రైతు రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వండి
జగ్గంపేట : ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నందున రైతులను ఆదుకునేందుకు రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కోరారు. ప్రతిపక్షం తరఫున ఆయన మంగళవారం అసెంబ్లీలో తన వాణి వినిపించారు. మెట్ట ప్రాంతానికి చెందిన తాను వ్యవసాయంతోనే జీవనోపాధిని పొందుతున్నానని, రైతు సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు.
రైతుల వద్ద పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములు లేవని, బ్యాంకర్లు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే రుణ మాఫీపై స్పష్టత ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఆర్థిక సంస్కరణలను గురించి ప్రస్తావిస్తూ గత టీడీపీ హయాంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుప్పకులిందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సు కోసం సూచనలు, సలహాలు ఇస్తుందని, వాటిని ఆచరించాల్సిన బాధ్యత పాలక పక్షంపై ఉందన్నారు.