గోదావరిపై 9 ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ సన్నాహాలు
బడ్జెట్‌లో రూ.9,636.81 కోట్ల కేటాయింపు
మన రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలంటున్న రైతులు
పోలవరం సత్వరం పూర్తి చేయాలని డిమాండ్
అమలాపురం :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయించింది. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. గోదావరి, దాని ఉపనదులపై సుమారు తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.9,636.81 కోట్లు కేటాయించింది. ఇందులో కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో రూ.6,286 కోట్లు, మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మంలో నిర్మించే సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతలకు ఏకంగా రూ.1,151.59 కోట్లు, దేవాదులకు రూ.695 కోట్లు, ప్రాణహితకు రూ.685 కోట్లు కేటాయించారు. వీటితోపాటు చిన్నచిన్న పథకాలకు సైతం అధికంగా నిధులు కేటాయించారు.
డెల్టా ఎడారేనా?
తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే ఆ పథకాలు తొందరలోనే పూర్తవుతాయని గోదావరి డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే డెల్టాలో రెండో పంట అసాధ్యమే అవుతుంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు వరదల సీజన్‌లో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సగటున 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతారు. ఉధృతంగా వరద వచ్చినప్పుడు 25 లక్షల క్యూసెక్కుల వరకూ సముద్రంలోకి వదలడం సర్వసాధారణం. ఇది అక్టోబరు వచ్చేనాటికి 40 వేల క్యూసెక్కులకు, నవంబరులో 20 వేల క్యూసెక్కులకు పడిపోతుంది. డిసెంబర్ 15 నాటికి సహజ జలాల రాక బాగా తగ్గడంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదల దాదాపు నిలిచిపోతుంది. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే వరదలు లేని అక్టోబర్, నవంబర్ నెలల్లో బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో భారీగా పడిపోవడం ఖాయం. చాలా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు గోదావరిలో ఉపనదులు కలిసే ప్రాంతంలోనే జరుగుతున్నాయి. దీనివల్ల వరదల సీజన్ పూర్తయ్యాక నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే ప్రస్తుతం డిసెంబర్‌లో నెలకొంటున్న నీటి ఎద్దడిని డెల్టా రైతులు ఆక్టోబర్‌లోనే చూడాల్సి వస్తుంది. ఇదే జరిగితే డెల్టాలో రెండో పంటకే కాదు.. తొలి పంట చివరి దశలో కూడా నీటి ఇబ్బంది తప్పదు.
రబీకి సీలేరే శరణ్యం
గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో సుమారు 8.69 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, రబీ సాగు జరుగుతోంది. రబీసాగు ఇటీవల మూడొంతులు సీలేరు నీటిమీదే ఆధారపడాల్సి వస్తోంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు పూర్తయితే.. రబీలో సీలేరు నుంచి వచ్చే సుమారు 45 టీఎంసీలపైనే గోదావరి డెల్టా రైతులు ఆధారపడాల్సి వస్తుంది. దీనినిబట్టి ఒక టీఎంసీకి 10,800 ఎకరాల చొప్పున 4.86 లక్షల ఎకరాలు మాత్రమే పండించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే గోదావరి డెల్టాలో సగం మంది రైతులు బ్యారేజ్ నిర్మాణానికి ముందు పండించినట్టుగా రెండో పంటగా అపరాలు, ఆముదం పండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం..అత్యవసరం
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు రామపాదసాగర్ పేరుతో అంకురార్పణ జరిగింది. అయితే దీని నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన మృతి అనంతరం దీని పనులు సాగడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఆ తరువాత కూడా గడచిన రెండు బడ్జెట్లలో కేంద్రం రూ.100 కోట్ల చొప్పున ఇప్పటివరకూ రూ.200 కోట్లు మాత్రమే విదిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.3,660 కోట్లు కేటాయించింది. రూ.30 వేల కోట్లు ఖర్చయ్యే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టుకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంపై రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ పథకాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని కోరుతున్నారు.
..డెల్టా ఎడారే..!
Published Wed, Mar 16 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement