రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోంది.
50 నుంచి 65 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల ఎత్తివేతకు రంగం సిద్ధం
తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వాటిపై దృష్టి
2015-16 విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం
కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోంది. ఉన్న హాస్టళ్లను అభివృద్ధి చేయకుండా తక్కువ విద్యార్థులు ఉన్నారనే సాకుతో ఎత్తి వేయడానికి పావులు కదుపుతోంది. తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను ఎత్తి వేయడానికి సంకల్పించింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 143 వసతి గృహాల్లో వంద హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా, 43 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ఎత్తివేయడానికి సంకల్పించింది.
ఆ మేరకు 50 నుంచి 65 లోపు విద్యార్థులుండి.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ శాఖ పరిధిలో మొత్తం 43 ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లలో కొనసాగుతుండగా, అందులో 17 హాస్టళ్లలో 50 నుంచి 65లోపు కంటే తక్కువగా విద్యార్థులున్నారు. మొత్తం 774 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ధ్రువీకరించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 60 హాస్టళ్లు ఉండగా, వాటిల్లో 4 హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నట్లు ధ్రువీకరించారు.
గురుకుల పాఠశాలల్లోకి తరలిస్తారట!
ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో తరగతిలో 10 మంది విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అక్కడ వసతులు ఉన్నాయా? లేవా? అనే వివరాలు కూడా సేకరించింది. గురుకుల పాఠశాలల్లో సీట్ల వివరాలను రాబట్టి 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆ ప్రకారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో తొలి దశలో 17 వసతి గృహాలను ఎత్తి వేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదా?
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలను ఎత్తివేసి సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఆయా విద్యార్థులను చేర్పించి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటే ఆ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించవచ్చుకదా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
వివరాలు అడిగారు..
ప్రైవేటు భవనాల్లో నడుస్తూండి.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం అడిగింది. అందుకు సంబంధించిన సమాచారం నివేదించాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం.
- పీఎస్‌ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, వైఎస్సార్ జిల్లా.