తిరుమల గిరుల్లో బంగారు బల్లులు | Golden lizards at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల గిరుల్లో బంగారు బల్లులు

Published Sun, Feb 26 2017 5:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

తిరుమల గిరుల్లో బంగారు బల్లులు

తిరుమల గిరుల్లో బంగారు బల్లులు

తిరుమల శేషాచల కొండల్లో పెరుగుతున్న సంతతి
అంతరించిపోతున్న జాతి పునరుజ్జీవం
శేషాచలంలో అనుకూలంగా వాతావరణం


సాక్షి, తిరుమల: అరుదైన బంగారు బల్లి జాతిని తిరుమల గిరులు సంరక్షిస్తున్నాయి... శేషాచల కొండల్లో బంగారు బల్లి సజీవంగా ఉంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండ డంతో ఏడాదిలోనే వాటి సంతతి గణనీయంగా పెరిగింది. తిరుమలేశుని ఆలయానికి 3 కి.మీ దూరంలోని చక్రతీర్థంలో ఇవి ఎక్కు వగా కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం ఇక్కడ ఓ బల్లి కనిపించగా ఇప్పుడు వాటి సంఖ్య ఆశా జనకంగా ఉంది. తిరుమలలోని కొండ గుహల ప్రాంతాల్లో సాక్షి ప్రతినిధి నిర్వహించిన పరిశోధనలో ఈ బల్లులు అనూహ్య సంఖ్యలో కనిపించాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ బల్లిజాతి క్రమంగా పెరుగుతోందనే అభిప్రాయానికి ఇది బలం చేకూర్చింది. దీనిపై ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని చక్రతీర్థంతోపాటు 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం ప్రదేశాల్లో మాత్రమే ఈ బంగారు బల్లి కనిపిస్తోంది.

సజీవంగా చూడాలంటే శేషాచలంలోనే
తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే నిజంగానే బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుంది. ఏడాది ముందు చక్రతీర్థంలో ఈ బంగారు బల్లి సజీవంగా కనిపించింది. తాజాగా అదే ప్రాంతంలో బంగారు బల్లులు కనిపించటం విశేషం. బంగారు వర్ణంతో ఈ బల్లులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కాలొడాక్టి లోడన్‌ ఇల్లింగ్‌ గోర్థోరన్‌ జాతికి చెందిన బంగారు బల్లి ఓసారి శ్రీలంకలో కని పించింది. ఈ రెండు జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉన్నట్టు ఆధారాలు లేవు.

వీటి జీవనం ఇలా..
► బంగారు బల్లి శాస్త్రీయనామం కాలొడాక్టి లోడస్‌ అరీస్‌. ఇది రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదు రు పసుపు, లేత పసుపురంగులో ఉంటుంది.  
► అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరిందని సర్వేలు చెబుతున్నాయి. తొలి సర్వేలో తిరుమల కొండల్లో మాత్రమే కనిపించాయి. అటవీ ప్రాంతాల్లో కొండలను తొలచి నిర్మాణాలు చేపడుతుండటంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నాయి.
► ఇవి 150 మి.మీ. నుంచి 180 మి.మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం. అందులోనూ రాతి సందుల్లో తేమ ప్రాంతాలంటే వాటికి మహా ఇష్టం.
► సాధారణంగా చీకటిపడ్డాక వెలుపలకు వస్తాయి. ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఇళ్లలో ఉన్న సాధారణ బల్లుల కంటే గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం చాలా వింతగానూ ఉంటుంది.

జీవజాతులకు ఆవాసం
జీవజాతులకు ఆరోగ్యవంతమైన ఆవాస కేంద్రం శేషాచలం. ఇటీవల కాలం లో శేషాచలంలో ఏనుగులు, చిరుతలు, బంగారు బల్లులు కనిపిస్తుండటం, వాటి సంఖ్య పెరగటం ఇందుకు నిదర్శనం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, సమతుల్యత తో పాటు శేషాచల గిరులు మరింత దట్టంగా పెరగటం, రక్షణ చర్యలు పెరగటం కూడా మరో ప్రధాన కారణం.
– ఎన్‌వీ శివరామ్‌ప్రసాద్, డీఎఫ్‌వో, టీటీడీ

బంగారు బల్లి జాడపై పరిశోధన
బంగారుబల్లి జాడపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఎస్వీ యూనివర్శిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. 1998వ సంవత్సరంలో అప్పటి ప్రొఫెసర్‌ ఎస్‌వీ నందకుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.రాజశేఖర్‌ శేషాచల అడవుల్లో రాత్రిళ్లలో తిరిగి వాటి జాడలపై నివేదిక సమర్పించారు. వాటి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు రూపంలో నివేదిక సమర్పించారు. దీనిపై తర్వాత ఎలాంటి చర్యలు లేకపోవడం ఆవేదన కలిగించే విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement