సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని బంగారు వర్తకులు నిరవధిక సమ్మెను విరమించారు. బుధవారం నుంచి షాపులు తెరిచి వ్యాపారం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకూ న్యూఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వ్యాపార సంఘ ప్రతినిధులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్‌లు ఢిల్లీ నుంచే ఫోన్‌ల ద్వారా సమాచారం పంపారు. బుధవారం నుంచి షాపులు తెరవాలని వివిధ జిల్లాల వ్యాపార సంఘ ప్రముఖులకు మెసేజ్‌లు పంపారు.
కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుకు నిరసనగా రాష్ట్రంలోని బంగారు వ్యాపారులు మార్చి 29 నుంచి రెండో దశ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న విషయం విదితమే. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 వేల షాపులు మూతపడ్డాయి. రోజుకు రెండున్నర వేల కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. కొన్ని పట్టణాల్లో కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు సమ్మెకు కలిసి రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. కొత్త రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మార్చి 29న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించినా వ్యాపారులు ఖాతరు చేయలేదు.
ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చేసిన సూచననూ పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ ఆఖరుకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. మార్చి నెల ఒకటో తేదీ నుంచి వీటిని చేయించుకోవాల్సి ఉండగా, నెల రోజులు గడిచినా 20 శాతం రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆందోళన చెందిన రాష్ట్రానికి చెందిన వ్యాపార సంఘం ప్రతినిధులు గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
సమ్మె విరమించిన బంగారం వర్తకులు
Published Wed, Apr 6 2016 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement