కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 5వ తేదీ నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, బాధతో ఉన్నారన్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఈ ధర్నా ద్వారా తెలియజెప్పాలన్నారు. అనంతరం మేయర్ కే. సురేష్‌బాబు మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. వీటిని ప్రజలకు తెలియజెప్పి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక లోటు బడ్జెట్ ఉంటుందని తెలిసీ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారన్నారు.
రైతులకు, డ్వాక్రామహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని అనేక హామీలిచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరునెలలుగా రుణమాఫీ చేయలేక కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్ ఖాన్, మాసీమ బాబు, ఎంపీ సురేష్, అనుబంధ విభాగాల సభ్యులు జీఎన్‌ఎస్ మూర్తి, పులిసునీల్‌కుమార్, నిత్యానందరెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి, కరిముల్లా, బంగారు నాగయ్య, ఎస్‌ఎండీ షఫీ, బి. అమర్‌నాథ్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, టిపి వెంకట సుబ్బమ్మ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.