
మైనార్టీలకు ఇంగ్లిష్ గురుకుల విద్య!
♦ 120 గురుకుల పాఠశాలలు మంజూరు
♦ మొదటి విడతలో 70 పాఠశాలలు..
♦ మూడేళ్ల ఈ ప్రాజెక్టుకు రూ.1,200 కోట్ల కేటాయింపు
♦ తొలి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు
♦ 2016-17లో పాఠశాలలు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన మైనార్టీ వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత గురుకుల విద్య అందుబాటులో రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలను విద్యా పరంగా పోత్సహించేందుకు 120 మైనార్టీ రె సిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను మంజూరు చేసి మొదటి విడతగా 70 పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) కూడా ఏర్పాటైంది. దీన్ని మూడేళ్ల ప్రాజెక్టుగా తీసుకుని.. సొం త భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,200 కోట్లు వెచ్చించనున్నారు.
మొదటి విడతగా ఈసారి బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించారు. పాఠశాల నిర్వహణ కోసం బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన 1,960 పోస్టులు, పొరుగు సేవల కింద 280 పోస్టులు మంజూరయ్యాయి. రెగ్యులర్ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి ఏడాది పాఠశాలల నిర్వహణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు.
16,800 మంది విద్యార్థులకు ప్రవేశాలు
రాష్ట్రంలో తొలి విడతగా 2016-17 విద్యాసంవత్సరంలో 70 పాఠశాలలు ప్రారంభించి 16,800 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో 38 బాలుర, 32 బాలికల పాఠశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది అద్దె భవనాల్లో పాఠశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి 5, 6, 7 తరగతులలో మాత్రమే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ప్రతి పాఠశాలలో 240 చొప్పున ప్రతి తరగతిలో 80 మంది విద్యార్థులకు రెండే సెక్షన్లలో ప్రవేశం కల్పిస్తారు.
మొత్తం సీట్లలో 75 శాతం మైనార్టీ వర్గాలకు, 25 శాతం ఇతరులకు రిజర్వ్ చేసి ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశం పొం దిన ప్రతి విద్యార్థికి ఉచితంగా సుమారు రూ. 80 వేల విలువగల విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం గ్రామీణ ప్రాంతాలకు వార్షికాదాయం రూ.1.5 లక్షలోపు, పట్టణ ప్రాంతాలకు రూ. 2 లక్షలు మించని కుటుంబాల పిల్లలు అర్హులను నిర్ణయించారు. అర్హులైన విద్యార్ధుల నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి జూన్‌లో పాఠశాలలు ప్రారంభించేందుకు మైనార్టీ సం క్షేమ శాఖ అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. విద్యార్థుల ప్రవేశాల కోసం స్వచ్ఛంద సంస్థలు, ముస్లిం మత గురువులను భాగస్వాములుగా చేస్తున్నారు.
బాలికలకు పూర్తిగా భద్రత
షఫీ ఉల్లా, కార్యదర్శి, టీఎంఆర్‌ఈఐఎస్
బాలికలకు పూర్తిగా భద్రతతో కూడిన విద్య, బోధన, వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బాలికల కోసం ప్రత్యేకంగా 32 పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ టీచర్లను భర్తీ చేస్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా స్కూల్ భవనాలు, విద్యా బోధన ఉంటుంది.
ఇది సువర్ణ అవకాశం
సయ్యద్ బందగి బాషా రియాజ్ ఖాద్రీ, మొహిసిన్-ఏ-ఇన్సానియత్, హైదరాబాద్
మైనార్టీలకు ఇంగ్లిష్ మీడియం గురుకుల స్కూల్స్ వర ప్రసాదం లాంటివి. ఆంగ్ల మాధ్యమం లో ఉచిత విద్య, వసతి సువర్ణ అవకాశం, బాలికలకు కూడా పూర్తిగా భద్రతతో కూడిన బోధన, వసతి ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.