బదిలీ పరీక్ష
- రిలీవర్ రాక అవస్థలు
- బదిలీ అయినప్పటికీ మారని స్థానం
- జిల్లా సరిహద్దు మండలాల్లో వింత పరిస్థితి
- 280 మంది ఉపాధ్యాయుల నిరీక్షణ
- ఏళ్ల తరబడి మగ్గినా లభించిన మోక్షం
- అడ్డంకిగా మారిన జీఓ 30
అనంతపురం ఎడ్యుకేషన్:
కనీస రవాణా సౌకర్యం లేని సరిహద్దు మండలాల్లోని పాఠశాలల్లో కొన్నేళ్లుగా మగ్గుతున్న ఉపాధ్యాయులు ఇప్పటికీ చుక్కలు చూడాల్సి వస్తోంది. కుటుంబాలకు దూరంగా పడరాని పాట్లు పడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు బదిలీ సాధించినా.. నిబంధనల అడ్డంకితో ఆ సంబరం కాస్తా ఆవిరవుతోంది. ఇన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కిందనుకునే సమయంలో ఆశలు అడియాశలవుతున్నాయి. రిలీవర్ రాని కారణంగా పాత స్కూళ్లలోనే నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో తొలుత కౌన్సెలింగ్ పూర్తి కావడంతో బాధిత టీచర్లు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ సమస్యను ఏకరువు పెడుతున్నారు.
ఉన్నత పాఠశాలల్లోనే సమస్య
తప్పనిసరి బదిలీ అయినా స్కూల్‌లో కనీసం 50 శాతం మంది ఉంటేనే రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వం 30 జీఓ జారీ చేసింది. ఈ ప్రకారం ముగ్గురు పని చేస్తుండే చోట ఒకరిని మాత్రం రిలీవ్ చేయొచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో ఇది పెద్ద సమస్య కాకపోయినా.. ఉన్నత పాఠశాలల్లో కష్టతరమవుతోంది. చాలా స్కూళ్లలో ఒకే పోస్టు ఉంది. అలాంటి చోట పని చేస్తూ బదిలీ అయిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారికి రిలీవర్ వస్తే తప్పే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు. ఈ సమస్య ప్రధానంగా మడకశిర, గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, డీ.హీరేహాల్, బొమ్మనహాల్ మండలాల్లో ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పలువురు టీచర్లు డీఈఓను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
మా చేతుల్లో ఏమీ లేదు
30 జీఓ ప్రకారం ఆయా స్కూళ్లలో కనీసం 50 శాతం మంది ఉపాధ్యాయులు ఉండాలి. రిలీవ్ చేసేసి అక్కడ టీచరు లేకుండా అయితే అందుకు హెచ్‌ఎంలదే బాధ్యత. రిలీవర్లు వచ్చిన తర్వాత బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలి. జిల్లా సరిహద్దు మండలాల టీచర్లు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. మా చేతుల్లో ఏమీ లేదు. నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.
– లక్ష్మీనారాయణ, డీఈఓ