చిన్ని చిన్ని ఆశలకు ఎన్నాళ్లీ సంకెళ్లు?
చిన్ని చిన్ని ఆశలకు ఎన్నాళ్లీ సంకెళ్లు?
Published Thu, Jun 15 2017 3:33 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
మూడేళ్లైనా పీఆర్సీ బకాయిలివ్వని సర్కారుపై ప్రభుత్వ ఉద్యోగుల మండిపాటు
- బకాయిలు వచ్చేస్తే పిల్లలను మంచి కాలేజీలోకి మార్చాలని ఆశ.. కొత్త సామాన్లు కొనుక్కోవాలని కోరిక
- కానీ మూడేళ్లుగా ఈ ఆశలన్నీ వాయిదాలే
- పొరుగు రాష్ట్రం తెలంగాణ పీఆర్సీ బకాయిలకు ఆదేశాలిచ్చినా రాష్ట్ర సర్కారులో చలనం లేదు
- రాష్ట్రం విడిపోయినప్పుడే పీఆర్సీ ఇచ్చేసి ఉంటే రెవెన్యూ లోటుగా కేంద్రం ఇచ్చేదంటున్న అధికారులు
- రెండు డీఏలులేవు.. నగదు రహిత వైద్యమూ లేదు
- ఇవన్నీ అడుగుతారని ముందుగానే ఉద్యోగులపై కస్సుబుస్సుమంటున్న సీఎం
వెంకట్రాయుడు నిజాయితీగల ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. తన పిల్లల్ని మంచి కాలేజీలోకి మార్చాలని, ఉన్నత చదువులు చదివించాలని మూడేళ్లుగా అనుకుంటున్నాడు. ఏళ్లు గడుస్తున్నాయి, చదువులు సాదాసీదాగా సాగిపోతున్నాయి కానీ ఉన్నత చదవుల ఆశ మాత్రం వాయిదా పడుతోంది. అలాగే ఇంట్లో పాతబడిన ఫ్రిజ్జు, గిర్రుమంటున్న గీజరు, మూలనపడిన మిక్సీలన్నీ మార్చేసి కొత్తవి కొనేస్తున్నానని ఆయన మూడేళ్ల నుంచీ భార్యకు చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికీ అది నెరవేరకపోవడంతో భార్య నెలకోసారి అలుగుతూనే ఉంది!
ఇలాంటి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకోవడానికి కూడా ఇన్ని సంవత్సరాలు కావాలా? అంటే.. ఆయన సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నాడు! వీటికీ సీఎంకు లింకేంటి అంటారా అదే పీఆర్సీ. మూడేళ్లుగా తన కలల్ని కట్టేసుకొని ఆ పీఆర్సీ బకాయిల కోసం ఆయన చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. తమను కనీసం పట్టించుకోకుండా మూడేళ్లుగా పస్తులుంచడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు పక్క రాష్ట్రం తెలంగాణ పీఆర్సీ బకాయిలను చెల్లించడానికి ఎప్పుడో ఆదేశాలు జారీచేసేసినా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ ఆలోచన కూడా చేయకపోవడంతో ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈవెంట్ల పేరుతో కోట్లకు కోట్లు వృథా ఖర్చు చేయడానికి డబ్బులుంటాయనిగాని మాకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలివ్వడానికి మాత్రం చేయిరాదా అంటూ మండిపడుతున్నారు.
సాక్షి, అమరావతి: పదో వేతన సవరణ కమిషన్(పీఆర్‌సీ) బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లు గడిచినా నిరీక్షణ ఫలించక తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం, ఉద్యోగ సంఘాల నేతలు సైతం పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా పీఆర్సీ బకాయిలు, కరువు భత్యాలు(డీఏ) ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండడాన్ని తప్పు పడుతున్నారు.
హంగులు, ఆర్భాటాలకైతే డబ్బుందట!
పెట్టుబడుల సదస్సులు, శంకుస్థాపనలు, ఉత్సవాలు, విదేశీ పర్యటనలు వంటి పైసా ప్రయోజనం లేని పనులకు రూ.వందల కోట్లు ధారపోస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు, డీఏల దగ్గరకు వచ్చేసరికి బీద అరుపులు అరుస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అనవసర హంగులు, ప్రచార ఆర్భాటాలకు డబ్బు ఉంటుందని గానీ, మాకు చట్టబద్ధంగా రావాల్సింది ఇవ్వడానికి నిధులుండవా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక సంవత్సరంలోనే ఈ బకాయిలను ఇచ్చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెవెన్యూ లోటుగా పరిగణించి భర్తీ చేసేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే బకాయిలను చెల్లించకపోవడంతో రెవెన్యూ లోటు కింద భర్తీ చేయబోమని కేంద్రం తేల్చిచెప్పిందని పేర్కొంటున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల స్వయంగా ఈ విషయం చెప్పారని గుర్తుచేస్తున్నాయి.
రెండు డీఏలకు సర్కారు ఎసరు?
రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31వ తేదీ వరకు గల కాలానికి ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,325 కోట్ల పీఆర్సీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలోనూ వాయిదాల రూపంలో పీఆర్సీ బకాయిలను ఇవ్వాలని, అలా చేస్తే ప్రతి ఉద్యోగికి నెలకు రూ.నాలుగైదు వేలు వస్తాయని ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు గత ఏడాదికి చెందిన జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏను ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మరో డీఏ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. గత ఏడాదికి చెందిన డీఏనే ఇంకా ఇవ్వనందున ఈ ఏడాది డీఏ ఎప్పుడు ఇస్తారో తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలపరిమితి మరో ఏడాదే
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ బకాయిలను వాయిదాల రూపంలో చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కఠినంగా మారిందని అంటున్నారు. ఏపీలోనూ బకాయిలను అడుగుతారనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇటీవల ఉద్యోగులు, అధికారులపై చిర్రుబుర్రులాడుతున్నారని, సరిగ్గా పనిచేయడం లేదంటూ నిందలు వేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదో పీఆర్సీ కాలపరిమితి 2018 జూలైతో ముగియనుంది. అప్పటి నుంచి కొత్త పీఆర్సీ వేయాల్సి ఉంటుంది. అయినా పదో పీఆర్సీకి సంబంధించిన జీవోలు ఇంకా విడుదల కాలేదని సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో అంటకాగుతున్నారని, తమ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగుల బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
కాగితాలపైనే నగదు రహిత వైద్యం
రాష్ట్రంలో నగదు రహిత వైద్యం కాగితాలకే పరిమితమైందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. తాము ప్రతినెలా ఠంచనుగా ప్రీమియం చెల్లిస్తున్నా నగదు రహిత వైద్యం అందడం ఎక్కడా లేదని పేర్కొంటున్నారు. వైద్యం కోసం ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వెళితే తొలుత డబ్బులు కట్టించుకుంటున్నారని, తరువాత రీయింబర్స్‌మెంట్ చేసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Advertisement