పట్టించుకోండి ‘ప్రభూ’.. | god | Sakshi
Sakshi News home page

పట్టించుకోండి ‘ప్రభూ’..

Published Mon, Feb 23 2015 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

god

విజయనగరం టౌన్ : ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రధాన కేంద్రంగా  ఇటు ఒడిశా, అటు  రాయపూర్ లైన్‌లతో కలిసి  విజయనగరం రైల్వేస్టేషన్  ప్రత్యేక జంక్షన్‌గా పేరొందింది.  నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే జిల్లాకు అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ  సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.    ఈస్ట్‌కోస్ట్ డివిజన్  నుంచి  విశాఖను వేరు చేసి విశాఖకు ప్రత్యేక జోన్ తీసుకువస్తామని  చేస్తున్న ప్రకటనలు అక్కడితో ఆగిపోకుండా  త్వరలో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖకు ప్రత్యేక జోన్‌గా తీసుకువచ్చేందుకు ఉత్తరాంధ్ర ఎంపీలు కృషిచేయాలని మూడు జిల్లాల ప్రజలూ కోరుతున్నారు.
 
 అయితే నాలుగు డివిజన్‌లతో కలిపి విశాఖను జోన్‌గా చేసే ఆలోచన ఉన్నట్లు, ఈ బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  అంతేకాకుండా రైల్వే డివిజనల్ మేనేజరు ఎం.అనిల్ కుమార్ ఇటీవల  కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును ఆయనే స్వగృహంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు  డీఆర్‌ఎంతో కేంద్రమంత్రి  మాట్లాడుతూ   గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లను విశాఖ నుంచి విజయనగరం వరకూ
 
 పొడిగించాలని అందుకు తగ్గ ప్రతిపాదనలు చేయాలని, ఎత్తురోడ్డు వద్ద రైల్వే బ్రిడ్జి విస్తరణ,  
 ఏళ్లనాటి సమస్యగా ఉన్న వీటీ  అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేటు ఏర్పాటు, గాజుల రేగ వద్ద రైల్వే అం డర్ బ్రిడ్జి ఏర్పాటు, వెంకటలక్ష్మి థియేటర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ,   విశాఖ నుంచి బయలుదేరే కిరండోల్ ప్యాసింజర్‌కు అదనంగా మూడుబోగీలు ఏర్పాటుచేయాలంటూ  ప్రతిపాదించాలని కోరారు. అలాగే మానాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఎన్‌హెచ్ 26ను నాలుగు లైన్లగా విస్తరిస్తూ పనులు ప్రారంభించాలని, అసంపూర్తిగా మిగిలి ఉన్న సీతానగరం రైల్వే ఓవర్ బ్రిడ్జి, గుమడాం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు.   రైల్వేస్టేషన్‌లో  కంటోన్మెంట్ గూడ్స్‌షెడ్ వైపు మరో ఎంట్రీ నిర్మాణదశలో ఆగిపోయిందని,  దాన్ని పూర్తి చేయాలన్నారు. అందుకు తగ్గవిధంగా రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
 
 అయితే  వీటన్నంటినీ ఉత్తరాంధ్ర ఎంపీలు అందరూ కలిసి  విశాఖను ప్రత్యేక జోన్‌గా చూసేందుకు  బడ్జెట్‌లో ప్రయత్నం చేయాలని హితవు పలికారు. అలాగే జిల్లాలోని గజపతినగరంలో పాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటి కూడా ఆగదు. చీపురుపల్లిలో ఫలక్‌నూమా, కోణార్క్ వంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి స్టేషన్‌లో హాల్టు ఉండే భువనేశ్వర్-తిరుమల, షాలీమార్ సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్టు ఎత్తేశారు. పార్వతీపురం,బెలగాం స్టేషన్‌లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
 
 గతంలో నెరవేరని హామీలు
 బొబ్బిలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితర హామీలన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి గత కేటాయింపులపై కేంద్రప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వందేళ్ల చరిత్ర కలిగిన  బొబ్బిలి రైల్వేస్టేషన్‌ను ఆదర్శ రైల్వే స్టేషన్‌గా చేస్తామని 2011లో కేంద్రం ప్రకటించింది.
 
 అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆదర్శానికి సంబంధించి ఏ పనులూ జరగలేదు. ఇక మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి ప్రత్యేకంగా దృష్టిపెట్టిన  ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’ పరిస్థితి కూడా డిమాండ్‌గానే మిగిలిపోయింది.   గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో  విశాఖ-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కేవలం వారంలో రెండురోజులు మాత్రమే నడుపుతున్నారు. వాస్తవానికి ఐదురోజులు నడపాల్సి ఉంది.  వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు చెత్తబుట్టలోకి చేరినట్లుగానే అంతా భావిస్తున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement