
మానవత్వం.. మంటగలిసింది
తిరుపతి(మంగళం)/చంద్రగిరి, న్యూస్‌లైన్: కళ్ల ముందే ఆడుకుంటూ ఉండిన కొడుకు శవమై తిరిగిరావడంతో ఆ కన్నతల్లి గుండెలు అవిశారుు. గుర్తుతెలియని దుండగుల దురాగతానికి బాలుడు మురళీరెడ్డి(9) సజీవ దహనం కావడంతో రాజీవ్‌నగర్‌లోని సత్యనారాయణపురంలో ఆ ఇల్లు దుఃఖసాగరమైంది. బాలుడి తల్లి అరుణను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
‘ఆడుకోడానికి వెళ్లి శవమై వచ్చావా నాయనా’ అంటూ మురళీ అమ్మమ్మ ఏడవడం అందరినీ కంట తడి పెట్టించింది. ‘కడుపు నిండా టిఫిన్ తినిపించాలనుకుంటే మంటల్లో కాలిపోయూవా తండ్రీ’ అంటూ అరుణ కుప్పకూలిపోవడం చుట్టుపక్కలవారిని కలచివేసింది. ఇంత కర్కశత్వానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
బాలుడి హంతకుల కోసం వేట
తొమ్మిదేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా పెట్రోల్‌పోసి కాల్చిచంపిన దుండగుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. డీఎస్పీ రాజేంద్రప్రసాద్, అలిపిరి సీఐ రాజశేఖర్, చంద్రగిరి సీఐ మల్లికార్జున గుప్త సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ ద్వారా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. గంట పాటు ఆధారాలను సేకరించారు. కుటుంబ తగాదాలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
చేతికున్న కడియం ద్వారా గుర్తింపు
చిన్నారి మురళీ కుడి చేతికున్న రాగి కంకణం ద్వారా సులభంగా మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో మురళీ తాత సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహం మురళీదని గుర్తించగానే కుప్పకూలిపోయూడు. ఆయన దుఃఖానికి అవధులు లేకుండాపోరుుంది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు
శానంబట్ల ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి కూత వేటు దూరంలో మామిడి తోటకు కాపలా ఉన్న వృద్ధుడు ఈ మంటలను గమనించినట్టు తెలిపారు. ఒక్క సారిగా మంటలు రావడంతో కాపలా ఉన్న వృద్ధుడు ‘ఎవరక్కడ... ఏం చేస్తున్నారని’ అరవడంతో ‘ఏం లేదులే ఇక్కడ ముళ్లకంపలకు నిప్పు పెట్టాం’అని బదులిచ్చినట్టు తెలిపాడు.
నిందితులను పట్టుకుంటాం : డీఎస్పీ
బాలుడిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను పట్టుకుని తీరుతామని ఎస్వీయూ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అన్ని కోణాల్లో విచారించి, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామన్నారు. ఇందుకోసం నాలుగు బృందాలను నియమించనున్నట్టు చెప్పారు.