Srinivas Sri Naresh
-
గోదావరి పుష్కరాల్లో జిల్లాకు ప్రత్యేక స్థానం
భద్రాచలం: వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ అన్నారు. 2015 జూలై 14 నుంచి 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలపై అన్ని శాఖల అధికారులతో రామాలయంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల గోదావరి స్నానఘాట్లు ఉన్నాయన్నారు. వీటిలో భద్రాచలంలోనే 13 స్నానఘట్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో పుష్కరాలను విజయవంతం చేసి జిల్లా అధికారులు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని, ట్రాఫిక్‌ను నియంత్రించాలని, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను సమకూర్చాలని సూచిం చారు. ఈ ఏర్పాటుకు అవసరమైన నిధులను కోరేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిపై వంతెన నిర్మాణం కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారం భం కానున్నాయని తెలిపారు. పుష్కరాల సమయంలో అధికారులు, అనధికారులు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుం దన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటించి ప్రజా స్పందనను తెలుసుకుంటూ లోతైన విశ్లేషణతో గతానుభవాలను దృష్టిపెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నివేదికలను ఈనెల 25న జరిగే సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా, ఐటీడీఏ ీపీఓ, ఆర్డీఓ, భద్రాచలం ఏఎస్పీ, ఆలయ ఈఓ సభ్యులుగా ఉంటారని తెలిపారు. పుష్కరాలకు కోటిన్నర భక్తులు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందును జిల్లాలోని ఇతర టూరిజం ప్రదేశాలను వీక్షించేలా ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయన్నారు. పుష్కరాల సందర్భంగా చేసే అభివృద్ధి భద్రాచలంలో ఇతర ఉత్సవాలకు పనిచేసే విధంగా ఉండేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు అధ్యయనం కోసం వారణాసికి బృందాన్ని పంపే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 శాతం మంది ప్రజలకు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం జిల్లా యంత్రాంగానికి దక్కనుందని అన్నారు. పుష్కరాలు జరిగే సమయంలో పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యం తదితర కార్యక్రమాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలకు తగ్గట్టు నిధులు మంజూరు చేయాలన్నారు. స్నానఘాట్ల వద్ద పట్టణ మురుగునీరు గోదావరిలో కలవకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కల్యాణ మండపం నుంచి క్యూలైన్లను ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈఓ టి.రమేష్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్ఓ శివశ్రీనివాస్, ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, భద్రాచలం ఆర్డీఓ అంజయ్య, పాల్వంచ ఆర్డీఓ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాశ్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యు లు పాల్గొన్నారు. సమావేశానికి ముందు శ్రీసీతారామ చంద్రస్వామి వారిని కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్, ఎస్పీ ఎ.వి.రంగాథ్, జేసీ సురేంద్ర మోహన్ దర్శించుకున్నారు. -
మున్సి‘పోల్స్’ను పారదర్శకంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణలో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మధిరలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో జిల్లాపరిషత్ ఆవరణలోని ప్రత్యేకాధికారి ఛాం బర్లో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లకు సమగ్ర అవగాహన ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీల ప్రచార పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశిస్తూ ఆయా పార్టీల ప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే.. వాటి ని గురువారం సాయంత్రం తొలగించాలని చెప్పారు. ఇక ముందు, పార్టీల ప్రచార పోస్టర్లు, బ్యానర్లు ముందస్తు అనుమతితో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచార ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించా రు. పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల సౌకర్యార్థం పోలింగుకు ముందు రోజు ఓటర్ స్లిప్స్‌ను బూత్ లెవెల్అధికారుల ద్వారా ఓటర్లకు పంపిణీ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ సిబ్బం దికి నిర్దేశించిన అంశాల్లో పూర్తి అవగాహన కల్పించేం దుకు వీలుగా డీఆర్డీఏ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్ పత్రం పూర్తి చేసే విధానంపై అభ్యర్థులకు సహకరించాలని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను సమర్థవంతంగా అమలుచేసేందుకు సంచార నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ పరంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సక్రమ నిర్వహణకుగాను సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలకు ఖమ్మం ఆర్డీవోను, ఇల్లందు, కొత్తగూడేనికి కొత్తగూడెం ఆర్డీవోను బాధ్యులుగా నియమించారు. అనంతరం, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై డీఆర్వో, కొత్తగూడెం, ఖమ్మం ఆర్డీవోలతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశాలలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఆర్వో శివశ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి వేణు మనోహర్, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి(ఖమ్మం), అమయ్‌కుమార్(కొత్తగూడెం) పాల్గొన్నారు. -
ఏప్రిల్ 30...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలివిడత ఏప్రిల్ 30న జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 2న కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజునే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 10న పరిశీలన (స్క్రూట్నీ) ఉంటుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 వరకు అవకాశమిస్తారు. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 16న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. 2,259 పోలింగ్ స్టేషన్లు... ఈ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 19,71,797 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 9,75,432 మంది మహిళలు, 9,96,254 మంది పురుషులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 2,259 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 16 వేల బ్యాలెట్ యూనిట్ యంత్రాలు, 10,200 కంట్రోల్ యూనిట్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అదనంగా యంత్రాలను తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. భద్రాచలం డివిజన్లో ఆరు పోలింగ్సెంటర్లలో శాటిలైట్ ద్వారా ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రాచలం డివిజన్లో ఎన్నికల నిర్వహణ నిమిత్తం హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఫొటో స్లిప్‌లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను సైతం వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.16 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అత్యవసర సర్వీసులు మినహా మిగతా సిబ్బంది అందరూ ఎన్నికల నిర్వహణలో పాల్గొనాలని జేసీ కడవేరు సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారుల నియామకం... ఎన్నికలు సజావుగా నిర్వహించేం దుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల ఏర్పాట్లపై పలువురు అధికారులకు కలెక్టర్ విధులు అప్పగించారు. జిల్లా స్ధాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, డిప్యూటీ ఎన్నికల అధికారులుగా ఆర్డీవోలు వ్యవహరిస్తారు. అధికార యంత్రాంగం సమాయత్తం... ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. అధికారులంతా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు తావివ్వవద్దని జేసీ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా కలెక్టరేట్లోని పలు విభాగాల అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టరేట్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. వీటి కోసం అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. 20 అంశాలపై బాధ్యతలు అప్పగించారు. వీరంతా అత్యవసర పనులు మినహా ఎన్నికల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు 12వేల మంది సిబ్బంది: జేసీ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 12 వేల మంది సిబ్బంది అవసరం ఉంటుందని జేసీ సురేంద్రమోహన్ చెప్పారు. ఇప్పటి వరకు 9 వేల మందిని గుర్తించామని, మరో 3 వేల మందిని రెండు, మూడు రోజుల్లో గుర్తిస్తామని వివరించారు. మోడల్ కోడ్ కండక్ట్ నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఫ్లెక్సీలు, ఇతర ప్రచార బ్యానర్లను తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని, ఎటువంటి కోడ్ ఉల్లంఘన జరిగినా ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియామావళిని పాటించాలని సూచించారు. -
వీఆర్వో, వీఆర్ఏ రాత పరీక్షలు సజావుగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చేనెల 2న ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలంలో నిర్వహించే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫ్రెన్స నిర్వహించారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ఏర్పాట్లు, జాతీయ ఓటరు దినోత్సవం, రెవెన్యూ సదస్సులపై జేసీ సురేంద్రమోహన్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వోల పరీక్షలు, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 161 కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ పరీక్షలకు సమన్వయ అధికారిగా, ఆర్డీఓలు అదనపు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలో 78 వీఆర్వో పోస్టులకు 70,055 మంది, 105 వీఆర్ఏ పోస్టులకు 3022 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీఆర్వో, వీఆర్ఏలకు ఉమ్మడిగా 1,194 దరఖాస్తులు అందాయన్నారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. అందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని మండల, డివిజనల్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణపై జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ రంగనాథ్‌తో కలసి వీడియోకాన్ఫిరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షణంగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులతో చర్చించి ఎన్నికల పరంగా సమస్యత్మక, అత్యంత సమస్యత్మక గ్రామాలు, పోలింగ్‌కేంద్రాలను ఈ నెల 27 వరకు గుర్తించాలన్నారు. ఈ నెలాఖరులో రెవెన్యూ, పోలీస్ మండల స్థాయి అధికారులను బదిలీ చేసే అవకాశం ఉన్నందున మండల స్థాయి ఉప తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్రీయాశీలకంగా భగస్వాములు కావాలన్నారు. సరిహద్దు రాష్ట్రాకు సమీపంలో ఉన్న గ్రామాలు, నక్సల్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం ఆర్డీఓలు అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గిరిజన చట్టాల అమలుతోనే సుపరిపాలన
భద్రాచలం, న్యూస్‌లైన్: గిరిజన చట్టాల అమలుతోనే ఏజెన్సీలో సుపరిపాలన సాధ్యమవుతుందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. ‘మన చట్టాలు-మన కోసం’ అనే అంశంపై భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచులు, అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడిన గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన చట్టాలను పకడ్బందీ గా అమలుచేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నా రు. పీసా చట్టం అమలులో గ్రామసభకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. గిరిజన చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకుని, వాటిని ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజానీకానికి ఉపయోగపడేలా అమలు చేయాలని కోరారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గిరిజన ప్రాంతా ల్లో చేపట్టే పనులపై ఇంజనీరింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ వీరపాండియన్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును గిరిజనులు వినియోగించుకునేందుకు వీలుగా అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజన చట్టాలపై ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. పీసా చట్టం గురించి అందరికీ తెలీకపోవడంతో దాని అమలుకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ... నూతన సర్పంచులకు చట్టాలపై అవగాహనకు సదస్సుల ఏర్పాటు అభినందనీయమన్నారు. గ్రామాల్లో ఎల్టీఆర్ కేసుల సత్వర పరిష్కారానికి తహశీల్దారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో భద్రాచలం ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సర్వే పూర్తై తర్వాతే నివేదిక..
కొణిజర్ల, న్యూస్‌లైన్: అల్పపీడనం, పై-లీన్ తుపాన్ల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. మంగళవారం ఆయన కొణిజర్ల, వైరా మండలాల్లో తడిచిన పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. ముందుగా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మొలకలు వచ్చిన పత్తి, కుళ్లిన కాయలను ఆయనకు చూపించారు. అధికారులు రోడ్ల వెంట ఉన్న పొలాలే చూపిస్తున్నారని, గ్రామాల్లో ఇంత కంటే దారుణంగా పంటలు ఎండిపోయాయని, మారుమూల గ్రామాలకు వచ్చి పరిశీలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం పంట నష్టం, దిగుబడుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగారు. ఆ తర్వాత వైరా మండలం గొల్లపూడి శివారులోని పత్తి, మిర్చి తోటలను పరిశీలించారు. వైరా మండలంలో ఒక్కసారి కూడా పత్తి తీయలేదని, పత్తి రైతులు దారుణంగా నష్టపోయారని, పత్తి మొక్కలు వచ్చాయని, తీసిన పత్తి కూలీల వేతనాలకే సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం పంట నష్టం సర్వే పూర్తయిన తర్వాతే పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతానికి పైన నష్టం జరిగితేనే పంట నష్టం వర్తిస్తుందన్నారు. అయితే ఈఏడాది కొద్దిగా సడలింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నారు. నాలుగైదు రోజుల్లో పంట నష్టం అంచనాలు తయారు చేయాలని వ్యవసాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పంట నష్టం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అధికంగా పత్తి రైతులు నష్టపోయారని తెలిపారు. వరి, మిర్చి, మొక్కజొన్న కొద్దిగా దెబ్బతిన్నాయన్నారు. సాధారణంకంటే అధికంగా వర్షం పడటంతో పంటలు బాగాా దెబ్బతిన్నాయన్నారు. గతంలో జల్, నీలమ్ తుపాన్ వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందించలేదని రైతులు ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల రూ. 3 కోట్ల మేర పంట నష్టం చెక్కుల పంపిణీ చేయలేదని అన్నారు. వాటిని సాధ్యమైనంత త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. సీసీఐని కూడా వారం రోజుల్లో రంగంలోకి దింపి తడిచిన పత్తిని సాధ్యమైనంత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట జేడీఏ భాస్కరరావు, ఆర్డీఓ దాసరి సంజీవరెడ్డి, డాట్ శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్‌కుమార్, ఉద్యానవన శాఖ ఏడీఏలు జె మరియన్న, కె సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ మధిర ఏడీఏ వి బాబూరావు, కొణిజర్ల, వైరా తహశీల్దార్లు టి శ్రీనివాస్, జి శ్రీలత, కొణిజర్ల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓలు డి అరుణకుమారి, బీ నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేకం’ అస్తవ్యస్తం..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. మొన్నటి వరకు పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, ఎన్నికల అనంతరం కొంత గాడిలో పడింది. అయితే జిల్లా, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో మాత్రం ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతూనే ఉంది. ఇది వారికి అదనపు బాధ్యత కావడంతో ఎక్కడికక్కడ పాలన నత్తనడకన సాగుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. వీటికి స్పెషలాఫీసర్లుగా ఉన్నవారు జిల్లాస్థాయి అధికారులు కావడంతో మండలాలపై దృష్టి సారించలేకపోతున్నారు. వారికి తీరిన సమయంలో అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహించి వ దిలేస్తున్నారు. దీంతో మండలస్థాయిలో నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, కొత్తగూడెం మున్సిపాలిటీకి జేసీ సురేంద్రమోహన్, పాల్వంచ మున్సిపాలిటీకి ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, సత్తుపల్లికి ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరు జిల్లా, డివిజన్ స్థాయి సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో పట్టణాల్లో, మండలాల్లో సమస్యల పై దృష్టి సారించలేకపోతున్నారు. జీతభత్యాలు, ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఉద్యోగులే ఆయా అధికారుల వద్దకు వెళ్లి ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే పాలక వర్గాలు ఉంటే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమావేశాల్లో తీర్మానాలు చేసి ఎక్కడ సమస్యలున్నాయి... వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై చర్చలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునేవారని పలువురు అంటున్నారు. అధికారులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో పర్యటించకపోవడంతో స్థానిక సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు నెలకొన్నాయి. గ్రా మాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ము రుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో చెత్తాచెదా రం పేరుకుపోయి చిన్నపాటి వర్షాలకే వీధులన్నీ బురదమయమవుతున్నాయి. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద మొదలైం ది. కనీసం దోమల నివారణకు మురికి కాలువల్లో ఆ యిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ చే యడం వంటి చర్యలేవీ చేపట్టడం లేదు. మండల, జి ల్లా పరిషత్‌లకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పల్లెలను, పట్టణాలను పట్టించుకునేవారే కరువయ్యారు. పంచాయతీలకు నిధుల కొరత.. పంచాయతీలలో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు నిధులు లేవు. ఇప్పటికే బ్లీచింగ్ అందుబాటులో ఉంచడంతో పాటు స్ప్రే, ఫాగింగ్ కూడా ప్రారంభించాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో దోమలు ప్రబ లి, ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి పనిభారం ఎక్కువై ఆయా గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై దృష్టి సారించడం లేదు. గ్రామాల్లో తాగునీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇళ్లల్లోని మురుగునీరు ఒకేచోట చేరడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మురుగునీరు నిల్వ కారణంగా దోమలు, క్రిములు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికితోడు పందులు జనావాసాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మంచినీటి పైపులైన్లు లీకవుతున్నాయి. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ కొరవడి పలు ప్రాంతాల్లో కలుషిత నీరే సరఫరా అవుతోంది. ప్రజలు ఆ నీటిని తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు. మొక్కుబడిగా పర్యటనలు మాతృశాఖలో సమస్యల పరిష్కారానికి సతమతమవుతున్న అధికారులు మండలస్థాయిలో సమస్యలను పట్టించుకోలేకపోతున్నారు. ప్రత్యేకాధికారులుగా ఉన్న వీరు ఆరునెలలకు ఒకసారి మొక్కుబడిగా ఆయా మండలాలకు వెళ్లి తూతూమంత్రంగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పింఛన్ల కోసం ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు సాగడం లేదు. మండలంలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిన ప్రత్యేక అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో మూలుగుతున్న నిధులు... మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కోట్ల రూపాయల నిధు లు మూలుగుతున్నప్పటికీ వాటిని ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించే పాలకవర్గాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ నిధులు మురిగిపోయే అవకాశం కూడా ఉంది. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించాలో అర్థం కాని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. ప్రత్యేకాధికారులు మున్సిపాలిటీలపై దృష్టి సారిస్తే వీధి దీపాలు, డ్రెయిన్లు, రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ఆశిస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా జనాభాలో 50 శాతానికంటే ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు, వారు అన్ని రంగాల్లో పోటీ పడేందుకు అనువైన వాతావరణానికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని కోరారు. వైవిధ్యమైన పరిస్థితులున్న ఈ జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 2009 నుంచి 2012 వరకు నమోదైన కేసుల్లో 152 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిందని చెప్పారు. 96 కేసులు పోలీసుల విచారణలో ఉన్నాయని చెప్పారు. వీటిలో 19 కేసులు కొత్తగూడెం డివిజన్లో ఉన్నాయన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు. కులాంతర వివాహం చేసుకున్న 106 జంటలకు ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో పెద్దల భాగస్వామ్యంతో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ ఎవి.రంగనాధ్ మాట్లాడుతూ.. హైకోర్టులో, ఇతర కోర్టుల్లోగల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతంగా సాగేలా సహకరించేందుకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూసేందుకు హైదరాబాద్‌లో పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. 2011లో 187, 2012లో 133 నమోదయ్యాయని చెప్పారు. 2013లో ఈ కేసుల సంఖ్య 100 కు మించకపోవచ్చని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చట్టపరంగా సంక్రమించిన హక్కుల పరిరక్షణకు అండగా నిలవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. గిరిజనులపై కేసులను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావు, ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య, ఆర్డీవోలు సంజీవరెడ్డి, అమయ్‌కుమార్, శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీలు తిరుపతి, అశోక్‌కుమార్, రవీందర్రావు, బాలకిషన్‌రావు, కృష్ణ, సాయిశ్రీ, ఎస్సీ-ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురుమూర్తి, రవికుమార్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.