కబళించిన మృత్యువు | Gorged death | Sakshi
Sakshi News home page

కబళించిన మృత్యువు

Published Sun, Jul 12 2015 3:13 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Gorged death

వినుకొండ  /ఈపూరు : గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ గ్రామం నుంచి పశువుల ఎరువును లారీలో లోడు చేసుకుని కూలీలు యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామం వెళ్తున్నారు. లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌తోపాటు మరో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరేళ్ళ బాలిక కూడా ఉంది. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు మువ్వా గంగమ్మ, హనుమంతురావులు ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.

కొండ్రముట్ల సమీపంలో ద్విచక్రవాహనం వేగంగా ఎదురుగా వస్తుండటంతో, దాన్ని తప్పించేందుకు లారీని రోడ్డు పక్కకు తీస్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన కాలువలో పడిపోయింది. ప్రమాదంలో యర్రగొండపాలెంకు చెందిన డ్రైవర్ షేక్ మౌలాలి, ఇదే మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన గోపినీడు పెదవెంకటేశ్వర్లు, కన్నమనీడు పెద వెంకటేశ్వర్లు, మువ్వా సుందరమ్మ, మువ్వా మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.

సంఘటనలో తీవ్ర గాయాలైన వాదంపల్లికి చెందిన దుగ్గినీడు ఆదిలకిృ్ష్మ, చింతల పెదవెంకటేశ్వర్లు, మూడమంచు వెంకటేశ్వర్లు, మూడమంచు గంగమ్మ, మూడమంచు పెదవెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన మువ్వా గంగమ్మ, మువ్వా హనుమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో మువ్వా గంగమ్మ, హనుమంతరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  
 మృత్యుంజయరాలు కౌశల్య..
 కర్ణాటకలో ఉండే ఆరేళ్ల కౌశల్య శుక్రవారం అమ్మమ్మ వద్దకు వచ్చింది. ఇంట్లో చిన్నారిని వదలలేక తమతోపాటు తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో పాపకు ఎలాంటి గాయాలు కాకపోవటం విశేషం.

 అనాధైన కుటుంబాలు..
 యర్రగొండపాలెం: ఒక లారీ లోడు పశువుల ఎరువులు తీసుకొస్తే రూ 1800 ఇస్తారు. ఆ డబ్బును పది మంది కూలీలు పంచుకుంటారు. గ్రామంలో పనులు లేని సమయంలో కూలీలు గ్రూపులుగా ఏర్పడి పశువుల ఎరువులు తీసుకొచ్చే  పనికి వెళ్తుంటారు. మృతులలో మువ్వా సుందరమ్మ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. తన ఇద్దరి పిల్లలను పోషించుకునేందుకు కూలీ పనులకు వెళ్లక తప్పలేదు. ఆమె కూడా మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. మరో మృతుడు లారీ డ్రైవర్ షేక్ మౌలాలి తనకున్న సొంత లారీతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలకు వివాహాలు చేయగా మరో కుమార్తెకు ఈనెల 26వ తేదీన మార్కాపురంలో వివాహం చేయటానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో మృత్యువు కాటేసింది.

 రూ, లక్ష చొప్పున ఆర్థిక సాయానికి కృషి
 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురికి టీడీపీ వైపాలెం త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ, లక్ష చొప్పున ఆర్ధిక సాయానికి కృషి చేస్తానన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. త్రిసభ్య కమిటీ మరో సభ్యుడు పల్లె మార్కు రాజు, వైపాలెం జడ్పీటీసీ సభ్యుడు మంత్రూనాయక్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి లింగయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement