అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : విద్యాశాఖలో అడ్డదారుల్లో పదోన్నతులకు ఇకపై చెక్ పడనుంది. పదోన్నతులకు సంబంధించి రెండుసార్లు గైర్హాజరైతే ఇక శాశ్వతంగా పదోన్నతి ఉండదు. పైగా సీనియార్టీ ప్రకారం పెరిగిన స్కేలును కూడా రికవరీ చేస్తారు. పదోన్నతులు వద్దనుకున్నా...సీనియార్టీ ప్రకారం వేతన స్కేలు మాత్రం పెరుగుతుంది. ఉదాహరణకు 1995 డీఎస్సీ ఉపాధ్యాయులు పదోన్నతులు లేకపోయినా 18 ఏళ్ల స్కేలు తీసుకుంటుంటారు. ఇకపై రెండుసార్లు పదోన్నతులను తిరస్కరిస్తే మాత్రం శాశ్వతంగా పదోన్నతులు కోల్పోవడంతో పాటు అప్పటిదాకా వారు పొందిన ఆర్థికపరమైన లబ్ధిని కూడా రికవరీ చేస్తారు. పైగా సర్వీసు పుస్తకంలో నమోదు చేస్తారు.
అడ్డదారుల్లో ఇలా..
ఇన్ని రోజులూ కొందరు ఉపాధ్యాయులు ధన, రాజకీయ బలాలను ఉపయోగించి అక్రమంగా పదోన్నతులు పొందారు. ఈ క్రమంలో అర్హత ఉన్నా ఏళ్ల తరబడి దూర ప్రాంతాల్లో పనిచేస్తూ.. ఇక కావాల్సిన చోటుకు వస్తామనే ఆశలు పెట్టుకున్న సామాన్య ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. అక్రమాలకు డీఈఓ కార్యాలయ సిబ్బంది కొందరు పూర్తిస్థాయిలో సహకరించారు. పదోన్నతులకు సంబంధించిన జీఓ 145 అమలుకు తూట్లు పొడిచారు. ఈ జీఓ మేరకు ఒకసారి (ప్యానెల్ జాబితా నుంచి) మినహాయింపు పొందవచ్చు. ఆ తర్వాత ఏడాది ప్రకటించే తొలి ప్యానెల్ జాబితాలో ఖచ్చితంగా (మినహాయింపు పొందిన) పేర్లు నమోదు చేయాల్సి ఉంది.
145 జీఓను అడ్డం పెట్టుకుని కొందరు ఉపాధ్యాయులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారు. ట్రిబ్యునల్‌కు వెళ్లమని సలహాలు ఇస్తూ, ఆ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని డీఈఓ కార్యాలయ సిబ్బంది సీనియార్టీ జాబితాలో చేర్చారు. దూరప్రాంతాల్లో ఖాళీలు ఉన్నప్పుడు జాబితాలో లేని పేర్లు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఖాళీలు ఏర్పడే సమయానికి జాబితాలో చేరిపోతుండేవి. జీఓ 145 మేరకు ఒక ఏడాది మినహాయింపు పొంది తర్వాత ఏడాది ప్యానల్ జాబితాలో చేరని వారిని పదోన్నతులు తిరస్కరించినట్లుగా భావించాల్సి ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్వాకంతో రాజకీయ, ధనబలం ఉన్న ఉపాధ్యాయుల పేర్లు ఎప్పుడుపడితే అప్పుడు సీనియార్టీ జాబితాలో చేరుతుండేవి. తాజాగా విడుదలైన జీఓ 227 మేరకు ఇకపై ఈ పరిస్థితి ఉండదు.
ఉపాధ్యాయుల హర్షం
ఈ జీఓ పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన సామాన్య ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని వారంటున్నారు. రెండుసార్లు గైర్హాజరైతే శాశ్వతంగా పదోన్నతి కోల్పోవడంతో పాటు ఆర్థిక లబ్ధిని రికవరీ చేయనుండడంతో ఖచ్చితంగా పదోన్నతులు పొందుతారని చెబుతున్నారు. అధికారులు చిత్తశుద్ధితో 227 జీఓ అమలు చేయాలని కోరుతున్నారు.
అడ్డదారుల పదోన్నతులకు చెక్!
Published Tue, Jun 3 2014 3:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM