- ఎల్‌ఈడీ కాంట్రాక్ట్‌లో ‘నారాయణ’ తంత్రం
- కౌన్సిల్‌ను డమ్మీ చేసిన వైనం
- గప్‌చుప్‌గా కమిషనర్‌తో సంతకం
- నేడు స్టాండింగ్ కమిటీ ముందుకు..
విజయవాడ సెంట్రల్ : వీధి దీపాల్లో చీకటి ఒప్పందం కుదిరింది. ఎల్‌ఈడీ లైట్ల కాంట్రాక్టులో ప్రభుత్వం జరిపిన మంత్రాంగం వివాదాస్పదమైంది. నగరంలో 30వేల ఎల్‌ఈడీ లైట్లు వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ అక్రమంగా కట్టబెట్టారు. రూ.25కోట్ల పెట్టుబడితో వారు స్ట్రీట్‌లైట్లు ఏర్పాటుచేస్తే ఏడేళ్లలో రూ.48.14 కోట్లు తిరిగి చెల్లించాలన్నది ఒప్పందం. ఈ మేరకు ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 74ను జారీ చేసింది. నెలరోజుల కిందట కమిషనర్ జి.వీరపాండియన్‌ను మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హడావుడిగా తుళ్లూరు పిలిచి ఒప్పంద పత్రంపై సంతకం చేయించారు. శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆమోదానికి పెట్టారు. కాగా, కౌన్సిల్ దృష్టికి రాకుండా రూ.48.14 కోట్ల డీల్ ఓకే చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థానిక సంస్థల (కౌన్సిల్)పై సర్కార్ కర్రపెత్తనం ఏవిధంగా చేస్తోందో ఈ అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
కౌన్సిల్‌లో రికార్డు చేయలేదేం?
కౌన్సిల్‌కు తెలియకుండా కమిషనర్‌తో మంత్రి సంతకం చేయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేస్తే రూ.48.14 కాంట్రాక్ట్ ఢిల్లీ కంపెనీ వశమవుతుంది. నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే జీవోలను కౌన్సిల్‌లో రికార్డు చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాండింగ్ కమిటీ చర్చతో సరిపెట్టేద్దామని పాలకులు భావిస్తున్నారు. మంత్రి నారాయణ నుంచి వ చ్చిన ఒత్తిడి కారణంగానే ఈవిధంగా వ్యవహారం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
స్టాండింగ్ కమిటీదే ప్రధాన పాత్ర
వీధి దీపాల నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ 2008లో రియల్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. దీనికి సంబంధించి నెలకు రూ.26 లక్షలు చెల్లిస్తున్నారు. గత ఏడాదితో కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయింది. మంత్రి సి‘ఫార్సు’తో మరో ఆరు నెలలు పొడిగించారు. జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కావొస్తోంది. ఒప్పందం ప్రకారం రియల్ ఎనర్జీ సంస్థ వీధిదీపాలు, మెటీరియల్‌ను నగరపాలక సంస్థకు అప్పగించి వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేసే బాధ్యతను ఎనర్జీ ఎఫెషియెన్సీ సర్వీస్‌కు అప్పగిస్తూ కమిషనర్ ఒప్పంద పత్రంపై సంతకం చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రత్యేక అకౌంట్
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ రూ.24.50 కోట్ల పెట్టుబడితో నగరంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నెలకు రూ.57.31 లక్షల చొప్పున ఏడేళ్ల వ్యవధిలో రూ.48కోట్ల14 లక్షల 14వేల 500 నగరపాలక సంస్థ చెల్లించాలి. ఇందుకోసం ఎస్కరో ప్రత్యేక అకౌంట్‌ను తెరుస్తున్నారు. దీని ప్రకారం పన్నుల ద్వారా వసూలయ్యే సొమ్ములో రూ.57.31 లక్షలు ప్రతినెలా ఈ అకౌంట్‌లో జమ అవుతాయి. ఇంత తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కౌన్సిల్‌ను డమ్మీ చేసిన సర్కార్ తీరుపై స్టాండింగ్ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
చీకటి ఒప్పందం
Published Sat, May 23 2015 5:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement