ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగానే వాయుగుండం రూపంలో జిల్లాకు ముప్పు వచ్చి పడింది. కుండపోతగా వర్షాన్ని కురిపించింది. ఊళ్లు చెరువులన్నీ ఏకమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరద ఉధృతికి ప్రాణాలు గాలిలో కలిశాయి. పొలాలు కనుమరుగయ్యాయి. రైతు గుండె చెరువైంది. మూడు రోజుల్లో వాయుగుండం తుడిచిపెట్టింది. దానికి చెల్లించిన మూల్యం అక్షరాలా రూ. 515 కోట్లు. వ్యవసాయాన్ని పూర్తిగా పిప్పిచేసింది. ఆక్వా రంగాన్నీ కోలుకోనీయకుండా చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.ఆయన ఎలాంటి ప్యాకేజీ అందిస్తారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు
ఈ నెల 24వ తేదీ వాయుగుండం జిల్లాలోని అనేక ప్రాంతాలను తుడిచిపెట్టినంత పనిచేసింది. రికార్డు స్థాయిలో వర్షాలను కురిపించి ంది. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. 118 కోట్ల రూపాయల మేర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఆ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆక్వా రంగాన్ని కోలుకోనీయకుండా దెబ్బతీసింది. 6 కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లింది. ఉద్యానశాఖకు 2 కోట్ల 70 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తేల్చారు. భారీ వర్షాల కారణంగా 607 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 681 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1991 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 17 వేల ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. భారీ వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్ ఇలా ఒకటని కాకుండా అన్ని రోడ్లపై వాయుగుండం ప్రభావం చూపింది. చెరువులకు గండ్లు పడ్డాయి. కల్వర్టులు కొట్టుకు పోయాయి.
వచ్చారు.. వెళ్లారు
జిల్లాలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం ఇద్దరు మంత్రులు జిల్లాలో పర్యటించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శైలజానాథ్ ఒంగోలు చేరుకొని శివారు కాలనీల్లో కొన్ని కుటుంబాలకు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో కూర్చుని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి రాక కోసం ఎదురు చూశారు. రఘువీరారెడ్డి రావడం ఆలస్యం కావడంతో ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని అధికారులతో శైలజానాథ్ సమీక్షించారు. రాత్రికి ఒంగోలు చేరుకున్న రఘువీరారెడ్డి మొక్కుబడిగా అధికారులతో మాట్లాడారు. సీపీఓ కాన్ఫరెన్స్ హాలు వద్ద ఏర్పాటు చేసిన వాయుగుండం తీవ్రత ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి వెనుదిరిగారు. ఆ ఇద్దరు మంత్రులు పేరుకు జిల్లాకు వచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో పంట పొలాలను, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించకుండానే వెనుదిరగడం విమర్శలకు తావిచ్చింది.
తుడిచిపెట్టిన వాయుగుండం
Published Mon, Oct 28 2013 6:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement