ఎన్బీటీ నగర్‌లో హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్న మేయర్ విజయలక్ష్మి
బంజారాహిల్స్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల పరిధిలో వీర్‌నగర్, ప్రేమ్‌నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జోన్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. రోజువారి పర్యవేక్షణ కూడా అవసరం.
►పర్యవేక్షణ కరువు.. మేయర్
►దృష్టిసారిస్తేనే ముందుకు..
►మైక్రో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గత వారం రోజుల నుంచి సంబంధిత సిబ్బంది, అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కనీసం అటువైపు తొంగిచూడటం లేదు.
►తాజాగా బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ జోన్‌లో క్రిమి సంహారక స్ప్రే (ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని)ను చేయించారు. ఇదంతా రోజువారి కార్యక్రమం కాగా మేయర్ దృష్టిసారిస్తేనే సంబంధిత సిబ్బంది ఒక రోజుకు కదిలారు.
మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు..
►శానిటైజేషన్ చేపట్టేందుకు ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
►ఇటీవల నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ లు మాత్రం నిర్వహించారు.
►మైక్రో కంటైన్మెంట్ ఏర్పాటు చేసినట్లు కొంత మంది అధికారులకు సమాచారమే లేదని తెలుస్తుంది.
►మైక్రో డిపార్ట్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు జారీ కాలేదని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఒకరు స్పష్టం చేశారు.
►ఈ విషయంపై ఖైరతాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.
►మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పర్యటించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి.
►ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరగకుండా నిబంధనలు ఉండాలి.
►ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించిన తర్వాతనే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది.
►నిత్యం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది.
►ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్‌లో ఉందని బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికులను అప్రమత్తం కూడా చేయాల్సి ఉంటుంది.
►ఇలాంటి ప్రోటోకాల్స్ ఏవీ మైక్రో ఈ జోన్లలో అమలు చేయడం లేదు.
►తమ నివాసిత ప్రాంతం కంటైన్మెంట్ జోన్‌లో ఉందనే విషయమే అక్కడ ప్రజలకు తెలియదంటూ కోవిడ్–19పై అధికారులు ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
►మాకు ఎలాంటి సూచన లేదు.. మేమేం చేయాలి..
►సరైన సూచనలు, జాగ్రత్తలు లేకపోతే తాము మాత్రం ఏం చేయాలంటూ జీహెచ్‌ఎంసీ కింది స్థాయి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు.
►మేయర్ కదిలింది కాబట్టి ఒక రోజు స్ప్రే చేశారు.
►మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అధికారులకే తెలియాలి.
►మైక్రో కంటైన్మెంట్ జోన్ అన్నది కాగితం మీదనే కనబడుతున్నదని క్షేత్రస్థాయిలో దాని జాడే లేదని స్థానికులు దుయ్యబడతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment