లక్ష్యం ‘నీరు’గారింది!
Published Mon, Dec 16 2013 7:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రచారమే తప్పిస్తే ఇందిర జలప్రభ పథకంలో పురోగతి లోపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు కల్పతరువని చెప్పుకోవడమే కానీ.. చేకూరుతున్న ప్రయోజనం నామమాత్రమే. పథకం చుట్టూ సమస్యలు ముసురుకోగా.. గట్టెక్కించేందుకు కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం దరిదాపులకు కూడా చేరుకోలేకపోతున్నారు. 2010-11లో మొదలైన ఈ పథకం లక్ష్యాలను మూడేళ్లలోపు సాధించాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. పథకం కింద 50 మండలాల్లోని 608 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 50131.29 ఎకరాల్లో బోర్లు వేసి విద్యుత్ కనెక్షన్‌తో పాటు మోటార్లు బిగించి సాగునీటి వసతి కల్పించాలనేది లక్ష్యం. ఈ భూముల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసి రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించాల్సి ఉంది.
మొత్తం రూ.104.39 కోట్ల ఖర్చుతో 4,531 బోర్లు వేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా నీటి యాజమాన్య సంస్థ, భూగర్భ జలశాఖ, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎంఐపీ తదితర శాఖలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉన్నా సమన్వయకం కొరవడింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా లక్షా్యాలను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ ముక్కుతూమూల్గుతుండటం పథకం పట్ల అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటి వరకు 34,240 ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తయింది. ఇందులో 1,626 బోర్లు వేసేందుకు జియాలజిస్ట్‌లు ప్రతిపాదించగా.. 1002 బోర్లు మాత్రమే వేశారు. ఇందులో 578 బోర్లు మాత్రమే సక్సెస్ కాగా.. విద్యుత్ అధికారులు 263 బోర్లకు మాత్రమే కనెక్షన్ ఇవ్వగలిగారు. మొత్తంగా అధికారుల లెక్కల ప్రకారం 2,490 ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. అయితే 669.79 ఎకరాల్లో మాత్రమే హార్టికల్చర్ కింద పండ్ల మొక్కలు నాటగలిగారు. పండ్ల మొక్కలకు డ్రిప్ సౌకర్యం కల్పించే ప్రక్రియ ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యం ఎక్కడ..:
ఇందిర జలప్రభ అమలులో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొంది. జియాలజిస్టుల కొరతతో భూగర్భ జలసర్వే ముందుకు సాగడం లేదు. ఏడుగురు జియాలజిస్టులు మాత్రమే ఈ సర్వే చేస్తున్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జూనియర్లే కావడం వల్ల పాయింట్లు గుర్తించినా ఫెయిల్యూర్ శాతమే ఎక్కువగా ఉంటోంది. బోర్లు వేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. 1,626 బోర్లు వేసేందుకు రెకమెండ్ చేస్తే 1002 బోర్లు మాత్రమే వేశారు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్ అధికారులు చేస్తున్న జాప్యం అంతా ఇంతా కాదు. తరచూ కలెక్టర్ విద్యుత్ అధికారులకు చీవాట్లు పెట్టినా ఫలితం లేకపోతోంది. 578 బోర్లు సక్సెస్ అయితే 263 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. డ్వామా అధికారులు 280 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేసినా వారి నుంని స్పందన లేకపోవడం గమనార్హం. ఈ కారణంగా వచ్చే ఏడాది మార్చిలోపు లక్ష్యంలో 20 శాతం కూడా సాధించడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మూడేళ్లలో రూ.17 కోట్లు ఖర్చు చేసి 2,490 ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించడం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది.
అవకతవకలకు కొదవ లేదు..: ఇందిర జలప్రభ అమలులో అవకతవకలు తక్కువేమీ కాదు. బోర్లు తవ్వకం మొదలుకొని, విద్యుత్ కనెక్షన్ వరకు అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోర్లు వేసిన తర్వాత ఎలాంటి కేసింగ్ పైపులు అమర్చాలనే విషయమై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే నాసిరకం పైపులు వేస్తూ నిధులు కాజేస్తున్నారు. ఈ పరిస్థితి ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి తదితర మండలాల్లో అధికంగా ఉంది. బోర్లు కూడా తక్కువ లోతులో వేసి ఎక్కువ లోతు వేసినట్లు రికార్డు చేస్తున్నట్లు సమాచారం. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వేసిన ఎస్టిమేట్లలోనూ అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement