లేష్ కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ‘తుపాను నష్టం, ట్రిబ్యునల్ తీర్పులే కాదు... మరే అత్యవసర సమస్యలైనా సరే... చర్చించడానికి వీల్లేదు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ సైతం ‘విభజన బిల్లుపైనే చర్చించాలి’ అని పేర్కొన్నారు. సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాత్రం విభజన బిల్లుతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎజెండాలో చేరిస్తేనే బాగుంటుందన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజా సమస్యలపై చర్చించిన దాఖలాలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన వివరాలను కూడా సభ్యులకు అందజేస్తానని చెప్పడంతో తుపాను, ట్రిబ్యునల్ తీర్పుపై శుక్రవారం లోపు ఒక రోజు చర్చించాలని బీఏసీలో నిర్ణయానికి వచ్చారు.
 
 జేపీతో టీఆర్‌ఎస్ సభ్యుల వాగ్వాదం
 రాష్ట్ర విభజనకు సంబంధించి తాను లేవనెత్తిన 8 అంశాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని, దీంతోపాటు హోంశాఖ పంపిన లేఖను కూడా అందజేయాలని లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాష్‌నారాయణ్ బీఏసీలో స్పీకర్‌ను కోరారు. ‘‘ఆ విషయాలన్నీ మీకు తెలియదా? గతంలో మాట్లాడినవే కదా!’’ అని టీఆర్‌ఎస్ సభ్యులు రాజేందర్, హరీశ్‌రావు వ్యాఖ్యానించటంతో.. ‘‘ఇది సరైన పద్ధతి కాదు. బాధ్యతా రాహిత్యంగా పార్టీలు వ్యవహరిస్తే ఎలా? కొన్ని అంశాలపై ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోతే సభలో ఏం మాట్లాడేది? మేం లేవనెత్తిన అంశాలకు సమాచారం కేంద్రం ఇస్తుందా? రాష్ట్రం ఇస్తుందా? దానిపై స్పష్టత వస్తేనే కదా! మాట్లాడగలిగేది’’ అని జేపీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురూ వాగ్వాదం తలెత్తటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ జోక్యం చేసుకుంటూ ‘‘హోంశాఖ పంపిన లేఖను మీకు రేపు పంపిస్తా. మీరు లేవనెత్తిన 8 అంశాలకు సంబంధించిన వివరాలను అందజేసే విషయంలోనూ ప్రొసీజర్ ప్రకారం వ్యవహరిస్తా’’ అని చెప్పటంతో ఇరువురు శాంతించారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement