
నాలుగు కోట్ల మంది పుష్కరస్నానాలు
గోదావరి పుష్కరాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇంత వరకు నాలుగు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని
మంత్రి కొల్లు రవీంద్ర
అప్పనపల్లి (మామిడికుదురు) : గోదావరి పుష్కరాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇంత వరకు నాలుగు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక పుష్కరఘాట్‌ను పరిశీలించారు. ఇక్కడ భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వీవీవీఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో రవీంద్రకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి చిత్రపటం అందజేశారు. మంత్రి రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ పుష్కరాల్లో 5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నామన్నారు. శనివారం పుష్కర దీపోత్సవంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.
గోదావరి మాత అనుగ్రహం కావాలి
గోదావరి మాత అనుగ్రహంతోనే నదుల అనుసంధానం సాధ్యమవుతుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ఆగష్టు 15 నాటికి పూర్తి అవుతుందన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అత్మహత్య చేసుకున్న రైతుకు రూ.5 లక్షలు ప్యాకేజ్ అమలు చేస్తున్నామన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, నగరం ఏఎంసీ చైర్మన్ కొమ్ముల నాగబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దాల కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ బొంతు సూర్యభాస్కరరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సూదా బాబ్జీ, అల్లూరి గోపీరాజు, మొల్లేటి శ్రీనివాస్ ఉన్నారు.