సాక్షి, కాకినాడ :అవి పేదల భూములా, ప్రభుత్వ భూములా..అనే తేడా లేదు- కన్నుపడితే అన‘కొండ’లా దిగమింగాల్సిందే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేయాల్సిందే. బ్లాక్‌మెయిలింగ్‌లు, సెటిల్‌మెంట్లతో అందినకాడికి దోచుకోవడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా సాగిన అన‘కొండ’ హయాంను గుర్తుకు తెచ్చుకుంటున్న కాకినాడ నగరవాసులు.. మళ్లీ ఓటడుగుతున్న ఆయనను చూసి విస్తుపోతున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తన హయాంలో సాగించిన భూ కబ్జాలు ఎన్నో. నిరుపేద విద్యార్థులకు విద్యాదానం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ట్రస్ట్ భూములను సైతం నిస్సంకోచంగా తమ కుటుంబం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని, దర్జాగా అనుభవిస్తున్న చరిత్ర కొండబాబుది.
కాకినాడలో పైండా సూర్యనారాయణమూర్తి అనే వితరణశీలి తన తాతగారైన పైండా వెంకట రామకృష్ణ (పీవీఆర్ ట్రస్ట్) పేరిట పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే నిమిత్తం 16.29 ఎకరాల భూమిని ఉదారంగా దానమిచ్చారు. అక్కడ 1968 నుంచి సంస్కృత కళాశాల నిర్వహించగా, 1972లో పైండా ఆండాళ్లమ్మ జూనియర్ కాలేజీని, 1974లో డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. సూర్యనారాయణమూర్తి ఇచ్చిన భూముల్ని ల్యాండ్ సీలింగ్‌లో చూపించి ప్రభుత్వం స్వాధీన పర్చుకునేందుకు ప్రయత్నించగా వివాదం ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కెళ్లింది. 1983లో సూర్యనారాయణమూర్తి గిఫ్ట్ డీడ్‌ను ఆమోదిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. ఈ భూములపై తామే హక్కుదార్లమంటూ కౌలుదార్లు 1986లో కోర్టును ఆశ్రయించగా..వారికి, ట్రస్ట్‌కు మధ్య మున్సిఫ్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
కారుచౌకగా ఆరెకరాలు సొంతం..
వాస్తవం ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూముల్లో ఆరెకరాలను బినామీ హక్కుదార్ల ద్వారా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భార్య శ్రీదేవి పేరిట సర్వే నంబర్ 197/9లో 1.50 ఎకరాలను డాక్యుమెంట్ నం: 6460/ 2001తో 2001 ఆగస్టు ఆరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదే సర్వే నెంబర్‌లో 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6459/ 2001తో తన సోదరుడు వనమాడి సత్యనారాయణ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్టుమెంట్ నంబర్ 6458/2001తో తల్లి సుబ్బాయమ్మ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6457/2001తో తండ్రి లోవరాజు పేరిట కొండబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
కొండబాబు కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన యనమండ్ర మహాలక్ష్మి, నర్సమాంబ, బాలాత్రిపుర సుందరిల నుంచి ఈ ఆరెకరాల భూమిని కేవలం ఎకరం రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలకు కారు చౌకగా కొట్టేశారు. ఈ భూములను ఆనుకొని ఉన్న స్థలాల్లో నేడు గజం రూ.10 వేలకు పైగా పలుకుతోంది. అంటే కొండబాబు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల విలువ ఎంత తక్కువ లెక్కేసుకున్నా నేడు పాతిక కోట్లకు పైమాటే. ఈ భూములు పీవీఆర్ ట్రస్ట్‌కు చెందినవి కావని కొండబాబు కుటుంబసభ్యులు వాదిస్తుండగా, కౌలుదారుల చేతుల్లో ఉన్న తమ భూములనే ఇలా బినామీ హక్కుదార్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిథిల భవనాల్లోనే వెయ్యి మంది చదువు..
ఈ భూముల్లో తన భార్య పేరిట ఉన్న 1.50 ఎకరాలకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చిన కొండబాబు వాటి మార్కెట్ విలువ కేవలం రూ.40 లక్షలుగానే పేర్కొనడం గమనార్హం. ఒకపక్క విలువైన భూములు కబ్జాకారుల కోరల్లో చిక్కుకోవడం, మరో పక్క మిగిలిన భూములన్నీ కోర్టు వివాదాల్లో నలిగిపోతుండడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే పీవీఆర్ ట్రస్ట్ నిర్వహణలోని సంస్కృత, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులు మగ్గాల్సి వస్తోంది. కోట్లాది విలువైన భూములున్నా.. వాటి ద్వారా ఆదాయం లేకపోవడంతో దాతలిచ్చే విరాళాలతోనే విద్యార్థులు చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దాతలు ఉదాత్త ఆశయంతో ఇచ్చిన భూములను దొడ్డిదారిన కాజేసిన కొండబాబు తీరును గర్హిస్తున్న నగర ప్రజలు.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గెలిపించండని కోరుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
భూకబ్జాల అనకొండబాబు
Published Mon, Apr 28 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement