ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా హక్కుదారులకు అందించే కోడిగుడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్కరికి నెలకు 8 కోడిగుడ్లను మాత్రమే అందిస్తున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి 16 కోడిగుడ్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హక్కుదారులైన చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు కొంతమేర ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు ప్రాజెక్టుల వారీగా హక్కుదారుల వివరాలు సేకరించారు. ఎన్ని కోడిగుడ్లు అవసరమవుతాయో డెరైక్టరేట్‌కు నివేదికలు పంపించారు. రాష్ట్రావతరణ దినోత్సవం నుంచి జిల్లాలోని హక్కుదారులకు అదనపు కోడిగుడ్లు అందనున్నాయి. మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ ఆధ్వర్యంలో 21 సీడీపీఓ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 4093 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
ప్రతి కేంద్రంలో జనాభాను బట్టి 15 నుంచి 30 వరకు ఐదేళ్లలోపు చిన్నారులు,గర్భిణులు, బాలింతలున్నారు. ఇప్పటి వరకు వీరికి వారంలో రెండు రోజుల పాటు కోడిగుడ్లు అందిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో కోడిగుడ్లు ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు మత్రం ఇంటికి పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే కోడిగుడ్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని ప్రభుత్వం భావించింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించింది. అంగన్‌వాడీ కేంద్రా ల ద్వారా ఇచ్చే కోడిగుడ్ల సంఖ్యను పెంచితే అదనపు పౌష్టికాహారం అందుతుందని తేలింది. దీంతో అన్ని జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనంగా కోడిగుడ్లను అందించాలని నిర్ణయించారు. వారంలో నాలుగుసార్లు కోడిగుడ్లను అందించడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడేవారికి కొంతమేర ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
వేళలు, వేతనాలు కూడా పెంపు
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ వేళలను పెంచారు. కార్యకర్త, ఆయాలకు అందించే వేతనాలను కూడా పెంచేశారు. అదే సమయంలో కోడిగుడ్ల సంఖ్యను కూడా రెట్టింపు చేయడంతో అంగన్‌వాడీలు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంట వరకు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యును అందించడంతో పాటు పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ కింద నిత్యావసరాలు అందిస్తున్నారు.
తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల వేళలను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పెంచారు. అదనంగా రెండున్నర గంటలు పెంచారు. వేళలతో పాటు కార్యకర్తలు, ఆయాలకు అందించే గౌరవ వేతనాన్ని స్వల్పంగా పెంచారు. ఇప్పటివరకు అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు 3700 రూపాయలు చెల్లిస్తుండగా, మరో 500పెంచి, ఆ మొత్తాన్ని 4200 రూపాయలు చేశారు. ఆయాకు 1950 రూపాయలు చెల్లిస్తుండగా మరో 250 రూపాయలు కలిపి 2200 రూపాయలు చేశారు.
అంగన్‌వాడీలకు రెట్టింపు కోడిగుడ్లు
Published Thu, Oct 31 2013 6:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
Advertisement
Advertisement