‘ఉప పోరు’లోనే గుణపాఠం | government ignores employers demands | Sakshi
Sakshi News home page

‘ఉప పోరు’లోనే గుణపాఠం

Jul 30 2017 2:38 AM | Updated on Oct 19 2018 8:10 PM

‘ఉప పోరు’లోనే గుణపాఠం - Sakshi

‘ఉప పోరు’లోనే గుణపాఠం

ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. 2016 జూలై, 2017 జనవరి, 2017 జూలై వరకు డీఏ ఇవ్వాల్సి ఉంది.

ఉద్యోగుల డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
పెండింగ్‌లోనే మూడు విడతల డీఏ
10 నెలల పీఆర్‌సీ అరియర్స్‌ విడుదల ఎప్పుడో?
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలోనూ   నిర్లక్ష్యమే..
సమాయత్తం అవుతున్న ఉద్యోగులు


కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.  మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. 2016 జూలై, 2017 జనవరి, 2017 జూలై వరకు డీఏ ఇవ్వాల్సి ఉంది. 10 నెలల పీఆర్‌సీ అరియర్స్‌ ఏళ్లుగడుస్తున్నా అతీగతీ లేదు. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు చేయలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి నంద్యాల ఉప ఎన్నికలో బుద్ధి చెప్పడానికి ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు.

 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చి ప్రస్తుతం సాకులు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. 2018 జూలై 1నాటికి 11వ పీఆర్‌సీ అమలులోకి రావాల్సి ఉంది. ఇంతవరకు 11వ వేతన సవరణకు కమిషన్‌నే ఏర్పాటు చేయలేదు. ఆ దిశగా కనీస చర్యలు లేవు. ఉద్యోగులకు క్యాస్‌లెస్‌ వైద్యానికి జారీ చేసిన హెల్త్‌ కార్డులను కార్పొరేట్‌ వైద్యశాలలు పట్టించుకోవడంలేదు. ఇలా ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ప్రజాధనాన్ని విదేశీ పర్యటనలకు, ప్రచారానికి, జిల్లాల పర్యటనలకు అడ్డగోలుగా ఖర్చు చేస్తూ ఉద్యోగుల విషయానికి వచ్చే సరికి రాష్ట్రం లోటు బడ్జెట్‌తో నడుస్తుందని చెప్పడం సర్వసాధారణమైంది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధిచిన డిమాండ్‌లపై నిర్లక్ష్య ధోరిణిలో ఉండటం పట్ల ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఏ ఉద్యోగిని కదిలించినా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు.

నంద్యాల ఉపఎన్నిక చక్కటి వేదిక..
నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏదో విధంగా గెలుపొందేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారం అండతో సామ, ధాన దండోపాయాలకు పాల్పడుతోంది. తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేయడానికి నంద్యాల ఉప ఎన్నిక చక్కటి అవకాశమని ఉద్యోగులు బావిస్తున్నారు. అనేక డిమాండ్‌లను ప్రక్కనపెట్టడం ఒక ఎత్తు అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత పనితీరునుబట్టి కొనసాగించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.


డీఏ వెంటనే ఇవ్వాలి
2016 జూలై1, 2017 జనవరి, 2017 జూలై వరకు మొత్తం మూడు డీఏలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. డీఏలను విడుదల చేయడంలో జాప్యం చేయరాదు. డీఏలను ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. అదే విధంగా 10 నెలల పీఆర్‌సీ అరియర్స్‌ను విడుదల చేయడంలో ప్రభుత్వం చొరువ తీసుకోవాలి. ఉద్యోగుల డిమాండ్‌ల పరిష్కారంలో నాన్చివేత తగదు. వెంటనే చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మినారాయణ, జాయింట్‌
సెక్రటరీ, జిల్లా ఎన్‌జీఓ
అసోసియేషన్‌


11వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి
11వ వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం వెంటనే నియమించాలి. నిబందనల ప్రకారం 2018 జూలై1 నాటికి 11వ వేతన సవరణ అమలులోకి రావాల్సి ఉంది.కాని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే 11వ వేతన సవరణకు కమిషన్‌ వేయాలి. 50 ఏళ్ల దాటిన తర్వాత పనితీరును బట్టి ఉద్యోగంలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే యత్నాల్లో ఉండటం దారుణం. ఇటువంటి ఆలోచనను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికే నష్టం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. – పి.రామకృష్ణారెడ్డి, కోశాధికారి, జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్‌


డిమాండ్లు పరిష్కరించాలి
ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్‌లను పరిష్కరించడానికి వెంటనే చొరవ తీసుకొవాలి. మూడు విడతల డీఏ, 10 నెలల పీఆర్‌సీ అరియర్స్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందువల్ల ప్రభుత్వంపై ఉద్యోగులకు అసంతృప్తి పెరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను విధిగా క్రమబద్దీకరించాల్సిందే. ఇందులో రాజీ పడం. చట్టాలను మార్పు చేసుకొని రెగ్యులర్‌ చేయాలి. 11 వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. – జవహర్‌లాల్, జిల్లా కార్యదర్శి,
ఎన్‌జీఓ అసోసియేషన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement