= జిల్లాపై అంతగా ప్రభావం చూపని తుపాను
= ముందుకొచ్చిన సముద్రం
= తీరం కోత, నేలకూలిన చెట్లు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం దాదాపు తొలగిపోయింది. ప్రళయం సృష్టిస్తుందనుకున్న ఈ తుపాను ముప్పు తప్పింది. శనివా రం సాయంత్రం వరకూ కంటిమీద కునుకులేకుండా చేసిన పై-లీన్ ప్రశాం తంగా తీరం దాటింది. ఫలితంగా అటు ప్రజానీకం, ఇటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో మూడు రోజులుగా అంతా అప్రమత్తమయ్యారు. తీర, లోతట్టు ప్రాం తాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
అందుకు తగ్గట్టుగానే సముద్రం కూడా ఉధృతంగా ఎగసి పడుతూ అలజడి రేపింది. ఉపద్రవా న్ని ముంచుకొస్తుందన్నంత హడావుడిచేస్తూ కెరటాలు హద్దులు దాటి రోడ్లెక్కాయి. తీరం లో ఉన్న పలుచోట్ల ఇళ్లలోకి చొరబడ్డాయి. కొన్ని ఇళ్లను ధ్వంసం చేశాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చి విరుచుకుపడ్డంతో కెరటాలు నాలుగు మీటర్లకు పైగా ఎగసిపడ్డాయి. రక్షణ గోడలు కూలిపోయాయి. వాటి ధాటికి బీచ్ రోడ్డుసైతం దెబ్బతింది. రుషికొండ, అప్పుఘర్ పరిసరాల్లో మరీ భయంగా మారింది. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం, జాలారీపేట, దిబ్బపాలెం గ్రామాల మత్స్యకారులు ప్రాణ భయంతో కాలం గడిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం భయంభయంగా మారి కెరటాలు ఎగసి పడ్డంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కెరటాల తాకిడికి తీరంలో ఇసుకలో వలలు కూరుకుపోయాయి. ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెం, తిక్కవానిపాలెం, జాలారీపేట గ్రామాలకు తుపాను ముప్పు తీవ్రంగా ఉండడంతో ఇక్కడున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. కాని తుపాను ముప్పు తొలగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
భీమునిపట్నం మండలంలో అన్నవరం, నాగమయ్యపాలెంలలో సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో ఒడ్డున ఉన్న సరుగుడు తోటలు కోతకు గురయ్యాయి. అన్నవరం, దీవిస్ జట్టీ, పెదనాగమయ్యపాలెం, చిన్న నాగమయ్యపాలెంలోనూ భయానక వాతావరణం నెలకొంది. విశాఖలో రుషికొండ, జోడుగుళ్లుపాలెం తీరం వద్ద 12 మీటర్లు ముందుకు సముద్రం వచ్చింది. రుషికొండ తీరంలో సందర్శకులు నిత్యం కూర్చునే ప్రదేశం అంతా నీటితో నిండిపోయింది. దీనికి ఆనుకుని ఉన్న ఓ ప్రైవేటు హోటల్ వెనుక భాగంలో ఒడ్డు వరకు కెరటాలు తాకాయి.
అలల తాకిడి తట్టుకునేందుకు అడ్డంగా వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయాయి. అచ్యుతాపురం మండలంలో పూడిమడక , వాడపాలెం తీరాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. కెరటాలు 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. పూడిమడకలో తీరం వెంబడి తాళ్లతో కట్టిన పడవలు అలల తాకిడికి ఛిద్రమయ్యాయి. పడవలు ఢీకొని పాడైపోయాయి. మరోపక్క మత్స్యకారులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ససేమిరా అనడంతో జిల్లా అధికారులు వీరిని బలవంతంగా తరలించాలని నిర్ణయించారు.
భీమిలి తీరంలో బోయివీధి ప్రాంతంలో రక్షణగోడ దెబ్బతినగా, తాజా అలల ధాటికి ఉన్న గోడ పూర్తిగా పడిపోవడంతో అలలు రోడ్డుపైకి వచ్చాయి. మొత్తమ్మీద మునుపెన్నడూ లేనివిధంగా అంతా అప్రమత్తమయినా చివరకు చిరు చినుకులకే పరిమితమైన పై-లిన్ తుపాను కనీసం చెప్పుకోదగిన వర్షం కూడా కురిపించకుండానే తప్పుకుంది. అందరినీ హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేసింది.