
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలావరకు నియంత్రించింది. చనిపోయిన, కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పుడేకంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా నడుం బిగించింది. గతంలో అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టేది. దీనికంతటికీ గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కవడమే ప్రధాన కారణం. అవినీతికి తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దీంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగు చూస్తున్నాయి.
గతంలో జరిగిన అక్రమాలివీ..
జిల్లాలో 18 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు 13,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పచ్చి బియ్యం, దొడ్డు బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, నాణ్యతలేమి కారణంగా అధిక శాతం మంది లబి్ధదారులు వీటిని తినేందుకు ఇష్టపడలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు దండుకునేవారు. కొందరు డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్‌మిల్లులకు అమ్ముకునేవారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ.30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే తిరిగి రేషన్ డిపో డీలర్లు రూ.9 నుంచి రూ.10లకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం మిలర్ల వద్దకు కిలో రూ.15 నుంచి రూ.20 ధరతో చేరేవి. పాలిష్ అనంతరం ఇదే బియ్యాన్ని మాఫియా కిలో రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇక మిల్లర్లయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి బదులు సీఎంఆర్‌గా ఈ రేషన్ బియ్యాన్నే తిరిగి అప్పగించే సంస్కృతి కొనసాగేది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దురి్వనియోగం, డీలర్లు, మిల్లర్లకు సొమ్ము తెచ్చి పెట్టడం తప్ప ప్రయోజనం ఉండేది కాదు.
వలంటీర్లతో కొంతమేర కట్టడి..
ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క క్లస్టర్‌కి 50 నుంచి 60 వరకు కుటుంబాలను కేటాయించి, వాటికొక వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో అప్పటి నుంచి గత అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. తొలుత బోగస్ కార్డుల బాగోతం గుట్టు రట్టయింది గతంలో 8,32,636 రేషన్‌కార్డులుంటే ఇప్పుడవి 8,16,412కు చేరాయి. అలాగే గతంలో 13,243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇప్పుడది 12,335మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ లెక్కన 16,224 కార్డులు తగ్గి 908 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయింది. దాదాపు 40 వేల యూనిట్లు కూడా తగ్గాయి. ఇవి కాక నవశకం సర్వేలో వేలాది బోగస్ కార్డులను గుర్తించినట్టు సమాచారం.
ఫోర్టి ఫైడ్ రైస్‌తో మరింత అడ్డుకట్ట
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడేందుకు ప్రభుత్వం మిల్లర్లకు పంపిస్తోంది. ఇలా ఇచ్చిన ధాన్యంలో 67 శాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇక్కడే తేడా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇవ్వవల్సిన సీఎంఆర్‌లో ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసి కొంతమంది మిల్లర్లు తిరిగి ఇచ్చేవారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్‌కు విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. మిల్లర్లకు ఏ ధాన్యమైతే ఇస్తున్నారో అదే రకమైన బియ్యాన్ని మళ్లీ సీఎంఆర్ కింద ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం షరతు పెట్టింది. దానికి తోడు ఇకపై పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ‘బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని’ కలపనుంది. ఇలా చేసి ఫోరి్టఫైడ్ రైస్‌ను ఇకపై వలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనుండటంతో అవే బియ్యాన్ని ఒకవేళ ప్రజల నుంచి సేకరించి, సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తే దొరికిపోతారు. ఫోరి్టఫైడ్ రైస్ వలన మిక్సింగ్ చేశారా.. లేదా అన్నది తేలిపోనుంది. నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌కు నరసన్నపేట, పొందూరులలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే రేషన్ బియ్యంలో ఫోరి్టఫైడ్ రైస్ మిక్సింగ్ చేయనున్నారు.
అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు
రేషన్ బియ్యం ద్వారా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా, సీఎంఆర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రకం ధాన్యం ఇస్తే ఆ రకం పోలిన బియ్యం మిల్లర్లు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ యూనిట్లలో రేషన్ బియ్యంలో బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని మిక్సింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది.
– కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల సంస్థ
Comments
Please login to add a commentAdd a comment