- మాయమైన 60 కాసుల బంగారం
కంబాలచెరువు (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతదేహాలను తరలించే ప్రక్రియలో వారి శరీరంపై నున్న సుమారు 60 కాసుల బంగారం మాయమైంది. అంబులెన్స్‌ల్లో పలు దఫాలుగా వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి మార్చురీ వద్ద దింపే ప్రక్రియలో కొందరు సాయం చేస్తున్నట్టు నటించి బంగారాన్ని తస్కరించారు. పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాల శరీరంపై నున్న ఆభరణాలను ఆస్పత్రి సిబ్బంది తీసి వారి కుటుంబసభ్యులకు ఇచ్చేస్తారు. ఈ క్రమంలో కొందరు బయట వ్యక్తులు అక్కడకు వచ్చి మృతదేహాలను దింపే సమయంలో వారి చేతికి పని చెప్పారు.
తొక్కిసలాటలో మృతిచెందిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతదేహాన్ని వారి కుమారులు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆ సమయంలో శరీరంపై నున్న బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి అక్కడి సిబ్బందిని అడిగారు. వారు తమకు తెలియదని చెప్పారు. తన తల్లి శరీరంపై ఏడు కాసుల బంగారు ఆభరణాలు ఉంటాయని, అవి ఏమైపోయాయో తెలియవని అక్కడే ఉన్న ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
27 మందీ ఊపిరాడకే చనిపోయారు
పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ వెల్లడి
రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 27 మందీ కేవలం ఊపిరాడకే మృతి చెందారు. దీనిలో మృతి చెందిన వారిపై పలు విషయాలు తెలుసుకునేందుకు వెళ్లిన ‘సాక్షి’తో ఆయన బుధవారం మాట్లాడారు. ఒక్కసారిగా జనం రద్దీ పెరిగిపోయి ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు కిందపడిపోగా, మరికొందరు జనం మధ్యలో గట్టిగా నలిగిపోయారన్నారు. 26 మంది ఘటనా స్థలంలో చనిపోయారన్నారు. ఊపిరాడక ఆస్పత్రికి 51 మంది రాగా, వారిలో ఒకరు మృతి చెందారన్నారు. మిగిలిన వారందరికీ మెరుగైన వైద్య సేవలందించి ఇళ్లకు పంపామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ వైద్యాధికారి డీసీహెచ్‌ఎస్ షాలినీదేవి ఆ ప్రాంతంలో ఉన్నారని, సంఘటనను చూసి తనకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. కొందరిని ఘటనా స్థలానికి, మరికొందరిని ఆస్పత్రి వద్ద ఉంచామన్నారు.