కల్లూరు, న్యూస్‌లైన్: తుపానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామంలో తడిసిన పత్తి చేలను ఆయన మంగళవారం పరిశీలించారు. బాధిత రైతులనుద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ.. రైతుల ఆరుగాలం శ్రమంతా నీళ్లపాలయిందని, కనీసంగా పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను కారణంగా జిల్లాలో పత్తితోపాటు వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.
కౌలు రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా, రంగు మారిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బాధిత రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో రాజన్న రాజ్యం వస్తుందని, రైతాంగ కష్టాలన్నీ తీరుతాయని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమసన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, కల్లూరు మండల కన్వీనర్ వైకంఠి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టంపై తప్పుడు నివేదికలు
పెనుబల్లి: పంట నష్టంపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పెనుబల్లి మండలంలోని గౌరారం తదితర గ్రామాలలో తుపానుతో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడుతూ.. పంట నష్టంపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ దొంగచాటు ఆదేశాలతో అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధిత రైతులందరికీ నిష్పక్షపాతంగా ప్రభుత్వ సాయమందేలా చూడాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెనుబల్లి మండల కన్వీనర్ జె.నరసింహారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చీకటి పెద్ద నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన రైతు కుటుంబానికి పరామర్శ
వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెం గ్రామ రైతు బొప్పిశెట్టి చెన్నారావు కుటుంబీకులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. చెన్నారావు కుమారుడు వరప్రసాద్ నుంచి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తోడుగా ఉంటుందని చెప్పా రు. ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. అంతకుముందు, తాళ్ళపెంటలో పార్టీ నాయకుడు మరకాల అనంతరెడ్డిని, పెనుబల్లిలో సీనియర్ నాయకుడు కోటగిరి శ్రీనివాసరావును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
సర్వే చేయకపోవడం బాధాకరం
సత్తుపల్లి: తుపానుతో దెబ్బతిన్న పంటలను అధికారులు ఇప్పటివరకు సర్వే చేయకపోవడం విచారకరమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వేంసూరు మండలంలోని కందుకూరులో తడిసి మొలకెత్తిన పత్తిని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రావి సత్యనారాయణ, కందుకూరు సర్పంచ్ కోటమర్తి ముత్యం, ఉప సర్పంచ్ గొర్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తుపాను బాధిత రైతులను.. ప్రభుత్వం ఆదుకోవాలి
Published Wed, Oct 30 2013 4:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement