- రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న ఆర్జీయూకేటీ
- ఆందోళనలో ట్రిపుల్ ఐటీ తొలి బ్యాచ్ విద్యార్థులు
- సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలు దూరమవుతాయని ఆవేదన
నూజివీడు : పేద ఇంట పుట్టినా సాంకేతిక ఉన్నత విద్యను అందిపుచ్చుకున్నామన్న ఆనందం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆవిరవుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళన నానాటికీ రెట్టింపవుతోంది. ఆరేళ్ల కిందట ఏర్పాటుచేసిన ట్రిపుల్ ఐటీల్లో చేరిన తొలి బ్యాచ్‌కు చెందిన రెండు వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈ బ్యాచ్‌కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.5కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కోర్సు పూర్తయినా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐదేళ్ల బకాయిలు కూడా చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన తాము రూ.40 వేల నుంచి రూ.80వేల వరకు చెల్లించలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్టిఫికెట్ల ఇవ్వకపోతే క్యాంపస్ సెలక్షన్స్‌లో వచ్చిన ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
రూ.45వేల నుంచి రూ.84వేల వరకు భారం
ట్రిపుల్‌ఐటీలలో ఆరు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన వారు వివిధ కేటగిరీల ప్రకారం ఈ ఏడాది ఫీజుతో కలిపి రూ.45వేల నుంచి రూ.84వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ4 విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.40వేలు చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లిస్తోంది. ఈ మొత్తం ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఒక్కో విద్యార్థి ఆ 40వేల రూపాయలు, బకాయిలు కలిపి లెక్కిస్తే బీసీ విద్యార్థులు రూ.51,800, ఎస్సీ విద్యార్థులు రూ.45వేలు, ఓసీ విద్యార్థులు రూ.84వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి వారు 1,825 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వర్గానికి చెందిన 283 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వచ్చాయి. మిగిలిన 1,542 మందికి సంబంధించిన రూ.5కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం తాము చెల్లించలేమని విద్యార్థులు వాపోతున్నారు. ఏటా మే, జూన్ నెలల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసేవారు. ఈసారి మాత్రం ఆగస్టు మొదటి వారం పూర్తయినా నిధులు విడుదల చేయలేదు.
సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) వీసీ ఆర్‌వీ రాజకుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు తొలి నుంచి వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. మెంటార్ల విషయంలోనూ, ఐఐటీలకు వెళ్లి ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి లెక్చరర్లుగా నియమించడం, మెంటార్లను, లెక్చరర్లను వేర్వేరుగా చూడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో ఏర్పడిన ఆర్జీయూకేటీ ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటం తగదని మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేసి అనంతరం నిధుల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.మహేష్ కోరారు.