=కొంప ముంచిన అక్టోబర్ వర్షాలు
=వర్షపాతం లెక్కలతో అన్నదాతకు నష్టం
=సాగు బాగుందని వ్యవసాయశాఖ నివేదిక
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల కురిసిన వర్షాలు రైతుల కొంప ముంచేశాయి. చేతికొస్తున్న పంట ను నీటిపాలు చేయడమే కాకుండా అంతవరకు ఉన్న కరువు పరిస్థితుల్ని కనిపించకుండా చేశా యి. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు లేవంటూ వ్యవసాయ అధికారులు నివేదిక రూపొందించా రు. అది ప్రభుత్వానికి వెళితే కరువు జాబితాలో జిల్లాకు చోటుండదు. ఖరీఫ్‌కు ముందే రుతు పవనాల రాకతో ఈ ఏడాది వర్షాలు అనుకూలిస్తాయన్న ఆశతో అన్నదాతలు పెద్ద ఎత్తున పంటలు చేపట్టారు.
జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2.02లక్షల హెక్టార్లు. అందులో 1.72 లక్షల హెక్టార్లలో పంటలు చేపట్టారు. ఇందులో వరి సాధారణ విస్తీర్ణం 96,667 హెక్టార్లు. 84,487 హెక్టార్లలో నాట్లు వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కానీ సీజన్ ప్రారంభం తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో వేలాది హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. పంటలకు కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా దాదాపు 30 మండలాల్లో కరవు మేఘాలు అలుముకున్నాయి.
అధికారులు సూచన ప్రాయంగా ఇదే విషయాన్ని అప్పట్లో నిర్ధారించారు. ఈమేరకు పూర్తి వివరాలతో అక్టోబర్ నెలాఖరుకు నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. దీంతో కరువు సాయం ఉంటుందని రైతులు ఆశపడ్డారు. ప్రభుత్వానికి నివేదిస్తే ఎంతోకొంత సాయంతో ఆదుకుంటుందని భావించారు. కానీ అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో భిన్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు కరువు నివేదిక తయారీ కోసం క్షేత్రస్థాయికి వెళ్లిన అధికారులకు కరువు ఛాయలు కనిపించలేదు.
ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2.02లక్షల హెక్టార్లకు 1.91లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి విషయానికొస్తే 96,667హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 96,682హెకా్టార్లలో నాట్లు పడినట్టు లెక్క తేల్చారు. అంటే సాధారణం కన్నా ఎక్కువే చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇక వర్షపాతాన్ని పరిశీలిస్తే జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 1005 మిల్లీమీటర్లు. ఆ సమయంలో జిల్లా వ్యాప్తంగా 980 మిల్లీమీటర్లు నమోదైనట్టు నివేదికలో అధికారులు పొందుపరిచారు.
వాస్తవంగా జూన్ నుంచి సెప్టెంబర్ వర్షపాతాన్ని కరువు అంచనా నివేదికలో పేర్కొనాలి. కానీ అధికారులు అక్టోబర్ నెల వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దానినే కలెక్టర్‌కు వ్యవసాయాధికారులు సూచన ప్రాయ నివేదికగా ఇచ్చారు. సాధారణంగా దానినే కలెక్టర్ ప్రభుత్వానికి పంపిస్తారు. అదే జరిగితే కరువు జాబితాలో జిల్లాకు చోటు దక్కే అవకాశం లేదు. ఫలితంగా కరవు ఎదుర్కొన్న రైతులంతా నష్టపోవాల్సిందే.