ప్రతి దారి.. జన గోదారి | Godavari Pushkaralu 2015 : 19 Lakh Devotees estimated | Sakshi
Sakshi News home page

ప్రతి దారి.. జన గోదారి

Published Sun, Jul 19 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

గోదావరి పుష్కర పర్వంలో సరికొత్త రికార్డు నమోదైంది. జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శనివారం ఒక్కరోజే జిల్లాలోని పుష్కర ఘాట్లలో 19 లక్షల మంది

గోదావరి పుష్కర పర్వంలో సరికొత్త రికార్డు నమోదైంది. జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శనివారం ఒక్కరోజే జిల్లాలోని పుష్కర ఘాట్లలో 19 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. అదికూడా సాయంత్రం 6గంటల వరకూ మాత్రమే. ఆ తరువాత నుంచి అర్ధరాత్రి వరకూ లక్షలాది మంది స్నానాలకు రాగా, రోజంతా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో లెక్కకు మిక్కిలిగా యాత్రికులు రోడ్లపైనే ఉండిపోయారు. మరెందరో యాత్రికులు వెనుదిరిగారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :గోదావరి తీరాలు జనసంద్రమయ్యాయి. వరుస సెలవులు రావడంతో తండోపతండాలుగా వస్తున్న లక్షలాది మంది భక్త జనంతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పుష్కరాలంటే ఎలా ఉంటాయో.. యాత్రికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో శనివారం నాటి భక్తుల తాకిడి చూసిన వారికి ప్రత్యక్షంగా అర్థమైంది. జిల్లాలోని 97 ఘాట్లలో సాయంత్రం 6 గంటలకే 18 లక్షల 81వేల 922 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లకు కిలోమీటర్ల మేర భక్తజనం బారులుతీరారు. ఘాట్లకు చేరుకోలేనివారు చివరకు గోదావరి కాలువల్లోనే స్నానాలు చేసి వెనుదిరిగారంటే పరిస్థితి ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు. జన ప్రవాహంతో శని వారం ఉదయానికే కొవ్వూరు పట్టణం కిక్కిరిసిపోయింది. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ ఏ రోడ్డు చూసినా పుష్కర యాత్రికులే కనిపించారు. ఉదయం ఆరున్నర గంటలకే ఏలూరు రోడ్డు వైపు 17కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొవ్వూరు-నిడదవోలు మార్గమంతా 18 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాజమండ్రి నాలుగో వంతెన మీద ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా అంచనాలకు మించి రెండు, మూడు రెట్లు అధికంగా యాత్రికులు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
 కాలవలు, రేవుల్లోనే పిండ ప్రదానాలు
 ఏలూరు నుంచి వచ్చే వాహనాలను ఉదయం 7గంటల తర్వాత దుద్దుకూరు వద్దే నిలిపివేసి పట్టిసీమ, పోలవరం, తాళ్లపూడి ఘాట్లకు తరలించారు. కొవ్వూరు-నిడదవోలు మార్గంలో వస్తున్న వాహనాలన్నీ నిలిపివేసి పాదచారులను మాత్రమే అనుమతించారు. దీంతో ఆయా ప్రాంతాల మీదుగా వచ్చిన భక్తులు నిడదవోలు లోని పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ఒడ్డున ఉన్న చినకాశీ రేవులో పుష్కర స్నానాలు ఆచరించారు. పిండ ప్రదానాలు కూడా అక్కడే చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం, గోపవరం కాలువ రేవుల్లో వేలాదిమంది భక్తులు స్నానాలు చేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. వ్యయ ప్రయాసలకోర్చి ఘాట్ల వద్దకు చేరుకున్న భక్తులను రెండు, మూడు, నిమిషాల్లోనే వెనక్కి వచ్చేయాల్సిందిగా ఘాట్ అధికారులు ఎప్పటికప్పుడు మైక్‌లో హోరెత్తించారు. ఘాట్ సిబ్బందైతే భక్తులు మూడు మునకలు వేయగానే.. ఇక చాలు రండి అంటూ వెంటపడ్డారు.
 
 రైళ్లల్లో నరకయాతన
 విజయవాడ-విశాఖ మధ్య  నడుపుతున్న ప్రత్యేక రైళ్లు శనివారం ఏడెని మిది గంటలు ఆలస్యంగా ప్రయాణిం చాయి. అసలు ఎప్పుడు గమ్యస్థానం చేరుకుంటామో తెలియక ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. రెగ్యులర్ రైళ్లు రత్నాచల్, జన్మభూమి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు ఐదు గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. పుష్కరాల కోసం ప్రత్యేకంగా విజయవాడ, ఏలూరు నుంచి రాజమండ్రికి నడుపుతున్న ఎలక్ట్రికల్ మొబైల్ యూనిట్ (ఇఎంయూ) రైళ్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు ప్రమాదకరస్థాయిలో బోగీల ఫుట్‌బోర్డ్‌ల మీద వేలాడుతూ కనిపించారు.
 
 నరసాపురంలో అర్ధరాత్రి నుంచే..
 నరసాపురంలో శుక్రవారం అర్ధరాత్రి 2గంటల నుంచే భక్తుల రాక మొదలైంది. ఊరంతా ఎటుచూసినా జన గోదావరే అన్నట్టు మారింది. లక్షలాది భక్తులు వెల్లువలా రావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. ఘాట్‌లకు వచ్చే అన్ని దారులను మూసివేసి కేవలం ఒక్క మార్గం ద్వారానే భక్తులను రేవుల వద్దకు అనుమతించారు. దీంతో అన్ని రహదారుల్లోనూ కిలోమీటర్లకొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ల వద్ద విపరీ తంగా పెరిగిన రద్దీ కారణంగా వసతులు ఏ మాత్రం సరిపోలేదు. స్నానానికి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. పిండ ప్రదాన షెడ్లు సరిపోక మండుటెండలో ఆరుబయటే కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యం లేక అవస్థలు పడ్డారు. ఘాట్ల వద్ద మహిళలతోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు భక్తుల రద్దీ కారణంగా ఘాట్ల వద్ద పలువురు మహిళలు సొమ్మసిల్లిపోయారు.
 
 సిద్ధాంతంలో యాత్రికులకు గాయాలు
 సిద్ధాంతంలో రవాణా సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆచంట నుంచి కోడేరు ఘాట్ వరకు ఒకే ఒక్క ఉచిత బస్ సర్వీసు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పుష్కర భక్తులు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సిద్ధాంతంలోని కేథార్‌ఘాట్‌కు వస్తున్న ఆటో బోల్తాపడి ఆరుగురు యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. కొవ్వూరు మండలం చిడిపి సమీపంలో ఏటిగట్టు మీద నుంచి ఆటో కిందకు దూసుకెళ్లగా, అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
 
 లాంచీలు చాలక..
 పోలవరంలో భక్తుల తాకిడి రెట్టింపైంది. పట్టిసీమ క్షేత్రాని కైతే భక్తులు పోటెత్తారు. లాంచీలు సరిపోక గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. వేలల్లో భక్తులుంటే కేవలం 6 లాంచీలు మాత్రమే ఏరా్పాటు చేశారు. మహానందీశ్వర క్షేత్రం కూడా కిటకిటలాడింది. కొవ్వూరుకు వెళ్లాల్సిన బస్సులు, వాహనాలను పట్టిసీమ వైపు తరలించడంతో ఏటిగట్టు పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
 
 చేతులెత్తేసిన పోలీసులు
 పెరవలి మండలంలో భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరిగింది. ఘాట్ల వద్ద అడుగుతీసి అడుగు వేయలేనంతంగా ఎక్కడ చూసినా జనమే కనిపించారు. పెరవలిలో కేవలం 250 మంది పోలీసులను మాత్రమే బందోబస్తుకు నియమిం చారు. దీంతో లక్షల్లో వచ్చిన యాత్రికులను నియంత్రించలేక పోలీసులు చేతులెత్తాశారు.
 
 నలుగురు మృత్యువాత..స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు
 కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్నానమాచరించేందుకు  తిరుపతి నుంచి వచ్చిన వృద్ధుడు జే.శ్రీనివాసరావు (75) గుండెపోటుతో మృతిచెందగా, స్నానం చేసి తిరిగి వెళ్తూ కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో అస్వస్థతకు గురై విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన పాండ్రింకి రామనాయుడు(48) మృత్యువాతపడ్డారు. గోష్పాద క్షేత్రం ఘాట్ వద్ద ఉచిత బస్సు నడుపుతున్న డ్రైవర్ రాజాహనుమంతరావు (50) గుండెపోటుతో బస్సులోనే మృతిచెందారు. పెనుమంట్ర మండలం మార్టేరు శివారు శివరావుపేటకు చెందిన భూపతి సత్యనారాయణ(23) వశిష్ట గోదావరి బ్రిడ్జి దిగువ ప్రాంతంలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో చిత్తూరుకు చెందిన ఇ.రామకృష్ణ మరణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement