యూరప్‌లో బంగారుపతకం అందుకుంటున్న జిష్ణు
చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలోని పుత్తూరు పరిధి రాచపాళెం గ్రామానికి చెందిన బసవరాజు జిష్ణు(18) అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించాడు. ఈ నెల 19 నుంచి 29 వరకు యూరప్‌లోని చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశాల్లో నిర్వహించిన 50వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ చాటా డు. ఈ పరీక్షల్లో 85 దేశాలకు చెందిన విద్యార్థులు పోటీపడ్డారు. అందులో జిల్లాకు చెందిన జిష్ణు రసాయన శాస్త్రంలో నిర్వహించిన రాతపరీక్ష, ప్రయోగ పరీక్షలో ప్రతిభ చాటి బంగారుపతకం కైవసం చేసుకున్నాడు.
అనంతరం ఈ విద్యార్థి ప్రాగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం తరఫున బహుమతి పొందాడు. జిష్ణు ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒలంపియాడ్ పోటీలు మూడంచెల ఎంపిక పరీక్ష విధానంలో జరిపారని చెప్పారు. మన దేశం నుంచి తనతో పాటు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు చెంగల్‌రాజు, భారతి ప్రభుత్వ ఉపాధ్యాయులని, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ బహుమతి సాధించగలిగానన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు, పోటీపరీక్షలు రాసి దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన ఆశయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment