తాత, మనవడిని కబళించిన మృత్యువు | Gorged death | Sakshi
Sakshi News home page

కబళించిన మృత్యువు

Published Sat, Nov 15 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

తాత, మనవడిని కబళించిన మృత్యువు

తాత, మనవడిని కబళించిన మృత్యువు

నాదెండ్ల/ఫిరంగిపురం: ఒకరు ఉద్యోగ విధులకు, మరో ముగ్గురు కూలి పనుల కోసం తమ గమ్య స్థానాలకు చేరేందుకు తూపాను జీప్ ఎక్కిన గంటలోపే విగతజీవులుగా మారిన సంఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గుంటూరు-కర్నూలు రాష్ట్ర రహదారిపై శుక్రవారం ఉదయం 6.50 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడి గుంటూరు పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామం పరిధిలో ఉన్న మేరికపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై తూపాను జీప్‌ను ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది. డ్రైవరుతో కలిపి ఎనిమిది మంది వున్న ఆ వాహనం 100 అడుగుల ఎత్తునుంచి ఫ్లైఓవర్ సైడ్‌వాల్ మీదుగా కిందకు దూసుకుపోయింది.

  ఈ దుర్ఘటనలో గుంటూరులో నివాసం ఉంటూ ఈపూరు మండలం కొచ్చెర్ల జెడ్పీ హైస్కూల్‌లో హెడ్మాస్టరుగా పని చేస్తున్న నాగండ్ల లక్ష్మీ ద్రాక్షాయణి(52), కూలి పనులు చేసుకునే ఇర్ల నాగరాజు (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.

  గాయపడిన వారిని గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇర్ల నాగేశ్వరరావు (65), షేక్ ఖాదర్‌వలి (45) అనే ఇద్దరూ మృతి చెందారు. వీరిద్దరూ కూలీలే. మృతి చెందిన ఇర్ల నాగేశ్వరరావు, నాగరాజులు తండ్రీకుమారులు.

  జీప్ డ్రైవరు మల్లికార్జున నాయక్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు ఫరీద్ షుకూర్, షేక్ రవూఫ్, ముసునూరి శ్రీనివాసరావులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాసరావు గుంటూరు శ్యామలానగర్‌లో నివాసం ఉంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడు పాఠశాలలో హెడ్మాస్టరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం సెలవులో ఉండి నరసరావుపేట వెళుతూ   ప్రమాదానికి గురయ్యారు. డ్రైవరు నాయక్, శ్రీనివాసరావుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

 జీప్ బయలు దేరిందిలా...
  కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన మల్లికార్జుననాయక్ అనే వ్యక్తి తూపాను జీప్ నడుపుతున్నాడు. బాడుగు నిమిత్తం గుంటూరు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రయాణికుల కోసం మార్కెట్ సెంటర్‌లో జీపు నిలిపాడు. ఆ సమయంలో కొచ్చర్ల జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టరు ద్రాక్షాయణి, కరాలపాడు ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముసునూరి శ్రీనివాసరావు జీప్ ఎక్కారు.

  అక్కడి నుంచి బయలుదేరిన తరువాత మార్గమధ్యలో ఫిరంగిపురం మండలం వేములూరిపాడు, అమీనాబాద్ గ్రామాల వద్ద తండ్రీ కుమారులు ఇర్ల నాగేశ్వరరావు, నాగరాజు, మరో ముగ్గురు షేక్ ఖాదర్‌వలీ, ఫరీద్ షుకూర్, షేక్ రవూఫ్ జీపు ఎక్కారు.  

వీరంతా కూలీలే..
  మేరిక పూడి గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి జీప్ వెళుతుండగా నరసరావుపేట వైపు నుంచి ఎదురుగా గుంటూరు వస్తున్న సిమెంట్ లోడు లారీ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి జీప్‌ను ఢీకొట్టింది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జీప్ కిందనున్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది.

 భర్త,కుమారుడిని కోల్పోయి...
 తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు, నాగరాజులు మృతి చెందడంతో నాగేశ్వరరావు భార్య పార్వతి, నాగరాజు భార్య అంకాళమ్మ రోధనలు స్థానికులను కలచి వేశాయి. భర్త, కుమారుడిని కోల్పోయిన పార్వతమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నాగేశ్వరరావు  కుటుంబ సభ్యులు అంత కష్టజీవులే. రాతి పనులు చేస్తూ బతుకుతుంటారు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
 7 మృతి చెందిన అమీనాబాద్ గ్రామానికి చెందిన రాతి పనుల కార్మికుడు షేక్ ఖాదర్‌వలీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
 కొచ్చర్లలో విషాద ఛాయలు
 వినుకొండ( ఈపూరు): ఈపూరు మండలం కొచ్చర్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగండ్ల లక్ష్మీద్రాక్షాయణి (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలియడంతో కొచ్చెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చివరిసారిగా ఆమెను చూసేందుకు ఉపాధ్యాయులు గుంటూరు వెళ్లారు.

  1983లో టీచరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ద్రాక్షాయణి తొలుత మేడి కొండూరు ప్రాథమిక పాఠశాలలో పని చేశారు.  ఆ తరువాత 2000లో పదోన్నతిపై స్కూల్ అసిస్టెంటుగా కొచ్చర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చారు.

  ఇక్కడి విద్యార్థులకు జీవశాస్త్రం బోధించే లక్ష్మీద్రాక్షాయణి ప్రధానోపాధ్యాయురాలిగా అటు ఉపాధ్యాయులు, విద్యార్థులతో చాలా బాగుంటారనే  మంచి పేరు ఉంది. హెచ్‌ఎంగా స్కూల్ అభివృద్ధికి కృషి చేశారని ఇందులో భాగంగానే ఎనిమిది తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని సహచర ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

  ఆమె మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

  మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త యడ్లపాడులోని ఆర్‌సీఎం స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

విధి నిర్వహణలో ద్రాక్షాయణి నిబద్ధతగా ఉండేవారు...
 మృతి చెందిన ప్రధానోపాధ్యాయురాలు ద్రాక్షాయణి విధి నిర్వహణలో నిబద్ధతగా ఉండేవారని ఘటనా స్థలానికి చేరుకున్న తోటి ఉపాధ్యాయులు తెలిపారు. ఉదయం ఆరు గంటలకే గుంటూరు నుంచి బయలుదేరి అందరి కంటే ముందుగా విధులకు హాజరయ్యేవారని గుర్తుచేసుకున్నారు. ఆమె భర్త లూర్ధురాజు యడ్లపాడు  మండలం మైదవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.  

పెద్దకుమారుడు ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు.  రెండోకుమారుడు దంత వైద్యం అభ్యసిస్తున్నాడు. గుంటూరులోని శ్రీనగర్ కాలనీ 2వ లైన్‌లో సొంతింటిలో నివసిస్తున్నారు.  భర్త లూర్ధురాజు ప్రతిరోజు ఉదయం బైక్‌పై ఆమెను తీసుకువచ్చి ఆర్టీసీ బస్సుఎక్కించి వెళ్లేవారు. డీఈవో కార్యాలయంలో పని ఉండటంతో రాజు సెలవులో ఉన్నారు. షేవింగ్ షాపులో ఉన్న ఆయన ప్రమాద వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు.

 నిత్యం గుంటూరు నుంచి రాక...
  హెచ్‌ఎం ద్రాక్షాయణి గుంటూరులో నివాసం ఉంటూ నిత్యం కొచ్చెర్లకు రాకపోకలు సాగిస్తుం టారు. గుంటూరు నుంచి వినుకొండకు 100 కిలోమీటర్లు, అక్కడి నుంచి కొచ్చర్లకు మరో 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరికొందరు విజయవాడ, తెనాలి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

  ఉద్యోగులు పనిచేసే చోటే ఉండాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తూ తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలకు ఎంతో మంది ఉద్యోగులు మృత్యువాత పడడం అందరి మనసులను కలచివేసే విషయమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement