కొణిజర్ల, న్యూస్‌లైన్: అల్పపీడనం, పై-లీన్ తుపాన్‌ల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. మంగళవారం ఆయన కొణిజర్ల, వైరా మండలాల్లో తడిచిన పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. ముందుగా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మొలకలు వచ్చిన పత్తి, కుళ్లిన కాయలను ఆయనకు చూపించారు. అధికారులు రోడ్ల వెంట ఉన్న పొలాలే చూపిస్తున్నారని, గ్రామాల్లో ఇంత కంటే దారుణంగా పంటలు ఎండిపోయాయని, మారుమూల గ్రామాలకు వచ్చి పరిశీలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం పంట నష్టం, దిగుబడుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగారు.
ఆ తర్వాత వైరా మండలం గొల్లపూడి శివారులోని పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. వైరా మండలంలో ఒక్కసారి కూడా పత్తి తీయలేదని, పత్తి రైతులు దారుణంగా నష్టపోయారని, పత్తి మొక్కలు వచ్చాయని, తీసిన పత్తి కూలీల వేతనాలకే సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం పంట నష్టం సర్వే పూర్తయిన తర్వాతే పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతానికి పైన నష్టం జరిగితేనే పంట నష్టం వర్తిస్తుందన్నారు. అయితే ఈఏడాది కొద్దిగా సడలింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నారు. నాలుగైదు రోజుల్లో పంట నష్టం అంచనాలు తయారు చేయాలని వ్యవసాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పంట నష్టం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అధికంగా పత్తి రైతులు నష్టపోయారని తెలిపారు. వరి, మిర్చి, మొక్కజొన్న కొద్దిగా దెబ్బతిన్నాయన్నారు.
సాధారణంకంటే అధికంగా వర్షం పడటంతో పంటలు బాగాా దెబ్బతిన్నాయన్నారు. గతంలో జల్, నీలమ్ తుపాన్ వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందించలేదని రైతులు ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల రూ. 3 కోట్ల మేర పంట నష్టం చెక్కుల పంపిణీ చేయలేదని అన్నారు. వాటిని సాధ్యమైనంత త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. సీసీఐని కూడా వారం రోజుల్లో రంగంలోకి దింపి తడిచిన పత్తిని సాధ్యమైనంత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట జేడీఏ భాస్కరరావు, ఆర్‌డీఓ దాసరి సంజీవరెడ్డి, డాట్ శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్‌కుమార్, ఉద్యానవన శాఖ ఏడీఏలు జె మరియన్న, కె సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ మధిర ఏడీఏ వి బాబూరావు, కొణిజర్ల, వైరా తహశీల్దార్‌లు టి శ్రీనివాస్, జి శ్రీలత, కొణిజర్ల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓలు డి అరుణకుమారి, బీ నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సర్వే పూర్తై తర్వాతే నివేదిక..
Published Wed, Oct 30 2013 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement