అమరావతి: నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులు 17-24 ఏళ్ల వారై ఉండాలి. అలాగే, మూడుసార్లు మాత్రమే ఈ అర్హత ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ రెండు నిబంధనలను సడలించాలని ఎంసీఐ నిర్ణయించింది. 17 ఏళ్ల వయసు లేకపోయినా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశమిస్తే బాగుంటుందని ఎంసీఐ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే గరిష్ట వయోపరిమితితో పాటు ఎన్ని సార్లు ఈ అర్హత పరీక్ష రాసుకోవచ్చు అనేది ఇంకా నిర్ణయించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై రెండ్రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పీజీ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థులకు మాత్రం ఎలాంటి వయసు సడలింపులివ్వడం లేదని ఎంసీఐ వర్గాలు తెలిపాయి.
వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత: పీజీ వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత వస్తుందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు స్పష్టం చేశారు. భారతీయ వైద్య మండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెరగాల్సిన సీట్లపై కసరత్తు జరుగుతోందని, ఈనెల 17న జరిగే ఎంసీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. దీనిపై ఈనెల 20లోగా స్పష్టత వస్తుందని చెప్పారు. మొత్తం 6 కళాశాలల (గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురం) నుంచి వివిధ స్పెషాలిటీలకు సంబంధించి మొత్తం 380 సీట్లకు పైగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కనీసం 250 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ సీట్లన్నీ తొలివిడత కౌన్సెలింగ్‌లోపే జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న ఒక ప్రొఫెసర్‌కు ఇద్దరు విద్యార్థుల నిబంధనను సడలించి ఒక ప్రొఫెసర్‌కు ముగ్గురు విద్యార్థులను ప్రకటించడంతో సీట్లు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు.