Pilin Toofan
-
సర్వే పూర్తై తర్వాతే నివేదిక..
కొణిజర్ల, న్యూస్‌లైన్: అల్పపీడనం, పై-లీన్ తుపాన్ల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. మంగళవారం ఆయన కొణిజర్ల, వైరా మండలాల్లో తడిచిన పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. ముందుగా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మొలకలు వచ్చిన పత్తి, కుళ్లిన కాయలను ఆయనకు చూపించారు. అధికారులు రోడ్ల వెంట ఉన్న పొలాలే చూపిస్తున్నారని, గ్రామాల్లో ఇంత కంటే దారుణంగా పంటలు ఎండిపోయాయని, మారుమూల గ్రామాలకు వచ్చి పరిశీలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం పంట నష్టం, దిగుబడుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగారు. ఆ తర్వాత వైరా మండలం గొల్లపూడి శివారులోని పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. వైరా మండలంలో ఒక్కసారి కూడా పత్తి తీయలేదని, పత్తి రైతులు దారుణంగా నష్టపోయారని, పత్తి మొక్కలు వచ్చాయని, తీసిన పత్తి కూలీల వేతనాలకే సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం పంట నష్టం సర్వే పూర్తయిన తర్వాతే పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతానికి పైన నష్టం జరిగితేనే పంట నష్టం వర్తిస్తుందన్నారు. అయితే ఈఏడాది కొద్దిగా సడలింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నారు. నాలుగైదు రోజుల్లో పంట నష్టం అంచనాలు తయారు చేయాలని వ్యవసాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పంట నష్టం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అధికంగా పత్తి రైతులు నష్టపోయారని తెలిపారు. వరి, మిర్చి, మొక్కజొన్న కొద్దిగా దెబ్బతిన్నాయన్నారు. సాధారణంకంటే అధికంగా వర్షం పడటంతో పంటలు బాగాా దెబ్బతిన్నాయన్నారు. గతంలో జల్, నీలమ్ తుపాన్ వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందించలేదని రైతులు ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల రూ. 3 కోట్ల మేర పంట నష్టం చెక్కుల పంపిణీ చేయలేదని అన్నారు. వాటిని సాధ్యమైనంత త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. సీసీఐని కూడా వారం రోజుల్లో రంగంలోకి దింపి తడిచిన పత్తిని సాధ్యమైనంత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట జేడీఏ భాస్కరరావు, ఆర్డీఓ దాసరి సంజీవరెడ్డి, డాట్ శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్‌కుమార్, ఉద్యానవన శాఖ ఏడీఏలు జె మరియన్న, కె సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ మధిర ఏడీఏ వి బాబూరావు, కొణిజర్ల, వైరా తహశీల్దార్లు టి శ్రీనివాస్, జి శ్రీలత, కొణిజర్ల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓలు డి అరుణకుమారి, బీ నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తుపాను బాధిత రైతులను.. ప్రభుత్వం ఆదుకోవాలి
కల్లూరు, న్యూస్‌లైన్: తుపానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామంలో తడిసిన పత్తి చేలను ఆయన మంగళవారం పరిశీలించారు. బాధిత రైతులనుద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ.. రైతుల ఆరుగాలం శ్రమంతా నీళ్లపాలయిందని, కనీసంగా పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను కారణంగా జిల్లాలో పత్తితోపాటు వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కౌలు రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా, రంగు మారిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బాధిత రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో రాజన్న రాజ్యం వస్తుందని, రైతాంగ కష్టాలన్నీ తీరుతాయని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమసన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, కల్లూరు మండల కన్వీనర్ వైకంఠి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పంట నష్టంపై తప్పుడు నివేదికలు పెనుబల్లి: పంట నష్టంపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పెనుబల్లి మండలంలోని గౌరారం తదితర గ్రామాలలో తుపానుతో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడుతూ.. పంట నష్టంపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ దొంగచాటు ఆదేశాలతో అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధిత రైతులందరికీ నిష్పక్షపాతంగా ప్రభుత్వ సాయమందేలా చూడాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెనుబల్లి మండల కన్వీనర్ జె.నరసింహారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చీకటి పెద్ద నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన రైతు కుటుంబానికి పరామర్శ వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెం గ్రామ రైతు బొప్పిశెట్టి చెన్నారావు కుటుంబీకులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. చెన్నారావు కుమారుడు వరప్రసాద్ నుంచి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తోడుగా ఉంటుందని చెప్పా రు. ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. అంతకుముందు, తాళ్ళపెంటలో పార్టీ నాయకుడు మరకాల అనంతరెడ్డిని, పెనుబల్లిలో సీనియర్ నాయకుడు కోటగిరి శ్రీనివాసరావును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సర్వే చేయకపోవడం బాధాకరం సత్తుపల్లి: తుపానుతో దెబ్బతిన్న పంటలను అధికారులు ఇప్పటివరకు సర్వే చేయకపోవడం విచారకరమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వేంసూరు మండలంలోని కందుకూరులో తడిసి మొలకెత్తిన పత్తిని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రావి సత్యనారాయణ, కందుకూరు సర్పంచ్ కోటమర్తి ముత్యం, ఉప సర్పంచ్ గొర్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
తుడిచిపెట్టిన వాయుగుండం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగానే వాయుగుండం రూపంలో జిల్లాకు ముప్పు వచ్చి పడింది. కుండపోతగా వర్షాన్ని కురిపించింది. ఊళ్లు చెరువులన్నీ ఏకమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరద ఉధృతికి ప్రాణాలు గాలిలో కలిశాయి. పొలాలు కనుమరుగయ్యాయి. రైతు గుండె చెరువైంది. మూడు రోజుల్లో వాయుగుండం తుడిచిపెట్టింది. దానికి చెల్లించిన మూల్యం అక్షరాలా రూ. 515 కోట్లు. వ్యవసాయాన్ని పూర్తిగా పిప్పిచేసింది. ఆక్వా రంగాన్నీ కోలుకోనీయకుండా చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.ఆయన ఎలాంటి ప్యాకేజీ అందిస్తారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు ఈ నెల 24వ తేదీ వాయుగుండం జిల్లాలోని అనేక ప్రాంతాలను తుడిచిపెట్టినంత పనిచేసింది. రికార్డు స్థాయిలో వర్షాలను కురిపించి ంది. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. 118 కోట్ల రూపాయల మేర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఆ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆక్వా రంగాన్ని కోలుకోనీయకుండా దెబ్బతీసింది. 6 కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లింది. ఉద్యానశాఖకు 2 కోట్ల 70 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తేల్చారు. భారీ వర్షాల కారణంగా 607 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 681 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1991 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 17 వేల ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. భారీ వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మునిసిపల్ ఇలా ఒకటని కాకుండా అన్ని రోడ్లపై వాయుగుండం ప్రభావం చూపింది. చెరువులకు గండ్లు పడ్డాయి. కల్వర్టులు కొట్టుకు పోయాయి. వచ్చారు.. వెళ్లారు జిల్లాలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం ఇద్దరు మంత్రులు జిల్లాలో పర్యటించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శైలజానాథ్ ఒంగోలు చేరుకొని శివారు కాలనీల్లో కొన్ని కుటుంబాలకు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో కూర్చుని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి రాక కోసం ఎదురు చూశారు. రఘువీరారెడ్డి రావడం ఆలస్యం కావడంతో ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని అధికారులతో శైలజానాథ్ సమీక్షించారు. రాత్రికి ఒంగోలు చేరుకున్న రఘువీరారెడ్డి మొక్కుబడిగా అధికారులతో మాట్లాడారు. సీపీఓ కాన్ఫరెన్స్ హాలు వద్ద ఏర్పాటు చేసిన వాయుగుండం తీవ్రత ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి వెనుదిరిగారు. ఆ ఇద్దరు మంత్రులు పేరుకు జిల్లాకు వచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో పంట పొలాలను, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించకుండానే వెనుదిరగడం విమర్శలకు తావిచ్చింది. -
పై-లీన్ పైపైనే..!
= జిల్లాపై అంతగా ప్రభావం చూపని తుపాను = ముందుకొచ్చిన సముద్రం = తీరం కోత, నేలకూలిన చెట్లు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం దాదాపు తొలగిపోయింది. ప్రళయం సృష్టిస్తుందనుకున్న ఈ తుపాను ముప్పు తప్పింది. శనివా రం సాయంత్రం వరకూ కంటిమీద కునుకులేకుండా చేసిన పై-లీన్ ప్రశాం తంగా తీరం దాటింది. ఫలితంగా అటు ప్రజానీకం, ఇటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో మూడు రోజులుగా అంతా అప్రమత్తమయ్యారు. తీర, లోతట్టు ప్రాం తాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అందుకు తగ్గట్టుగానే సముద్రం కూడా ఉధృతంగా ఎగసి పడుతూ అలజడి రేపింది. ఉపద్రవా న్ని ముంచుకొస్తుందన్నంత హడావుడిచేస్తూ కెరటాలు హద్దులు దాటి రోడ్లెక్కాయి. తీరం లో ఉన్న పలుచోట్ల ఇళ్లలోకి చొరబడ్డాయి. కొన్ని ఇళ్లను ధ్వంసం చేశాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చి విరుచుకుపడ్డంతో కెరటాలు నాలుగు మీటర్లకు పైగా ఎగసిపడ్డాయి. రక్షణ గోడలు కూలిపోయాయి. వాటి ధాటికి బీచ్ రోడ్డుసైతం దెబ్బతింది. రుషికొండ, అప్పుఘర్ పరిసరాల్లో మరీ భయంగా మారింది. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం, జాలారీపేట, దిబ్బపాలెం గ్రామాల మత్స్యకారులు ప్రాణ భయంతో కాలం గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం భయంభయంగా మారి కెరటాలు ఎగసి పడ్డంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కెరటాల తాకిడికి తీరంలో ఇసుకలో వలలు కూరుకుపోయాయి. ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెం, తిక్కవానిపాలెం, జాలారీపేట గ్రామాలకు తుపాను ముప్పు తీవ్రంగా ఉండడంతో ఇక్కడున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. కాని తుపాను ముప్పు తొలగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. భీమునిపట్నం మండలంలో అన్నవరం, నాగమయ్యపాలెంలలో సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో ఒడ్డున ఉన్న సరుగుడు తోటలు కోతకు గురయ్యాయి. అన్నవరం, దీవిస్ జట్టీ, పెదనాగమయ్యపాలెం, చిన్న నాగమయ్యపాలెంలోనూ భయానక వాతావరణం నెలకొంది. విశాఖలో రుషికొండ, జోడుగుళ్లుపాలెం తీరం వద్ద 12 మీటర్లు ముందుకు సముద్రం వచ్చింది. రుషికొండ తీరంలో సందర్శకులు నిత్యం కూర్చునే ప్రదేశం అంతా నీటితో నిండిపోయింది. దీనికి ఆనుకుని ఉన్న ఓ ప్రైవేటు హోటల్ వెనుక భాగంలో ఒడ్డు వరకు కెరటాలు తాకాయి. అలల తాకిడి తట్టుకునేందుకు అడ్డంగా వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయాయి. అచ్యుతాపురం మండలంలో పూడిమడక , వాడపాలెం తీరాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. కెరటాలు 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. పూడిమడకలో తీరం వెంబడి తాళ్లతో కట్టిన పడవలు అలల తాకిడికి ఛిద్రమయ్యాయి. పడవలు ఢీకొని పాడైపోయాయి. మరోపక్క మత్స్యకారులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ససేమిరా అనడంతో జిల్లా అధికారులు వీరిని బలవంతంగా తరలించాలని నిర్ణయించారు. భీమిలి తీరంలో బోయివీధి ప్రాంతంలో రక్షణగోడ దెబ్బతినగా, తాజా అలల ధాటికి ఉన్న గోడ పూర్తిగా పడిపోవడంతో అలలు రోడ్డుపైకి వచ్చాయి. మొత్తమ్మీద మునుపెన్నడూ లేనివిధంగా అంతా అప్రమత్తమయినా చివరకు చిరు చినుకులకే పరిమితమైన పై-లిన్ తుపాను కనీసం చెప్పుకోదగిన వర్షం కూడా కురిపించకుండానే తప్పుకుంది. అందరినీ హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేసింది.