- ఖరీఫ్‌లో 4 నెలల్లో నమోదు కాని సగటు వర్షపాతం
- ఆగస్టులో వర్షంపై అనుమానాలు
- రైతుల ఆశలు ఆవిరి
బి.కొత్తకోట: ఖరీఫ్ సేద్యానికి జూలైలో కురిసే వర్షపాతమే కీలకం. అన్నిపంటల సాగుకోసం రైతులు ఈ నెలలో కురిసే వర్షంపైనే ఆశలుపెట్టుకుంటారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉండడంతో వ్యవసాయం ఆగిపోతోంది. జూలైలో జిల్లాలో సగటు వర్షపాతం 101.9 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. బుధవారం నాటికి కేవలం 62.3 మిల్లిమీటర్ల వర్షపాతమే నమోదైంది. ప్రధానంగా పడమటి మండలాల్లో సేద్యం దయనీయంగా మారింది.
పంటలు పెట్టిన రైతులు.. పంటలు పెట్టని రైతులు వర్షంకోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గడచిన నాలుగు నెలల్లో ఒక్క నెలలో కూడా సగటు వర్షపాతం నమోదు కాలేదు. గత సంవత్సరం రెండు నెలల్లో సగటుకు మించిన వర్షం నమోదైంది. ఈ ఏడాది సగటు వర్షం మాటేలేదు. ఇది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా సాగు సాధ్యం కావడంలేదు. ఖరీఫ్ పంటలపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొలాలను బీళ్లుగా ఉంచుకుని ఆవేదన చెందుతున్నారు. వరుస కరువులు, పంటల నష్టాలతో అల్లాడిపోతున్న రైతులకు ఈ పరిస్థితులు మింగుడు పడడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు 2,11,582 హెక్టార్లలో సాధారణ సాగు కావాలి. అయితే బుధవారం నాటికి 1,59,310 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి.
వేరుశెనగపంటను 1,36,479 హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా 1,10,954 హెక్టార్లలో సాగుచేశారు. మిగిలిన భూములన్నీ ఇంకా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో జూలై 30 నాటికి జిల్లావ్యాప్తంగా 1,18,857 హెక్టార్లలో వేరుశెనగ పంటను సాగుచేశారు. గత ఏడాది కంటే ప్రస్తుతం 7,903 హెక్టార్లలో సాగు తగ్గింది.