ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. ఎవరు అడ్డుకోవాలని చూసినా.. పట్టిసీమ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరుతామని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గొంతు పెద్దది చేసి మరీ చెప్పారు. కానీ అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా గుడ్డిగా ముందుకెళ్తూ.. విపక్షం నిర్మాణాత్మకంగా చెబుతున్న అభ్యంతరాలనూ తోసిపుచ్చుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలి.
- పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను పరిమితం చేయడానికి కావాలని నిబంధనలు తయారుచేయలేదా?
- ప్రాజెక్టు పని ఏడాదిలోనే పూర్తిచేయాలని టెండర్ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. కానీ బోనస్ అంశం మీద మాత్రం ఏమీ చెప్పలేదు.
- టెండరు డాక్యుమెంట్ ప్రకారం ఏడాదిలోపే పని పూర్తిచేయాలన్నప్పుడు అందులో లేని బోనస్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది?
- టెండర్లను కేవలం 5 శాతం ఎక్సెస్ వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ 21.9 శాతం ఎక్సెస్కు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దాంతో మిగిలిన 16.9 శాతం మొత్తాన్ని టెండరు బోనస్ రూపంలో కాంట్రాక్టరుకు కట్టబెడుతున్నారు. ఇదంతా పెద్ద స్కాం.
- పట్టిసీమ ప్రాజెక్టునుంచి ఎత్తిపోసే నీటిని ఎక్కడ నిల్వచేస్తారు?
- ప్రకాశం బ్యారేజి సామర్థ్యం 3 టీఎంసీలు మాత్రమే. అప్పుడు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వచేస్తారు?
- నిల్వ సమస్య పరిష్కారం కోసమే అసలు పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించారు కదా?
గోదావరి నదీ జలాల వివాదం ట్రిబ్యునల్లోని రెండో అధ్యాయంలో పోలవరం ప్రాజెక్టు కింద ఈ అంశాలున్నాయి...
- క్లాజ్ 7ఇ: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతి క్లియర్ చేసిన రోజు నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందులో వాస్తవంగా ఎంత నీటిని మళ్లిస్తున్నారనే అంశంతో సంబంధం లేదు.
- క్లాజ్ 7ఎఫ్: ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం వల్ల ఆ మొత్తం 80 టీఎంసీలు దాటితే, ఆ దాటిన మొత్తాన్ని కూడా మూడు రాష్ట్రాలు ఒకే నిష్పత్తిలో పంచుకోవాలి
- అందువల్ల, పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా మనం మహారాష్ట్ర, కర్ణాటకలకు మరింత ఎక్కువ నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
- రాయలసీమకు నీరు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మరి దాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు?
- ఒకవేళ ప్రభుత్వం రాయలసీమకు నీరు ఇవ్వాలనుకున్నా.. పోతిరెడ్డిపాడు దిగువన రిజర్వాయర్లు, కెనాల్ వ్యవస్థ పూర్తి చేయకుండా ఎలా ఇస్తారు?
- పోతిరెడ్డిపాడును పూర్తిచేయడానికి రూ. 2600 కోట్లు అవసరం అవుతాయి. మీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం కేవలం రూ. 169 కోట్లే. మరో రూ. 1100 కోట్లు అవసరం అవుతాయి. ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టుకు మీరు కేవలం రూ. 200 కోట్లే కేటాయించారు. మరి అలాంటప్పుడు రాయలసీమకు మీరు ఎలా నీళ్లు ఎలా ఇవ్వగలరు?
ప్రజలను మోసగించడానికి మరో రుణమాఫీ పథకంలాగే దీన్నీ తయారుచేస్తారా?