రైతులికి అండగా నిలవండి: పొంగులేటి
ఖమ్మం: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపి, రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గురువారం లేఖ రాశారు. దేశంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే గడిచింది.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని తెలిపారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాగునీరు, ఎరువులు, విత్తనాల కొరతతో పాటు సరిపడా విద్యుత్ సదుపాయాలు లేక ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అప్పల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. 13 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు సాగించిన టీఆర్‌ఎస్ కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుందనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, కానీ ఆది నుంచి పాలకులు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు అరకొరగా రుణాలు మాఫీ చేసి ఎప్పటికప్పుడు ఏదో వంక చూపుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రస్తుతం రానున్న మూడేళ్ల వరకు విద్యుత్ ఊసే ఎత్త వద్దనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా 4.42 శాతం విద్యుత్‌చార్జీలు పెంచడంతో ప్రజానీకంపై రూ.816 కోట్ల భారం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ దానికి రాజకీయ రంగులు పులమడంతో అధికార పార్టీ నేతల జేబులు నిండుతున్నాయే తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. వీలైనంత త్వరగా చెరువులు, కుంటల్లో పూడికతీత కార్యక్రమం నిర్వహిస్తే వచ్చే వర్షాకాలంలో చెరువులు నిండి వచ్చే ఏడాదైనా సాగునీటి కొరత తీరుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,24,544 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అందులో 1,39,512 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 85,032 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయినట్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా 93,827 ఎకరాల్లో వరి, 70,371 ఎకరాల్లో మామిడిపంటలు వడగండ్ల వానలకు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జిల్లాల వారీగా రైతులకు వాటిల్లిన నష్టాల గురించి, అలాగే రైతాంగం పట్ల ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరును లేఖలో ఎంపీ లేఖలో పేర్కొన్నారు.