
పలమనేరు: పలమనేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. త్వరలో కుప్పం రెవెన్యూ డివిజన్ అవుతుందని ప్రకటించింది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ప్రకటించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే ఇందుకు సంబంధించిన ఫైల్ సీసీఎల్‌ఏ, ఆర్థిక శాఖ వద్దకెళ్లింది. ఎన్నికలు, ఆపై ఉద్యమాలు, రాష్ట్ర విభజనతో ఈ అంశం పూర్తిగా తెరమరుగైంది. పలమనేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదికలో సైతం అన్నీ సబబేననే అప్పట్లో అధికారులు నివేదికలిచ్చారు. అయితే కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి అక్కడ ఎలాగైనా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థలం కూడా రిజర్వు చేశారు..
అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలమనేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పలమనేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదిక పంపాలని అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలొచ్చాయి. ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం కోసం పలమనేరులో ఇప్పటికే ప్రభుత్వం స్థలాన్ని రిజర్వు చేసిపెట్టింది. చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి పక్కనున్న కోర్టు, సీఎల్‌ఆర్‌సీ భవనాల మధ్యనున్న మూడెకరాల ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మించేందుకే రిజర్వు చేశారు.
పలమనేరుకో న్యాయమా?
రాష్ట్రానికి పాలనా పరంగా.. భౌగోళిక పరంగా ఇబ్బందులుండరాదనే ఉద్దేశంతో రాజధానిని అమరావతిలో పెట్టిన ముఖ్యమంత్రి పలమనేరులోనూ అవే నిబంధనలు పాటించాలికదా. కానీ ఇక్కడ మాత్రం కుప్పంలో పెట్టాలని వారి ప్రభుత్వం ఎలా చెబుతుంది. ఇది చాలా అన్యాయం. దీనిపై అభ్యంతరం తెలుపుతాం.– సునీల్‌కుమార్, ఎమ్మెల్యే, పూతలపట్టు
నేటి నుంచే పోరాటం
పలమనేరుకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయంపై నేటి నుంచే అన్ని ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ఆందోళనలు చేపడతాం. నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు.
– మిలటరీ సిద్ధయ్య,పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment