ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. మొన్నటి వరకు పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, ఎన్నికల అనంతరం కొంత గాడిలో పడింది. అయితే జిల్లా, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో మాత్రం ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతూనే ఉంది. ఇది వారికి అదనపు బాధ్యత కావడంతో ఎక్కడికక్కడ పాలన నత్తనడకన సాగుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. వీటికి స్పెషలాఫీసర్లుగా ఉన్నవారు జిల్లాస్థాయి అధికారులు కావడంతో మండలాలపై దృష్టి సారించలేకపోతున్నారు. వారికి తీరిన సమయంలో అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహించి వ దిలేస్తున్నారు. దీంతో మండలస్థాయిలో నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, కొత్తగూడెం మున్సిపాలిటీకి జేసీ సురేంద్రమోహన్, పాల్వంచ మున్సిపాలిటీకి ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, సత్తుపల్లికి ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరు జిల్లా, డివిజన్ స్థాయి సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో పట్టణాల్లో, మండలాల్లో సమస్యల పై దృష్టి సారించలేకపోతున్నారు.
జీతభత్యాలు, ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఉద్యోగులే ఆయా అధికారుల వద్దకు వెళ్లి ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే పాలక వర్గాలు ఉంటే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమావేశాల్లో తీర్మానాలు చేసి ఎక్కడ సమస్యలున్నాయి... వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై చర్చలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునేవారని పలువురు అంటున్నారు. అధికారులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో పర్యటించకపోవడంతో స్థానిక సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు నెలకొన్నాయి. గ్రా మాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ము రుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో చెత్తాచెదా రం పేరుకుపోయి చిన్నపాటి వర్షాలకే వీధులన్నీ బురదమయమవుతున్నాయి. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద మొదలైం ది. కనీసం దోమల నివారణకు మురికి కాలువల్లో ఆ యిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ చే యడం వంటి చర్యలేవీ చేపట్టడం లేదు. మండల, జి ల్లా పరిషత్‌లకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పల్లెలను, పట్టణాలను పట్టించుకునేవారే కరువయ్యారు.
పంచాయతీలకు నిధుల కొరత..
పంచాయతీలలో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు నిధులు లేవు. ఇప్పటికే బ్లీచింగ్ అందుబాటులో ఉంచడంతో పాటు స్ప్రే, ఫాగింగ్ కూడా ప్రారంభించాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో దోమలు ప్రబ లి, ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి పనిభారం ఎక్కువై ఆయా గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై దృష్టి సారించడం లేదు. గ్రామాల్లో తాగునీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇళ్లల్లోని మురుగునీరు ఒకేచోట చేరడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మురుగునీరు నిల్వ కారణంగా దోమలు, క్రిములు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికితోడు పందులు జనావాసాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మంచినీటి పైపులైన్లు లీకవుతున్నాయి. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ కొరవడి పలు ప్రాంతాల్లో కలుషిత నీరే సరఫరా అవుతోంది. ప్రజలు ఆ నీటిని తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు.
మొక్కుబడిగా పర్యటనలు
మాతృశాఖలో సమస్యల పరిష్కారానికి సతమతమవుతున్న అధికారులు మండలస్థాయిలో సమస్యలను పట్టించుకోలేకపోతున్నారు. ప్రత్యేకాధికారులుగా ఉన్న వీరు ఆరునెలలకు ఒకసారి మొక్కుబడిగా ఆయా మండలాలకు వెళ్లి తూతూమంత్రంగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పింఛన్‌ల కోసం ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు సాగడం లేదు. మండలంలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిన ప్రత్యేక అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీల్లో మూలుగుతున్న నిధులు...
మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కోట్ల రూపాయల నిధు లు మూలుగుతున్నప్పటికీ వాటిని ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించే పాలకవర్గాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ నిధులు మురిగిపోయే అవకాశం కూడా ఉంది. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించాలో అర్థం కాని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. ప్రత్యేకాధికారులు మున్సిపాలిటీలపై దృష్టి సారిస్తే వీధి దీపాలు, డ్రెయిన్‌లు, రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ఆశిస్తున్నారు.
‘ప్రత్యేకం’ అస్తవ్యస్తం..
Published Tue, Oct 29 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement