సాక్షి ప్రతినిధి, ఏలూరు :పశ్చిమ గోదావరి తీరాలు భక్తజనంతో పోటెత్తాయి. తొలి రోజుతో పోలిస్తే బుధవారం యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం జిల్లాలోని 97 ఘాట్లలో 7.60 లక్షల మంది పుష్కర సాన్నాలు ఆచరించినట్టు రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. బుధవారం ఒక్కరోజే కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఘాట్‌లో 1,98,928 మంది, నరసాపురం వలంధర రేవు ఘాట్‌లో 1.20 లక్షల మంది, సిద్ధాంతం ఘాట్‌లో 42,525 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారు జామునుంచే మొదలైన భక్తుల తాకిడి రాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం వరకైతే జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయాయి.
రాజమండ్రి పుష్కరాల రేవులో దుర్ఘటన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులంతా కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతం ఘాట్ల వైపు పోటెత్తుతున్నారు. అనూహ్యంగా భక్తులు, యాత్రికుల సంఖ్య పెరగడంతో ఘాట్లవద్ద వసతుల లేమి, ఏర్పాట్లలో అధికారుల డొల్లతనం బయటపడ్డాయి. సిద్ధాంతంలో పిండ ప్రదానాలకు సరైన షెడ్లు లేక స్మశాన వాటికలో పితృకార్యాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తొలిరోజు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోపాలు సరిదిద్ది పక్కాగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు ఇంకా కుదురుకోలేదు. కొవ్వూరులో బస్సుల సంఖ్య పెంచామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం బస్సు సౌకర్యం అందక ఇబ్బం దులు పడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, తన తాత, ముత్తాతలకు, రాజమండ్రి ఘటనలో మృతిచెందిన వారికి పిండ ప్రదానాలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కొవ్వూరు ఘాట్లలో కలియతిరిగారు. ఏర్పాట్లను మరింత బాగా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కొవ్వూరులో అన్ని పుష్కర ఘాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో సమీక్ష జరిపారు.
తూర్పుగోదావరి నుంచి నరసాపురం ఘాట్లకు
నరసాపురంలో మొదటి రోజు వలంధర రేవులో మాత్రమే భక్తుల రద్దీ కనిపిం చగా, బుధవారం మిగిలిన ఘాట్లలోనూ భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు చేశా రు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అంతర్వేది, సఖినేటిపల్లి, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు నరసాపురం చేరుకున్నారు. చించినాడ వంతెన మీదుగా వాహనాల్లోను, సఖినేటిపల్లి మీదుగా పంటు ద్వారా తరలివచ్చారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో నరసాపురం వచ్చారు. వలంధర రేవులో పిండ ప్రదానాలు చేసేం దుకు వచ్చేవారు అవస్థలు పడ్డారు. ఒక్క షెడ్డు మాత్రమే ఉండటంతో పిండప్రదానాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఆరుబయటే పిండ ప్రదానాలు చేసుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు సరిపోలేదు. లలితాంబ ఘాట్, అమరేశ్వర ఘాట్ వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదులు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
నరసాపురంలో వైఎస్‌కు పిండ ప్రదానం
నరసాపురం అమరేశ్వర ఘాట్‌లో వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిండ ప్రదానం చేశారు. తన పితృదేవతలతోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ముదునూరి ప్రసాదరాజు ఆయన వెంట ఉన్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో రెండో రోజు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఇప్పటికే అక్కడ అరకొరగా ఉన్న వసతుల సమస్య కూడా రెట్టింపైంది. ఆచంట మండలం పెదమల్లంలో ఇంకా పూర్తికాని రెండో ఘాట్‌ను రద్దీ దృష్ట్యా బుధవారం స్థానిక భక్తులే ఇసుక బస్తా లు వేసుకుని ప్రారంభించుకున్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాంతాల్లో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. పట్టిసీమ ఆలయంలో తాగునీరు లేక, ఎండ, ఉక్కబోత కారణంగా భక్తులు అవస్థలు పడ్డారు.
భక్త జనం.. ప్రణమిలినది
Published Thu, Jul 16 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement