భద్రాచలం: వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ అన్నారు. 2015 జూలై 14 నుంచి 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలపై అన్ని శాఖల అధికారులతో రామాలయంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల గోదావరి స్నానఘాట్లు ఉన్నాయన్నారు.
వీటిలో భద్రాచలంలోనే 13 స్నానఘట్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో పుష్కరాలను విజయవంతం చేసి జిల్లా అధికారులు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని, ట్రాఫిక్‌ను నియంత్రించాలని, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను సమకూర్చాలని సూచిం చారు. ఈ ఏర్పాటుకు అవసరమైన నిధులను కోరేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిపై వంతెన నిర్మాణం కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారం భం కానున్నాయని తెలిపారు.
పుష్కరాల సమయంలో అధికారులు, అనధికారులు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుం దన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటించి ప్రజా స్పందనను తెలుసుకుంటూ లోతైన విశ్లేషణతో గతానుభవాలను దృష్టిపెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నివేదికలను ఈనెల 25న జరిగే సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా, ఐటీడీఏ ీపీఓ, ఆర్‌డీఓ, భద్రాచలం ఏఎస్‌పీ, ఆలయ ఈఓ సభ్యులుగా ఉంటారని తెలిపారు.
పుష్కరాలకు కోటిన్నర భక్తులు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందును జిల్లాలోని ఇతర టూరిజం ప్రదేశాలను వీక్షించేలా ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయన్నారు. పుష్కరాల సందర్భంగా చేసే అభివృద్ధి భద్రాచలంలో ఇతర ఉత్సవాలకు పనిచేసే విధంగా ఉండేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు అధ్యయనం కోసం వారణాసికి బృందాన్ని పంపే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 శాతం మంది ప్రజలకు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం జిల్లా యంత్రాంగానికి దక్కనుందని అన్నారు. పుష్కరాలు జరిగే సమయంలో పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యం తదితర కార్యక్రమాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలకు తగ్గట్టు నిధులు మంజూరు చేయాలన్నారు.
స్నానఘాట్ల వద్ద పట్టణ మురుగునీరు గోదావరిలో కలవకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కల్యాణ మండపం నుంచి క్యూలైన్లను ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈఓ టి.రమేష్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో డీఆర్‌ఓ శివశ్రీనివాస్, ఏఎస్‌పీ ప్రకాశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, భద్రాచలం ఆర్‌డీఓ అంజయ్య, పాల్వంచ ఆర్‌డీఓ సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాశ్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యు లు పాల్గొన్నారు. సమావేశానికి ముందు శ్రీసీతారామ చంద్రస్వామి వారిని కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్, ఎస్పీ ఎ.వి.రంగాథ్, జేసీ సురేంద్ర మోహన్ దర్శించుకున్నారు.
గోదావరి పుష్కరాల్లో జిల్లాకు ప్రత్యేక స్థానం
Published Sat, Jul 12 2014 2:41 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement