Ration irregularities
-
రేషన్ అక్రమాలకు సర్కార్ చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలావరకు నియంత్రించింది. చనిపోయిన, కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పుడేకంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా నడుం బిగించింది. గతంలో అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టేది. దీనికంతటికీ గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కవడమే ప్రధాన కారణం. అవినీతికి తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దీంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగు చూస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమాలివీ.. జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు 13,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పచ్చి బియ్యం, దొడ్డు బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, నాణ్యతలేమి కారణంగా అధిక శాతం మంది లబి్ధదారులు వీటిని తినేందుకు ఇష్టపడలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు దండుకునేవారు. కొందరు డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్‌మిల్లులకు అమ్ముకునేవారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ.30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే తిరిగి రేషన్ డిపో డీలర్లు రూ.9 నుంచి రూ.10లకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం మిలర్ల వద్దకు కిలో రూ.15 నుంచి రూ.20 ధరతో చేరేవి. పాలిష్ అనంతరం ఇదే బియ్యాన్ని మాఫియా కిలో రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇక మిల్లర్లయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి బదులు సీఎంఆర్‌గా ఈ రేషన్ బియ్యాన్నే తిరిగి అప్పగించే సంస్కృతి కొనసాగేది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దురి్వనియోగం, డీలర్లు, మిల్లర్లకు సొమ్ము తెచ్చి పెట్టడం తప్ప ప్రయోజనం ఉండేది కాదు. వలంటీర్లతో కొంతమేర కట్టడి.. ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క క్లస్టర్‌కి 50 నుంచి 60 వరకు కుటుంబాలను కేటాయించి, వాటికొక వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో అప్పటి నుంచి గత అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. తొలుత బోగస్ కార్డుల బాగోతం గుట్టు రట్టయింది గతంలో 8,32,636 రేషన్‌కార్డులుంటే ఇప్పుడవి 8,16,412కు చేరాయి. అలాగే గతంలో 13,243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇప్పుడది 12,335మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ లెక్కన 16,224 కార్డులు తగ్గి 908 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయింది. దాదాపు 40 వేల యూనిట్లు కూడా తగ్గాయి. ఇవి కాక నవశకం సర్వేలో వేలాది బోగస్ కార్డులను గుర్తించినట్టు సమాచారం. ఫోర్టి ఫైడ్ రైస్‌తో మరింత అడ్డుకట్ట రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడేందుకు ప్రభుత్వం మిల్లర్లకు పంపిస్తోంది. ఇలా ఇచ్చిన ధాన్యంలో 67 శాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇక్కడే తేడా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇవ్వవల్సిన సీఎంఆర్‌లో ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసి కొంతమంది మిల్లర్లు తిరిగి ఇచ్చేవారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్‌కు విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. మిల్లర్లకు ఏ ధాన్యమైతే ఇస్తున్నారో అదే రకమైన బియ్యాన్ని మళ్లీ సీఎంఆర్ కింద ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం షరతు పెట్టింది. దానికి తోడు ఇకపై పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ‘బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని’ కలపనుంది. ఇలా చేసి ఫోరి్టఫైడ్ రైస్‌ను ఇకపై వలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనుండటంతో అవే బియ్యాన్ని ఒకవేళ ప్రజల నుంచి సేకరించి, సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తే దొరికిపోతారు. ఫోరి్టఫైడ్ రైస్ వలన మిక్సింగ్ చేశారా.. లేదా అన్నది తేలిపోనుంది. నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌కు నరసన్నపేట, పొందూరులలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే రేషన్ బియ్యంలో ఫోరి్టఫైడ్ రైస్ మిక్సింగ్ చేయనున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు రేషన్ బియ్యం ద్వారా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా, సీఎంఆర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రకం ధాన్యం ఇస్తే ఆ రకం పోలిన బియ్యం మిల్లర్లు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ యూనిట్లలో రేషన్ బియ్యంలో బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని మిక్సింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. – కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల సంస్థ -
పేదల బియ్యం బొక్కేస్తున్నారు..!
డీలర్లకు శఠగోపం పెడుతున్న ఎమ్మెల్‌ఎస్ పాయింట్ అధికారులు ఒక్కో బస్తాకు కేజీ చొప్పున బియ్యం మాయం నరసరావుపేట డివిజన్‌లోనే తూకం తేడాలు అధికం గతంలో అమ్మహస్తం పథకంలోనూ ఇదే తీరు మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు సాక్షి, గుంటూరు : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని గోడౌన్లలోనే కొందరు అధికారులు బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు చేరేలోపు బస్తాల్లో బియ్యం మాయమౌతున్నాయి. బస్తాలో బియ్యం ఎలా మాయమౌతున్నాయి.. ఎలుకలు, పందికొక్కులు ఏమైనా బొక్కేస్తున్నాయేమో అని అనుకుంటున్నారా.. అదేమీ కాదు కొందరు అవినీతి అధికారులు ధనార్జనే ధ్యేయంగా రేషన్ డీలర్‌కు సరఫరా చేసే బియ్యాన్ని బస్తాకు కేజీ చొప్పున నొక్కేస్తూ నెలనెలా రెండు లారీల బియ్యాన్ని మిగులుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా గోతంతో కలిపి 50.665 కేజీలు ఉండాల్సి ఉండగా, ఎమ్మెల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్‌కు చేరే సరికి దీని బరువు 49.500 కేజీలు మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి రెండు కేజీల వరకూ తగ్గుతుంది. ఇటీవల కొందరు డీలర్లు 48 కేజీలు వచ్చిన బస్తాలను గుర్తించి రిటన్ కూడా పంపారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతుంది. మిగిల్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు, మిల్లర్లకు చేరవేస్తూ లక్షలు గడిస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా ఉండే ఈ జాఢ్యం రానురానూ అనేక ప్రాంతాల్లోని ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు పాకింది. ముఖ్యంగా నరసరావుపేట డివిజన్లోని అనేక చోట్ల ఈ తరహా దోపిడీ జరుగుతూనే ఉంది. రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలు రాగానే వాటిని వెంటనే దిగుమతి చేసుకోవడం మినహా వారు కాటాలు వేసుకోకపోవడం అవినీతి అధికారులకు వరంగా మారింది. కొందరు రేషన్ డీలర్లు ఈ మోసాన్ని గుర్తించి ప్రశ్నిస్తే వారికి సరుకులు సక్రమంగా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నరసరావుపేట ఎమ్మెల్‌ఎస్ పాయింట్లో అమ్మహస్తం పథకం సరుకుల తూకాల్లో తేడాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక్కడ అదే పరిస్థితి మళ్లీ తిరిగి కొనసాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు.. కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై తూకంలో మిగిల్చిన బియ్యాన్ని అక్కడకు తరలిస్తూ వారితో లాలూచీ పడుతున్నారు. మిల్లర్లు ఇదే బియ్యాన్ని వేరే గోతాల్లోకి మార్చి తిరిగి పౌరసరఫరాలశాఖకు చేరుస్తున్నారు. ఈ విధంగా అధికారులు, మిల్లర్లు కూడబలుక్కుని అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఐదు నెలల క్రితం పల్నాడు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్‌ఎస్ పాయింట్ డీటీ సంతకం చేయాలంటే డబ్బు డిమాండ్ చేస్తున్నాడంటూ ఏసీబీని ఆశ్రయించి పట్టించారు. రేషన్ డీలర్లకు వ్యవహారం తెలిసినప్పటికీ కొన్ని చోట్ల ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల నుంచే బ్లాక్ మార్కెట్‌కు బియ్యాన్ని తరలించేందుకు ఒప్పుకోరేమోననే భయంతో వారుకూడా మిన్నకుంటున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో మిల్లర్లు సైతం నూకలు అధికంగా కలుపుతూ నాణ్యలేని బియ్యాన్ని ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్నంతా గమనిస్తే చివరకు నష్టపోతుంది మాత్రం పేద ప్రజలే అనే విషయం స్పష్టమౌతుంది. ఇప్పటికైనా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి తూకాల్లో జరుగుతున్న మోసాలు, మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు వ్యవహారాలను బట్టబయలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
దసరాకు కొత్త రేషన్ కార్డులు
-
ఇక ‘స్మార్ట్’గా రేషన్!
దసరాకు కొత్త రేషన్ కార్డులు ప్రత్యేక చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డుల పంపిణీ చిప్‌లో లబ్ధిదారుడి వివరాలు, కుటుంబ సభ్యుల వేలిముద్రలు కుటుంబ సభ్యుల్లో ఎవరు వెళ్లినా తీసుకోవచ్చు క్షణాల్లో సరుకుల విక్రయాలసమాచారం అధికారులకుతెల్ల కార్డులకు ఇతర సంక్షేమ పథకాలతో లంకె తొలగింపు హైదరాబాద్: పేదలకు అందించే చౌక ధరల సరుకులు పక్కదారి పట్టకుండా రాష్ర్ట ప్రభుత్వం ‘స్మార్ట్’గా ఆలోచిస్తోంది. రేషన్ అక్రమాలను అడ్డుకునే దిశగా సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతో కార్డుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయేలా కసరత్తు చేస్తోంది. రాష్ర్టంలోని కుటుంబాల సంఖ్య కన్నా రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పకడ్బందీ చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రస్తుతమున్న రేషన్ కార్డుల స్థానంలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డును జారీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు రాజముద్రతో కూడిన ఈ కొత్త కార్డులను దసరా పండుగ నుంచి అమలులోకి తేవడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆధార్ కార్డు కోసం ఇప్పటికే సేకరించిన కుటుంబ సభ్యుల వేలిముద్రలను.. ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు అనుసంధానం చేసి బోగస్ బెడదను వదిలించుకోవాలని యోచిస్తున్నారు. రాష్ర్టంలోని కుటుంబాలకంటే 20 లక్షలకుపైగా రేషన్ కార్డులు అధికంగా ఉండటంతో ఈ వ్యవస్థనే సమూలంగా మార్చాలని ప్రభుత్వం తాజా నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖలోని ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. బోగస్ కార్డుల కారణంగా వంద ల కోట్ల ప్రజాధనం దళారుల జేబుల్లోకి వెళ్తోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రేషన్ పంపిణీలో అవినీతిని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకోవడంతో.. దీన్ని అరికట్టడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డుల పంపిణీ వల్ల ప్రస్తుతమున్న వాటిలో దాదాపు 30 శాతం కార్డులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారికి అంత్యోదయ కార్డులు ఎందుకన్న అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రేషన్ కోసం జారీ చేసే స్మార్ట్ కార్డులతో ఇతర సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు కేవలం రేష న్ సరుకుల పంపిణీ, చిరునామా ధ్రువీకరణకు మాత్ర మే ఉపయోగపడేలా ఆదేశాలు ఇవ్వనుంది. ఆరోగ్యశ్రీ పథకం కోసమే అందరూ తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెల్ల కార్డులకు సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా చేయడం ద్వారా వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.